Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈవీ చార్జింగ్‌ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

ఈవీ చార్జింగ్‌ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

- Advertisement -

సమగ్ర ప్రణాళికను రూపొందించాలి: సీఎస్‌ రామకృష్ణారావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో ఈవీ చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈవీ వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని చార్జింగ్‌ కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా సమగ్ర వ్యవస్థ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు. డా.బీఆర్‌.అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ మౌలిక వసతుల అమలుపై శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ మౌలిక వసతులను విస్తరించడానికి చేపట్టాల్సిన చర్యలపై సీఎస్‌ సమీక్షించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వేగవంతం అవుతున్నందున, ఈ పెరుగుతున్న ఈవీ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి విస్తృత చార్జింగ్‌ నెట్‌వర్క్‌ ఎంతో కీలకమని సీఎస్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఈవీ చార్జింగ్‌ మౌలిక వసతులను మ్యాప్‌ చేయడానికి, పర్యవేక్షించడానికి కేంద్రీకత, రియల్‌టైమ్‌ డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ డ్యాష్‌బోర్డ్‌ ఈవీ కేంద్రాల ఏర్పాటు ప్రణాళిక, పురోగతి పర్యవేక్షణ, పారదర్శకతకు కీలక సాదనంగా ఉపయోగపడుతుందన్నారు.ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌ భవనాల బేస్‌మెంట్‌లలో ఈవీ చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసే విధానాన్ని రూపొందించే ప్రక్రియలో ఇంధన శాఖ ఉందని వెల్లడించారు. ఈ విధానం నగర వాసులకు సౌకర్య వంతమైన హోమ్‌ చార్జింగ్‌ అవకాశాలను కల్పించడం ద్వారా ఈవీ వినియోగాన్ని పెంచడానికి దోహద పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, ప్రణాళిక కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా కమిషనర్‌ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్‌ చైర్మెన్‌ ఎండీ శశాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌, టీజీరెడ్కో ఎండీ అనిలా వవిల్లా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -