Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎక్కడికక్కడ అంగన్‌‌వాడీల అరెస్టు

ఎక్కడికక్కడ అంగన్‌‌వాడీల అరెస్టు

- Advertisement -


చలో హైదరాబాద్‌ను 
జరగనివ్వకుండానే అడ్డుకునే ప్రయత్నం
నిర్బంధాలను తట్టుకుని
 ధర్నా చౌక్‌‌కు వచ్చిన అంగన్‌‌వాడీలు
అనుమతి లేదంటూ వారిని అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌ కు తరలింపు
ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి : పాలడుగు
నవతెలంగాణ -ముషీరాబాద్‌

డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్‌ తలపెట్టిన అంగన్‌‌వాడీలను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. నిర్బంధాలను తట్టుకుని హైదరాబాద్‌‌కు చేరుకున్న ఎంతోమంది అంగన్ వాడీలనూ అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌‌కు తరలించారు. ఉదయమే అంగన్‌‌వాడీ యూనియన్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి తదితర నేతలను అరెస్టు చేశారు. ఆ తర్వాత ధర్నాచౌక్‌‌కు చేరిన వారందరినీ బలవంతంగా పట్టుకుని పోలీస్‌ ‌స్టేషన్‌‌కు తరలించారు. అంగన్‌‌వాడీల సమస్యలను పరిష్కరించాలని, ప్రీప్రైమరీ, పిఎంశ్రీ కేంద్రాలను రద్దు చేయాలని, వాటిని అంగన్‌‌వాడీలకు అప్పగించాలని, ఐసీడీఎస్‌‌లను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, 18 వేల రూపాయల వేతనాన్ని అందించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తింపచేయాలని, తదితర డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు వచ్చామని చెప్పుకున్నా పోలీసులు కనికరం చూపలేదు. వెళ్లిపోతున్న వారిని కూడా పట్టుకుని పోలీస్‌‌వ్యాన్‌‌ ఎక్కించారు. మద్దతు తెలిపిన సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ ‌మాట్లాడుతూ గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధర్నాచౌక్‌‌లో ధర్నాలు నిర్వహించుకునేందుకు ఆయా సంఘాలు అనుమతి కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. పోలీసుల చేత మహిళలను అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయించడం దారుణమన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నదన్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను , కనీస వేతనాలను ఇతర సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆందోళన చేయాలని తలపెట్టి హైదరాబాద్‌కు వచ్చిన వారిని అర్ధరాత్రి ముందస్తు అరెస్టులు చేయడం, గృహనిర్బంధం చేసి వివిధ పోలీస్‌‌స్టేషన్‌‌ల్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిర్బంధకాండను ప్రతి ఒక్కరూ ఖండించాలని డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, లేకపోతే కార్మికవర్గం తిరగబడుతుందని హెచ్చరించారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -