Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందళితులు అంటరాని వారా..?

దళితులు అంటరాని వారా..?

- Advertisement -

ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌
‌నవతెలంగాణ-సిటీబ్యూరో

ఫాం హౌస్‌ ‌దగ్గర దళిత సంఘాలు చావు డప్పు కార్యక్రమం ఎందుకు పెట్టారో కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద ఆయన మాట్లాడుతూ.. దళితులు కార్యక్రమం పెడితే ఆ ప్రదేశాన్ని సంప్రోక్షణ ‌చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అంటరానికి వారిగా చూస్తున్నందుకు ఎన్నికల కమిషన్ బీఆర్‌ఎస్‌‌ను రద్దు చేయాలని కోరారు. ఇంత అహంకారం, బలుపు ఉంటే సమాజ విభజన జరుగుతుందన్నారు. దళితుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, వారినే అణగదొక్కుతున్నారన్నారు. గతంలో నలుగురు, ఇప్పుడు ముగ్గురి కోసమే బీఆర్‌ఎస్‌ పార్టీ పని చేస్తున్నదని ఆరోపించారు. గతంలో షాడో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్‌ ఇప్పుడు బట్టలు విప్పుకుని తిరగడమేంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి లీడ్ చేసే నాయకుడు లేకపోవడంతో పరువు బజారున పెట్టుకుంటున్నారన్నారు. మహిళా పోలీసుల పట్ల అవమానకరంగా వ్యవహరించారని, పోలీసుల గల్లాలు పట్టుకున్నారని చెప్పారు. సంప్రోక్షణ చేసిన విషయంపై కేసీఆర్ క్షమాపణ చెప్పి మాత్రమే అసెంబ్లీకి రావాలని, లేదంటే వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

​తాతా మధు మాట్లాడింది కేసీఆర్‌ ‌భావజాలం : 
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడింది ఆయన మాటలు కావని, కేసీఆర్ భావజాలం అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. దళిత సమాజం మొత్తం ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. మనుధర్మ భావజాలం అణువణువునా నింపుకుని బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నదన్నారు. దళితులు నడిచిన నేల అపవిత్రమైందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇల్లు శుభ్రం చేస్తున్నది, వారి భూమి దున్నుతున్నది, వంట చేసి పెడుతున్నది తమ జాతి వారే అని, మరి అవన్నీ వదులుకుంటావా..? అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌ ‌చుట్టూ పసుపు నీళ్లు చల్లించిన కేసీఆర్ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.

​కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
కాళోజీ జయంతి రోజున అన్యాయం గురించి హరీశ్‌ రావు మాట్లాడుతున్నారని, స్పీకర్ ని మీ పార్టీ సభ్యుడు అనరాని మాటలు అంటే అన్యాయం కనపడుతలేదా? అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. వెయ్యి రోజుల్లో ముఖ్యమంత్రి తలుచుకుంటే మిమ్మల్ని ఎప్పుడో లోపల వేసేవారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి అంటే స్పందన లేదన్నారు.

​డైవర్షన్‌ ‌చేయాలని బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి
డైవర్షన్‌ చేయాలనే విధంగా బీఆర్ఎస్ వ్యవహారం ఉందని, అందుకు కేసీఆర్‌ ‌వారి సభ్యులకు ఇక్కడికి పంపించారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చ జరగకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారా..? వీక్‌‌గా ఉన్నారా..? అని తెలిసేది ఆయన అసెంబ్లీకి వస్తేనే కదా అన్నారు. వీక్‌‌గా ఉండటంతోనే అసెంబ్లీకి రావడం లేదని, గుట్టు తెలిసిపోతుందని నాటకాలు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ సభకు రావడం లేదనే విషయాన్ని దారి మళ్లించడానికే ఈ నిరసనలు అని, ఇందుకు ఎర్రవల్లి నుంచి బాటలు వేశారని విమర్శించారు. ఏఐతో ఫొటోలను క్రియేట్ చేయాల్సిన అవసరం తమకు లేదని, అనుమానముంటే ఆ ఫొటోలను ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించి చెక్ చేసుకోండని సూచించారు.

​కేటీఆర్ కూడా స్పీకర్‌‌ను అనడం సరికాదు : ఎమ్మెల్యే డాక్టర్‌ ‌వంశీకృష్ణ
​కేటీఆర్ ‘స్పీకర్ కు ఏం నోస్తుంది’ అని అనడం సరికాదని ఎమ్మెల్యే డాక్టర్‌ ‌వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ముంది పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. కేటీఆర్ పోలీస్ మెడ మీద దాడి చేశారన్నారు. దళితులు వచ్చారని కేసీఆర్ ఫార్మ్ హౌస్ చుట్టూ పసుపు నీటితో శుద్ధి కార్యక్రమం ఎలా చేస్తారని ప్రశ్నించారు. జీవితంలో కేసీఆర్ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టలేరన్నారు. కేసీఆర్ హావభావాలు అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఫాం హౌస్ వేదికగా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -