Friday, April 17, 2026
E-PAPER
Homeఖమ్మంబోనకల్ లో మొక్కజొన్న కొనుగోలు నిలిపివేత 

బోనకల్ లో మొక్కజొన్న కొనుగోలు నిలిపివేత 

- Advertisement -

కొనుగోలు చేయకపోవడంతో కేంద్రంలో పడిగాపులు కాస్తున్న అన్నదాతలు 
గోడౌన్ల కొరతతో కొనుగోలు నిలిపివే
జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు 
నవతెలంగాణ – బోనకల్ 

బోనకల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో శుక్రవారం నుంచి కొనుగోలను నిలిపివేశారు. జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కొనుగోలను నిలిపివేస్తున్నట్లు సీఈవో అంబటి సంపత్ కుమార్ తెలిపారు. మరల ఆదేశాలు ఇచ్చేవరకు కొనుగోలు చేయవద్దని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నలను నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లు కొరత వల్లే కొనుగోలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. గురువారం సంచుల కొరత తో కేవలం ఇద్దరి రైతుల మొక్కజొన్నల మాత్రమే కాటా వేసి నిలిపివేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరధిలోనే బోనకల్ సొసైటీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 6 వ తేదీన ప్రారంభించారు. ఆ రోజు నుంచి నేటి వరకు 5,000 క్వింటాలను కొనుగోలు చేసినట్లు కొనుగోలు కేంద్రం అధికారులు తెలిపారు.

బోనకల్ సొసైటీ పరిధిలోనే బోనకల్, చిరునోముల గ్రామాలు ఉన్నాయి. చిరునోముల గ్రామంలో 1435 ఎకరాలలో, బోనకల్ గ్రామంలో 1052 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. సొసైటీ పరిధిలో మొత్తం 2,487 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఈ 2,487 ఎకరాలకు గాను ఎకరానికి 40 క్వింటాల చొప్పున మొత్తం 99,480 దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రం అధికారులు మాత్రం ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.

బోనకల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిధిలో మొత్తం 99,480 కింటాలు దిగుబడి రాగా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయిన ఐదువేల క్వింటాలు పోగా ఇంకా 94, 480 క్వింటాలను కొనుగోలు చేయవలసి ఉంది. ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తే ఇంకా రైతుల వద్ద 34,818 క్వింటాలు మిగిలి ఉంటాయి. ప్రస్తుతం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా కేంద్రంలోని నిల్వ ఉన్నాయి. వారం పది రోజుల నుంచి కొనుగోలు కేంద్రాన్ని తీసుకువచ్చిన మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రం అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తమ మొక్కజొన్నల వద్దనే ప్రతిరోజు పడిగాపులు కాస్తున్నారు. కాటా వేసిన దగ్గర నుంచి దిగుమతి చేసేంతవరకు ఆ మొక్కజొన్నల బాధ్యత రైతు దేనిని కొనుగోలు కేంద్రం అధికారులు స్పష్టం చేయటంతో రైతులలో ఒక రకమైన ఆందోళన నెలకొని ఉంది. కొనుగోలు కేంద్రంలో స్థలం లేక కొంతమంది రైతులు ఎదురుగా ఉన్న సాయిబాబా దేవాలయం పక్కన ఆరబోశారు. 

వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే ఉంటున్న: షేక్ నజీర్, రైతు, ముష్టికుంట్ల
మూడు ఎకరాలకు సంబంధించి మొక్కజొన్నలను వారం రోజుల క్రితం బోనకల్ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాను. కొనుగోలు కేంద్రం అధికారులు తెలిపిన ప్రకారమే ప్రస్తుతం మొక్కజొన్నలు ఉన్నాయి. కానీ గోడౌన్ కొరత వలన మొక్కజొన్నలను కాటా వేయటం లేదు. మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోవడంతో ప్రతిరోజు మొక్కజొన్నల వద్దని పడికాపులు కాయవలసి వస్తుందన్నారు. ఎకరానికి కేవలం 26 కింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారని మరి మిగిలిన పంటను ఎవరికి అమ్ముకోవాలి. 

పంట కొనుగోలు నుంచి దిగుమతి వరకు రైతుదే బాధ్యత: 
పంటను కొనుగోలు చేసే తిరిగి అది దిగుమతి అయ్యేవరకు పూర్తి బాధ్యత సంబంధిత రైతుది మాత్రమేనని కొనుగోలు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణం చేత దిగుమతి చేసుకోకుండా వెనకకు పంపిస్తే ఆ రవాణా ఖర్చులు మొత్తం కూడా రైతులే భరించాలన్నారు.

తిరిగి ఆదేశాలు వచ్చేవరకు కొనుగోలు నిలిపివేత: 
జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఉదయమే గోడౌన్ల కొరత ఉందని వెంటనే కొనుగోలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు కొనుగోలు కేంద్రం అధికారులు తెలిపారు. తిరిగి తాము ఆదేశాలు ఇచ్చేవరకు ఒక్క బస్తా కూడా కొనవద్దని, ఒకవేళ కొనుగోలు చేస్తే సంబంధిత సీఈఓ నే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిపారు.

తరచూ ఆన్లైన్ సమస్య:
ప్రతిరోజు ఆన్లైన్లో సమస్య ఏర్పడుతుందని కొనుగోలు కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీనివలన కూడా కొనుగోలులో ఆలస్యం అవుతుందని తెలిపారు. ఆన్లైన్ చేయడానికి ప్రత్యేకంగా ఒక మనిషి కార్యాలయంలోనే ఉండవలసి వస్తుంది అన్నారు. సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు. గ్రామాలలోకి వెళ్లి మొక్కజొన్నలను కొనుగోలు చేసే పరిస్థితులు తాము లేమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -