Saturday, April 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుడీలిమిటేషన్‌తో రాష్ట్రాలకు, సామాజిక శక్తులకు అన్యాయం

డీలిమిటేషన్‌తో రాష్ట్రాలకు, సామాజిక శక్తులకు అన్యాయం

- Advertisement -

2026 జనాభా లెక్కల అనంతరమే పునర్విభజన చేయాలి
33 శాతం మహిళా రిజర్వేషన్లకు మేం సానుకూలం
పారదర్శకత లేని డీలిమిటేషన్‌కు వ్యతిరేకం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ద్వంద్వ వైఖరి : ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్‌తో రాష్ట్రాలతోపాటు సామాజిక శక్తులకు, మహిళలకు, మైనార్టీలకు అన్యాయం జరగనున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2026 లెక్కల అనంతరమే పునర్విభజన చేయాలని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాషా-నరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2026 జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్‌తోపాటు మహిళా రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్టు కపటనాటకమాడుతోందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని, డీలిమిటేషన్‌ను మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. 2026 జనాభా లెక్కల అనంతరమే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేవలం బీజేపీ ఏకపక్షంగా బిల్లు ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాల్సిందే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇండియా నుంచి పాకిస్తాన్‌ వేరుపడినట్టు పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమ పార్టీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని, ఈ ప్రాంత బీజేపీ నాయకులు ప్రకటించుకుంటున్నారని, కేంద్రంలో మాత్రం ఆ పార్టీ ఎంపీలు దీన్ని పాకిస్తాన్‌, ఇండియా విభజనతో పోల్చుతూ వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అనేక సార్లు మోడీ కూడా తెలంగాణ రాష్ట్ర విభజనపై అవమానకరంగా మాట్లాడారని గుర్తుచేశారు. వెంటనే తేజశ్రీ సూర్యతో ఆ పార్టీ నాయకత్వం క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు.
నాదర్‌గుల్‌ రైతులకు న్యాయం చేయాలి
నాదర్‌గుల్‌ అసైన్‌మెంట్‌ పట్టాలు పొందిన రైతాంగానికి న్యాయం చేయాలని జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. అసైన్‌మెంట్‌ పట్టాలు పొందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు జారీ చేసి, హక్కులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్‌, జగదీష్‌, కె.జగన్‌, చంద్రమోహన్‌, ఏర్పుల నరసింహ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -