Saturday, April 18, 2026
E-PAPER
Homeకరీంనగర్సెస్ ను ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్రలు

సెస్ ను ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్రలు

- Advertisement -

రూ.30 వేల కోట్ల నష్టంలో ఉన్న ఎన్పీడీసీఎల్ లో లాభాల ‘ సెస్ ‘ను ఎలా విలీనం చేస్తారు
పద్ధతి పాటించకుండా పోలీసు పహరాల మధ్య స్వాధీనపరుచుకోవడం అక్రమం
రాజకీయ  దురుద్దేశంతో సెస్ స్వాధీన
తమ 39 మాసాల పాలనలో ఎక్కడ అవినీతి జరగలేద
కృష్ణయ్య కమీషన్  అవినీతి లేదని క్లీన్  చీట్ రిపోర్ట్ ఇచ్చింది
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

వందలాదిమంది పోలీసు పహరాల మధ్య, నిబంధనలు పాటించకుండా ” సెస్ “సంస్థ ను ఎన్పీడీసీఎల్ స్వాధీనం చేసుకోవడం అక్రమమని, లాభాల బాటలో ఉన్న ఈ సంస్థ ను 30 వేల కోట్ల నష్టం లో ఉన్న ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయడం దారుణమని సిరిసిల్ల సహకారం విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) చైర్మన్ చిక్కాల రామారావు ఆరోపించారు. శుక్రవారం సెస్ సంస్థలోని తన చాంబర్ లో డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సెస్ సంస్థను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకున్న సంఘటనగా పేర్కొంటూ పరిస్థితులను వివరించారు. ఈనెల 1న పోలీసు బలగాలు స్థానిక పోలీసుల సహకారంతో  సంస్థను చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నారని, దీనిపై తాము వివరణ కోరితే పైనుండి ఆదేశాలు ఉన్నాయని సీఎండి స్పష్టం చేశారన్నారు.

అలాగే సంస్థలోని, సంస్థకు సంబంధించిన అన్నిచోట్ల సీసీ కెమెరాలు తొలగించారని తెలిపారు. మరునాడు రహస్యంగా 6,7 నెంబర్ల జీవోలను తీశారని, వాటిని తమకు ఇవ్వలేదని, తాము నెట్ లో డౌన్లోడ్ చేసుకున్నామన్నారు. 3.10 లక్షల మంది వినియోగదారులు, 3.51 లక్షల విద్యుత్ కనెక్షన్ల తో సాగుతున్న సంస్థను లేని అవినీతి బూచిని చూపుతూ కేవలం ఏడెనిమిది మంది ఫిర్యాదును ఆసరా చేసుకుని సంస్థను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదన్నారు. ఎలాంటి పద్ధతులు పాటించలేదని, దీనివల్ల వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తూ మొత్తం స్వాధీనం చేసుకున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంగా తాము భావిస్తున్నట్టు చైర్మన్ వెల్లడించారు. ఏడాదికాలంగా కుట్రలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారన్నారు.

కృష్ణయ్య కమిషన్  క్లీన్ చీట్ ఇచ్చింది …16 ఏళ్లు నివేదికను తొక్కి పెట్టారు
సంస్థలో 2007 నుండి 2010 వరకు  జరిగిన కార్యక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిందని పాలకవర్గం దుర్వినియోగం చేశారని ఆరోపణలపై 51 ఎంక్వయిరీ కూడా జరిగిందన్నారు. దీనిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సెస్ పర్సన్ ఇన్చార్జిగా ఉన్న అరుణ్ కుమార్ 2012లో విచారణకు ఆదేశించగా, కృష్ణయ్య కమిషన్ విచారణ జరిపి 2013లో జెసికి నివేదిక సమర్పిస్తూ, పాలకవర్గం ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేసిందన్నారు. 2010 అక్టోబర్ 26 తర్వాత తాను పదవి నుంచి దిగిపోయానని తర్వాత అల్లాడి రమేష్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించగా కృష్ణయ్య రిపోర్టును 16 సంవత్సరాల పాటు దాచి పెట్టారన్నారు. ఈ విజిలెన్స్ రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయలేదని చిక్కాల రామారావు ప్రశ్నించారు.

కృష్ణయ్య రిపోర్టులో బైలా నిబంధనలు, ఎన్పీడీసీఎల్ గైడ్లైన్స్  ప్రకారం అవినీతి లేకుండా పారదర్శక పాలన సాగించినట్లు రిపోర్టు స్పష్టం చేసిందన్నారు. అయితే 3,08,97,306 రూపాయల వర్క్ ఆర్డర్లను సంస్థ పూర్తి చేయలేదని, దీనిపై 13 మంది ఉద్యోగులు బాధ్యులు అని చెప్పకుండా కేవలం పాలకవర్గంపై అభియోగాలు మోపుకుంటూ కుట్రపూరితంగా అవినీతి అంటూ సాకు చెబుతున్నారని ఆరోపించారు. సెస్ సభ్యుల రూ.7 కోట్ల వాటాధనం, రూ.400 కోట్ల ఆస్తులతో , కోట్ల విలువైన విద్యుత్తు లైన్లు, భవనాల తో కూడుకొని  సెస్ సంస్థ ఉన్నదన్నారు. మూడు సంవత్సరాల రికార్డులు, విజిలెన్స్ రిపోర్టులు తీసుకెళ్లారని, ఎలాంటి రిపోర్టు తమకు సబ్మిట్ చేయలేదని, రాత్రికి రాత్రే ఎన్పీడీసీఎల్ ద్వారా ప్రభుత్వం రైతుల, నేతన్నల, సభ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇది రాజకీయ దురుద్దేశం కాదా? ఎంతవరకు ఇది న్యాయమో ఆలోచించాలని రైతులను, వినియోగదారులను చైర్మన్ కోరారు. తమ సేవ ఘనమని భావించేలా ఎన్పీడీసీఎల్ అధికారులు 15 రోజుల పాటు అరచేతిలో బెల్లం చూపిస్తూ, సినిమా చూపిస్తున్నారని అన్నారు.

సెస్ సరిహద్దుల చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఎన్పీడీసీఎల్ సేవలు ఎంత అధ్వానంగా ఉన్నాయో, వినియోగదారులు ప్రజలు ఎంత దుర్భర స్థితులను ఎదుర్కొంటున్నారో గమనించాలని  అన్నారు. లాభాల బాటలో ఉన్న సెస్ సంస్థను నష్టాలలో ఉన్న ఎన్పీడీసీఎల్ సంస్థలో విలీనం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కొద్దిరోజలుగా ప్రభుత్వ పెద్దలు తమను బెదిరిస్తూ వచ్చారని సంస్థను తొలగిస్తామని పేర్కొన్నారని, తమ పాలకవర్గంపై సీఎం కోపంగా ఉన్నారని బుకాయించారని అన్నారు. తమ మూడు ఏళ్ల మూడు నెలల పాలల్లో ఎక్కడ అవినీతి జరగలేదన్నారు.

సంస్థ నష్టాలలో లేదు.. ప్రభుత్వమే సబ్సిడీ లు ఇవ్వకుండా బకాయిల భారం పెంచింది
సంస్థలో నష్టం ఎక్కడ ఉన్నదని ప్రశ్నిస్తూ ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన వ్యవసాయ సబ్సిడీలు నెల నెల ఇవ్వకుండా బకాయలు పెట్టడం వల్ల ఎన్పీడీసీఎల్ సర్ చార్జీలు వేస్తూ బకాయిల భారం పెంచిందన్నారు. రూ.680 కోట్లు సెస్ ఇవ్వాల్సి ఉండగా రూ. 787 కోట్లు సంస్థకు రావాల్సి ఉన్నదని ఇందులో నష్టం ఎక్కడ ఉన్నదని, ఇప్పటికే సంస్థను లాభాల బాటలో తీసుకువచ్చి శాశ్వత నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉద్యోగులను పనిచేయమంటే పాలకవర్గంపై కోపం వ్యక్తం చేస్తారని, తమకు సబ్సిడీ బకాయిలు నెలకు రూ.3.50 రావాల్సి ఉండగా అవి సక్రమంగా చెల్లించకపోవడంతో 24 కోట్లకు ఎస్టీ బిల్లులో కలిపి తమకు బాకాయలు  పంపుతారని తెలిపారు.

