Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -


సర్కారుకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి
నేటి నుంచి 20 వరకు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు
సమ్మెకు మద్దతుగా 20న డిమాండ్‌ బ్యాడ్జీలతో విధులకు..
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్‌భవన్‌ దగ్గన ఎస్‌డబ్య్లూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌. రావు, ప్రచార కార్యదర్శి పి రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర సంవత్సరాలలో ఒక్కసారి కూడా కార్మిక సంఘాలతో ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ యాజమాన్యం సైతం చర్చలు జరుపలేదని వ్యాఖ్యానించారు. ఒక్క సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా కాలయాపన చేయడం, సంఘాలపై ఆంక్షలు కొనసాగించడం సరైంది కాదన్నారు.

తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్‌ బస్సులతో కార్మికులు పడుతున్న ఇబ్బందులు కూలంకషంగా చర్చించినట్టు చెప్పారు. అలాగే ఆరు సంఘాల ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సమ్మెకు మద్దతు ప్రకటించినట్టు స్పష్టంచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలనీ, సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై శనివారం నుంచి సోమవారం (18,19,20 తేదీల్లో) అన్ని డిపోల వద్ద రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి, కార్మికుల్లో, ప్రజల్లో ప్రచారం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్‌ 20న డిమాండ్‌ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అన్ని స్థాయిల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్యంచేయాలని డిపో కమిటీలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -