Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగం కంటే మనువాదం అమలుకే కుట్ర

రాజ్యాంగం కంటే మనువాదం అమలుకే కుట్ర

- Advertisement -

ఎన్నికల మ్యాప్‌ను మార్చేందుకు బీజేపీ యత్నం
దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం కొల్లగొడుతున్నారు : ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఇది మహిళా బిల్లు కాదని, 2023లోనే పార్లమెంటులో బిల్లును ఆమోదించారని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాజ్యాంగం కంటే మనువాదం అమలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల మ్యాప్‌ను మార్చేందుకు యత్నిస్తోందని విమర్శించారు. శుక్రవారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్‌ (పునర్విభజన) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం కొల్లగొడుతున్నారని, అధికారంలో దళిత హిందువులకు వాటా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వం వారి హక్కులను లాక్కునేందుకు తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. ఓబీసీలను దూరంగా ఉంచి, వారి హక్కులను కొల్లగొట్టేందుకే బీజేపీ కులగణనను బైపాస్‌ చేసే ప్రయత్నం చేస్తోందని తప్పుపట్టారు.

సమాజంలో మహిళలది కీలక పాత్ర అని రాహుల్‌ పేర్కొన్నారు. మహిళలకు దేశ ఛోదక శక్తి అని ప్రధాని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. తమ ఇద్దరికీ ఎలాంటి ‘వైఫ్‌ ఇష్యూస్‌’ లేవని చమత్కరించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పుడు చేపట్టడం వెనుక ఉన్న ఉద్దేశం చిక్కుప్రశ్నతో ముడిపడి ఉన్నదని ఆయన వివరించారు. ప్రధాని మోడీ ప్రసంగం చాలా శక్తి హీనంగా, విచ్ఛిన్నంగా ఉన్నదని అన్నారు. ” మోడీ చర్చల్లో పాల్గొనలేకపోయారు. ఎందుకంటే ఈ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రయత్నించడం ఒక పొరపాటు. అది నెగ్గదని, తీవ్ర భయాందోళనలకు గురవుతుందని అందరికీ తెలుసు’ అని రాహుల్‌గాంధీ అన్నారు. అయితే, అదే తనకు జ్ఞానోదయం కలిగించిన క్షణమని ఆయన తెలిపారు. ‘నేను ఆయన్ను (మోడీని) చూస్తున్నప్పుడు, నా ఫోన్‌లో ఏప్రిల్‌ 16న గమనించా. అప్పుడు నేను, ‘దేవుడా, ఎంత విచిత్రం. అదే ఆ సంఖ్య. 16! ఈ పదహారు సంఖ్య, ఇదే ఆ సంఖ్య. ఈ చిక్కుముడికి పూర్తి సమాధానం 16 సంఖ్యలోనే ఉన్నది. ప్రతీదీ పదహారు సంఖ్యలోనే ఉన్నదని అనుకున్నా’ అని రాహుల్‌గాంధీ అన్నారు. మరోవైపు తాను చెప్పేది ఎవరికైనా అర్థమైతే, దయచేసి తనకు మెసేజ్‌ పంపాలని కోరారు. ‘ఆ చిక్కుముడి ఏమిటో మీరు ట్విట్టర్‌లో కూడా చెప్పవచ్చు. కానీ మీ ప్రశ్నలకు సమాధానం, ఆ చిక్కుముడి గురించి మీరు త్వరలోనే తెలుసుకుంటారు. పదహారు సంఖ్యలోనే అంతా ఉన్నది’ అని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ ఓ ఇంద్రజాలకుడు

ప్రధాని నరేంద్ర మోడీని ఓ ఇంద్రజాలకుడితో రాహుల్‌ గాంధీ పోల్చారు. బాలాకోట్‌ దాడులు.. డీమానిటైజేషన్‌.. ఆపరేషన్‌ సింధూర్‌ ఇంద్రజాలకుడు మోడీ అని రాహుల్‌ విమర్శించారు. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. మోడీపై చేసిన వ్యాఖ్యలు ఖండించదగ్గవని ఆయన అన్నారు.

రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన డీఎంకే

లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును డీఎంకే వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ కనిమొళి మాట్లాడారు. ఒకవేళ డీలిమిటేషన్‌ బిల్లు సరైన దశలోనే ఉండి ఉంటే, ఆ బిల్లును తమిళనాడు అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. డీలిమిటేషన్‌ అంశంపై ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితోనూ కేంద్రం సంప్రదించలేదని అన్నారు. 2021లో జనాభా లెక్కలను ప్రభుత్వం వాయిదా వేసిందని, ఇప్పుడు వాటి స్థానంలో పాత జనాభా లెక్కలను తీసుకుంటున్నారని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేసిందని విమర్శించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయని, ఓ రెండు వారాల పాటు ఆగే ఆలోచనలో బీజేపీ లేదని, ఎన్నికల రెస్క్యూ వ్యూహం తరహాలో మహిళలను బీజేపీ వాడుకుంటున్నదని కనిమొళి ధ్వజమెత్తారు. గురువారం లోక్‌సభలో ఎందుకు 2023 నాటి మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని నోటిఫై చేశారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ను తప్పుదోవ పట్టించే రీతిలో బిల్లు ఉన్నదని, ఇది దేశ ఫెడరల్‌ విధానాన్ని దెబ్బతీస్తున్నట్టుగా ఉందని అన్నారు. బిల్లులను ప్రవేశపెట్టి, ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఆమోదించాలని కోరడం, గుణాత్మక రాజకీయం అవుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఓ ట్రాప్‌ అని, మహిళలను బీజేపీ ఓ కవచంలా వాడుకుంటోందని కనిమొళి అన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో ఎందుకు రిజర్వేషన్‌ ఇవ్వలేకపోతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆమె ప్రశ్నించారు.

డీలిమిటేషన్‌పై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నమ్మాలి : అమిత్‌షా
ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందనికేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్‌, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై సుదీర్ఘ చర్చ అనంతరం అమిత్‌ షా లోక్‌సభలో సమాధానమిస్తూ, నియోజకవర్గాల్లోని జనాభాలో భారీ వ్యత్యాసం కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడం కష్టంగా మారిందన్నారు. ఒక చోట 39 లక్షల మంది ఓటర్లుంటే, మరో చోట 60 వేల మంది ఓటర్లున్నారని, ఇలా నియోజకవర్గాల్లో జనాభా వ్యత్యాసాలున్నాయని చెప్పారు. డీలిమిటేషన్‌ తో నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యలో సమతుల్యతను సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తద్వారా ఎంపీ లాడ్స్‌ను కూడా సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని అన్నారు. వారిది మహిళా వ్యతిరేక మైండ్‌సెంట్‌ అని తెలిపారు. డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నమ్మాలని అన్నారు. పార్లమెంటు సభ్యుల సంఖ్యను విస్తరించేందుకు, వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మూడు బిల్లులపై లోక్‌సభలో సమగ్రంగా చర్చ జరిగిందని, అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయని, ఇండియా కూటమి సభ్యుల్లో చాలా మంది మాట్లాడారని అన్నారు.రాజ్యాంగ సవరణ వల్ల దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం బలహీనమవు తుందనడంలో ఎంత మాత్రం నిజం లేదని అమిత్‌షా అన్నారు. బిల్లు ఆమోదం తర్వాత దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సభ్యులు, శాతం రెండూ పెరుగుతాయని వివరించారు. ప్రస్తుతం 543 మంది లోక్‌సభ సభ్యుల్లో దక్షిణాదిన 129 మంది ఎంపీలు ఉన్నారని, అది ఇప్పుడు 195కు పెరుగుతుందని చెప్పారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం పెరగడం, బలమైన గొంతు వినిపించే అవకాశం ఉంటుందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -