నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో వికలాంగు లకు 5 శాతం కేటాయించాలని వికలాం గుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి.వరమ్మ, రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువతకు 37 రకాల యూనిట్స్ స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్స్ ను వికలాంగులకు అమలు చేయాలి. కానీ ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఎక్కడ కూడా వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో స్వయం ఉపాది యూనిట్ల కేటాయింపులో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్లను కలిసి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరినట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ సానుకూలంగా స్పందించారనీ, అయితే జిల్లా స్థాయిల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్లలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు ప్రస్తావన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలి : ఎన్పీఆర్డీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