రావలసిన బకాయిలపై ఈ ఆర్ సి కి తాము నివేదించామని, దీనిపై రూ. 471 వ్యవసాయ కనెక్షన్ల సబ్సిడీలో 392 కోట్లు మంజూరు చేసి గత మార్చి 30న తమకు  ఈఆర్సి ఇచ్చిందన్నారు. ఇందులో తమ తప్పులు ఎక్కడ ఉన్నాయన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో సెస్ సంస్థను విలీనం చేశారని, ఆ సమయంలో ఎమ్మెల్యే రాజేశ్వరరావు, మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డితో కలిసి నివేదించగా సీఎం,  చీఫ్ సెక్రటరీ తో మాట్లాడి లాభాల బాటలో ఉన్న సంస్థను ఎలా చేస్తారని పేర్కొంటూ విలీనం చర్యను తక్షణమే రద్దు చేశారని చైర్మన్ వెల్లడించారు. ప్రభుత్వ జోక్యం లేకుంటే సంస్థను బ్రహ్మాండంగా నడిపిస్తామని కేవలం 13 కోట్ల విద్యుత్ డిమాండ్ ను 22 కోట్లకు పెంచామని 18 కోట్లు రెవెన్యూ వసూలు చేస్తున్నామని వెల్లడించారు.

న్యాయపోరాటమే ఏకైక మార్గం..ఉద్యమానికి అన్ని పార్టీలు కలిసి రావాలి
ప్రస్తుతం న్యాయపరంగా పోరాటం చేస్తామని ఇదే ఏకైక మార్గమని, రాజకీయంగా నిర్ణయాలు తమ బీఅర్ఎస్ పార్టీ చూసుకుంటుందని తెలిపారు. తమ పాలకవర్గంపై కోపం ఉంటే సెస్ సంస్థకు  ఇష్టమైన వారితో కమిటీ వేసి లైసెన్స్ రెన్యూవల్ చేస్తూ యధావిధిగా కొనసాగించాలని, సెస్ ను కొనసాగిస్తామంటే తమ పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతులు, నేతన్నలు, పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ త్యాగం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 20 తర్వాత పోరాట పంథాపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. సెస్ అందరి సంస్థ అని, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని సంస్థను, కాపాడుకుందాం అని చిక్కాల  కోరారు. 3.10 లక్షల మంది సభ్యులు, 400 కోట్ల ఆస్తులు ఉన్న సంస్థను విలీనం చేయడం సరికాదని తాము ఒప్పుకోబోమన్నారు. తమ సంస్థపై ఫిర్యాదులు చేసిన వారు చట్ట విరుద్ధంగా పనులు చేయించుకోవడానికి తమ వద్దకు వస్తే వాటిని తాము తిరస్కరించామని, ఆ కోపంతో తనపై తప్పుడు ఆరోపణలు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని చైర్మన్ ఆరోపించారు.

సెస్ ప్రైవేటీకరణ కోసమే ప్రభుత్వం కుట్ర..
సంస్థను సహకార సంఘం నుంచి తొలగించి నూరు శాతం ప్రవేటీకరణ చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్నారు ఎందుకోసం ఈ ఆర్ సి 17 సర్కిళ్ల లో సిరిసిల్ల సెస్ ను కలుపుకొని 18వ సర్కిల్ గా నిర్ణయిస్తూ ఇటీవల  ఈఆర్సి నోటిఫికేషన్ జారీ చేస్తూ, నెలరోజుల గడువుతో ప్రజాభిప్రాయం కోరిందన్నారు. సంస్థ పూర్తి స్థాయిలో విలీనం కాకుండానే సంస్థ ఉద్యోగులను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. దేశంలో 60 ఏళ్ల పాటు పాలించిన పార్టీ వారు సెస్ పై అవినీతి అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంస్థకు ఉత్తమ సేవలను గుర్తిస్తూ అనేక అవార్డులు వచ్చాయని, ఈ సంవత్సరం కూడా అవార్డు వస్తుందని తపనతో పాలన సాగించామని చైర్మన్ చిక్కాల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంస్థ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -