Thursday, September 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు22 మంది బీఆర్‌ఎస్‌ ‌సభ్యుల సస్పెన్షన్‌

22 మంది బీఆర్‌ఎస్‌ ‌సభ్యుల సస్పెన్షన్‌

- Advertisement -

సెషన్‌ ‌మొత్తానికంటూ స్పీకర్‌ ‌ప్రకటన.. సభ ప్రారంభమవ్వగానే బీఆర్‌ఎస్‌ సభ్యుల ‌ఆందోళన
స్పీకర్‌ ‌పోడియాన్ని చుట్టిముట్టి నినాదాలు
కేసీఆర్ చావును కోరుకున్నవారిని సస్పెండ్‌ ‌చేయాలని పట్టు
కూర్చుంటే చర్చకు అవకాశాన్ని పరిశీలిస్తానన్న స్పీకర్‌
ఎర్రవెల్లిలో పసుపు నీళ్లతో శుద్ధి దారుణమన్న మంత్రులు
దళితులకు ప్రతిపక్షనేత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
35 నిమిషాల తర్వాత బీఆర్‌ఎస్‌ ‌సభ్యులపై వేటు
సభలో లేని గంగుల కమలాకర్‌‌పైనా – ప్రధాన ప్రతిపక్షం ఆగ్రహం
సీట్ల వద్ద నిలబడితే సస్పెండ్‌ చేయడమేంటన్న బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సెషన్‌‌ మూడోరోజైన బుధవారమూ హాట్‌‌హాట్‌‌గానే కొనసాగింది. ‘ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ‌చావును కోరుకున్న కాంగ్రెస్‌ ‌సభ్యులను సస్పెండ్‌ ‌చేయాలి’ అని పట్టుపడుతూ…సభ ప్రారంభమవ్వగానే బీఆర్ఎస్‌ ‌సభ్యులు స్పీకర్‌ ‌పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రతిపక్షనేత కేసీఆర్‌ ‌చావును కోరుతూ మాట్లాడిన కాంగ్రెస్‌ ‌సభ్యులపై చర్యలు తీసుకునే అంశంపై చర్చపెట్టాలంటూ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్‌ ఎంత వారించినా బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు వినలేదు. చర్చకు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ‘చర్చకు తీసుకుందాం. ముందు మీ సీట్లలోకి వెళ్లి కూర్చోండి. సభ నడుస్తుంటే పోడియం దగ్గరకు వచ్చి ఇలా చేయొచ్చా? రాతపూర్వకంగా రాసివ్వండి. చర్చ అనే అంశాన్ని పరిశీలిస్తాం. మాట్లాడే అవకాశం కల్పిస్తాం. మూడు నాలుగు సార్లు గెలిచిన సభ్యులు ఇలా చేయడమేంటి? కొత్త సభ్యులకు మీరు నేర్పుతున్నదేంటి? దయచేసి కూర్చోండి. సభ సజావుగా నడవాలి. ప్రభుత్వ నిర్ణయాలు, చేసిన పనుల గురించి ప్రజలకు చెప్పాలి. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పాలి. బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు ఇలా చేయడం సబబు కాదు ’ అని స్పీకర్‌ ‌ప్రసాద్‌‌కుమార్‌ ‌పదేపదే విన్నవించినా బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు పట్టు విడవలేదు. దీంతో పలుమార్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రతిపక్ష సభ్యులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినలేదు.

పలువురు బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు భట్టి వైపు వేలు పెట్టి చూపడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్‌ ‌సభ్యులు కూడా ఒక్కసారిగా లేచారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ…‘వేళ్లు, చేతులు చూపెట్టి భయపెట్టడం, బెదిరించడం చేస్తే ఇక్కడ భయపడే వారెవ్వరూ లేరు’ అంటూ చురకలు అంటించారు. వెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ…‘గౌరవ ప్రతిపక్ష సభ్యులు ఇలా చేయడం సరిగాదు. దయచేసి కూర్చోండి. చర్చ అంశాన్ని స్పీకర్‌ ‌పరిశీలిస్తా మంటున్నారు. మాట్లాడే అవకాశం ఇస్తామంటున్నారు. అయినా ఇలా చేయడమేంటి? ఇది ఎంతవరకు కరెక్టు’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ‌వందేండ్లు బతకాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఎవరైనా చావును కోరుకుంటారా? అని అడిగారు. సభ ప్రారంభమై గంట కావొస్తుందనీ, దయచేసి కూర్చోండి అని విన్నవించారు. అయినా, బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో 21 మంది బీఆర్‌ఎస్‌ ‌సభ్యులను సస్పెండ్‌ ‌చేయాలని మంత్రి శ్రీధర్‌‌బాబు ప్రతిపాదించారు. దీంతో 10 గంటల 40 నిమిషాల సమయంలో 22 మంది బీఆర్‌ఎస్‌ ‌సభ్యులను ఈ సెషన్‌ ‌మొత్తానికి సస్పెండ్‌ ‌చేస్తున్నట్టు పేర్లు చదివి వినిపించారు. బీఆర్‌ఎస్‌ ‌సభ్యుల నినాదాల మధ్యనే సభకు టీ బ్రేక్‌ ఇస్తున్నట్టు స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ప్రకటించి వెళ్లిపోయారు.

సస్పెండ్‌ అయిన సభ్యులు వీరే…
టి.హరీశ్‌‌రావు, కేటీఆర్‌, పాడి కౌశిక్‌‌రెడ్డి, జగదీశ్వర్‌‌రెడ్డి, కేపీ.వివేకానంద, కాలేరు వెంకటేశ్‌, ప్రశాంత్‌‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, సుధీర్‌‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌‌యాదవ్‌, విజయుడు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చింతా ప్రభాకర్‌, అనిల్‌‌జాదవ్‌, కోవా లక్ష్మి, మాణిక్‌‌రావు, కల్వకుంట్ల సంజయ్‌‌కుమార్‌, గంగుల కమలాకర్‌, మర్రి రాజశేఖర్‌‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌‌రెడ్డి, మాధవరం కృష్ణారావు ఉన్నారు. గంగుల కమలాకర్‌ అసలు సభకే రాలేదు. ఆయన్ను ఎలా సస్పెండ్‌ ‌చేస్తారనే విషయాన్ని బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు లేవనెత్తారు. స్పీకర్‌ ‌పోడియం వద్దకే వెళ్లకుండా సీట్ల వద్ద నిల్చొని నిరసన తెలుపుతున్న తమనెట్లా సస్పెండ్‌ ‌చేస్తారంటూ సబితా ఇంద్రారెడ్డి, కోవాలక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, టి.హరీశ్‌‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పసుపు నీళ్లతో శుద్ధి దళితులను అవమానించడమే… క్షమాపణ చెప్పాల్సిందే : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ నేతలు శుద్ధి చేయడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంటి దగ్గర శుద్ధి చేయడం తెలంగాణలోని దళితులను అవమానపర్చడమేనన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పక్షనేత ఈ విషయంపై దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. శుద్ధి కార్యక్రమంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. దళితుల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ నేతలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు నీళ్లతో చిల్లర రాజకీయాలు చేయడం మానేయాలని హితవుపలికారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఈ దాడులేంటి? అని ప్రశ్నించారు. స్పీకర్‌‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కనీసం పశ్చాతాపం కూడా లేదని విమర్శించారు. ఈ విషయంలో చట్ట పర చర్యలు తీసుకోవాలని సభను కోరారు. పాలనాపరంగా సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామనీ, వ్యక్తిగతంగా దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

​స్పీకర్‌‌ను ఛాలెంజ్‌ ‌చేయడం సరిగాదు : డిప్యూటీ సీఎం భట్టి
ఒకపక్క సభను సజావుగా నడిపేందుకు స్పీకర్‌ ‌ప్రయత్నిస్తుంటే మరోపక్క బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు సభాపతినే ఛాలెంజ్‌ ‌చేయడం సబబు కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్పీకర్‌‌తో వాదించడం సరిగాదన్నారు. ఓపక్క స్పీకర్‌‌ను దూషించి…మరోపక్క దళితులు రోడ్డుమీద నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేసి… అదే బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు ఇక్కడకొచ్చి న్యాయం కావాలని అరవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌పాలనలో అణచివేతకు గురైన బలహీనవర్గాలకు, అవమానాలకు గురైన ప్రజలకు న్యాయం కావాలన్నారు. పదేండ్లు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఇలా చేశామా? అని ప్రశ్నించారు. దొరతన పోకడలను తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. పసుపు నీళ్లతో శుద్ధి అనే అంశంపై చర్చ జరగాల్సిందేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిదికాదు..సరైన మార్గం కూడా కాదు..సభాపతి గౌరవించి కూర్చోవాలని బీఆర్‌ఎస్‌ ‌సభ్యులకు విన్నవించారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు భట్టి వైపు చేతులు చూపుతూ మాట్లాడటం పట్ల ఆగ్రహానికి గురైన భట్టి.. చేతులు, వేళ్లు చూపెట్టి బెదిరిస్తే బెదిరేవాళ్లేవ్వరూ ఇక్కడ లేరనీ, ఎంతకాలం ఇలా దాడిచేసి బతకుదామని చూస్తున్నారు అని ప్రశ్నించారు. చేసిన అవమానాలు చాలనీ, ఇక భరించే శక్తి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ‌వందేండ్లు ఆయురారోగ్యాలతో బతకాలని తాము కోరుకుంటున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు అలా కోరుకోకుంటే తామేమీ చేయలేమన్నారు.

మూడ్రోజులుగా దళితులపై బీఆర్‌ఎస్‌ ‌దాడి : వేముల వీరేశం
రాష్ట్రంలో వరుసగా మూడ్రోజుల నుంచి దళితులపై బీఆర్‌ఎస్‌ ‌దాడి చేస్తున్నదని విప్‌ ‌వేముల వీరేశం విమర్శించారు. స్పీకర్‌‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అసభ్యకరంగా మాట్లాడటాన్ని ఆక్షేపించారు. అలా మాట్లాడటాన్ని తప్పుబడుతూ ఎర్రవెల్లి ఫామ్‌‌హౌజ్‌ ‌వద్ద దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణ సమాజంలో దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -