చలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా
18న ప్రభుత్వంతో చర్చలు
19న జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ : టీజీఈజేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇచ్చిన లిఖిత పూర్వక హామీ మేరకు సెప్టెంబర్ 10న (నేడు) తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ ) తెలిపింది. బుధవారం ఉదయం సీఎస్ సంజయ్ జాజుతో జేఏసీ నాయకులు సమావేశమై చర్చించారు. అనంతరం జేఏసీ నాయకులు సీఎస్ తో జరిపిన చర్చలపై అంతర్గతంగా చర్చించుకున్నారు. సాయంత్రం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, కో చైర్మెన్ చావ రవి తదితరులు పాల్గొన్నారు. మారం జగదీశ్వర్ మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను వెంటనే సమర్పించాలని కమిషన్ ను కోరుతూ సీఎస్ లేఖ రాశారని తెలిపారు. సీపీఎస్ రద్దు – ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్ పై అధ్యయనానికి ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు సమ్మతించారని చెప్పారు. పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక అంశాలపై ఈ నెల 18న జేఏసీ నాయకత్వంతో చర్చిస్తామని మాటిచ్చినట్టు తెలిపారు. ఆ చర్చల తర్వాత జేఏసీ19న సమావేశమై మరోసారి చర్చించి అవసరమైతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. సీఎస్ విజ్ఞప్తి మేరకు కేవలం తాత్కాలికంగా వాయిదా వేశామే తప్ప విరమించలేదని తేల్చి చెప్పారు. దసరా వరకు పీఆర్సీ ఇప్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీని అమలు చేయాలనీ, పెండింగ్ ఆరు డీఏలను మంజూరు చేయాలనీ, ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలనీ, సీపీఎస్ ఉపసంహరించుకుని ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతో చలో హైదరాబాద్ పిలుపునిచ్చామని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ సబ్ కమిటీ, ఆఫీసర్ల కమిటీలతో పలు దఫాలు చర్చించినప్పటికీ ఫలితం లేకుపోవడంతో అనివార్యంగా చలో హైదరాబాద్ తలపెట్టినట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటనకు ముందే చలో హైదరాబాద్ ఉంటుందని ప్రకటించామని గుర్తుచేశారు. అసెంబ్లీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అయినా సరే సభకు అనుమతించాలని కోరినప్పటికీ ప్రభుత్వం అనుమతించకపోవడంతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్టు తెలిపారు. ఈ లోపు సీఎస్ ఆహ్వానం మేరకు చర్చించామనీ, ఆ సందర్భంగా పీఆర్సీతో పాటు కనీసం మూడు డీఏలు ఇవ్వాలనీ, రూ.11 వేల కోట్ల వరకు పెండింగ్ బకాయిలున్నాయని ఆయనకు తెలిపినట్టు వివరించారు. 18 లోపు జాయింట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ అడిషనల్ సెక్రెటరీ జనరల్ దామోదర్ రెడ్డి కో చైర్మెన్లు సదానంద గౌడ్ (ఎస్టీయూ), మధుసూదన్ రెడ్డి, పి.వెంకటరెడ్డి (పెన్షనర్స్), గౌతమ్ కుమార్ (ట్రెసా), కటకం రమేష్, కృష్ణమూర్తి (పెన్షనర్స్), దాస్య నాయక్ (క్లాస్ 4), డిప్యూటీ సెక్రటరీ జనరల్ ముజీబ్ హుస్సేన్ (టీఎన్జీవో జీఎస్), బి.శ్యామ్ (టీజీవో జీఎస్) చకినాల అనిల్ కుమార్ తదితరులు మాట్లాడారు.
18న స్పష్టత రాకుంటే పోరాట కార్యాచరణ
18న ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే తమ పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ కో చైర్మెన్ చావ రవి హెచ్చరించారు. ఇప్పటికే మూడు సార్లు జేఏసీ పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చి వాయిదా వేసిందని గుర్తుచేశారు. చలో హైదరాబాద్ కు రెండున్నర లక్షల మందికి పైగా రావడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ప్రభుత్వం మొదటిసారిగా రాతపూర్వకంగా హామీ ఇచ్చిందని తెలిపారు. రాత పూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.
చావ రవి
సీఎస్ లిఖితపూర్వక హామీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



