నవతెలంగాణ-రాయికల్
మండలంలోని మైతాపూర్ గ్రామంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్లే రహదారి సమస్యను వెంటనే పరిష్కరించి,ప్రభుత్వ నక్ష ప్రకారం హద్దులు ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు తహసీల్దార్ నాగార్జునకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని గనె గుట్టపై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధికి రాజ్యసభ సభ్యుడు దినకోండ దామోదర్ రావు నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేసి సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే పక్కనే ఉన్న పట్టా భూమి యజమాని రహదారికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే అధికారులు గ్రామానికి వచ్చి నక్ష ప్రకారం భూమి కొలతలు వేసి హద్దులు ఏర్పాటు చేసినా,వాటిని తొలగించడంతో సమస్య కొనసాగుతోందన్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామానికి వచ్చి హద్దులు పునఃస్థాపించి రహదారి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బూస గంగ మల్లయ్య,అనుమల్ల రమ,భూపెల్లి పరమేశ్వర్,తొగిటి నవీన్ కుమార్,బత్తిని శ్రీనివాస్ గౌడ్,ఆలయ కమిటీ చైర్మన్ రాజనాల మధు కుమార్,నాయకులు అనుమల్ల సత్యనారాయణ,కొల్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.



