ఇండిస్టియల్‌కు సారవంతమైన భూములు ఇవ్వం
వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట
రైతులతో కలిసి కల్వకుంట్ల కవిత ధర్నా
పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విషారధన్ మహారాజ్.. కవిత అరెస్టు.. పరిస్థితి ఉద్రిక్తం
కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట..రాస్తారోకో
నవతెలంగాణ- వికారాబాద్
ఇండిస్టియల్ పేరిట రైతుల భూములను తీసుకోవద్దంటూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విషారధన్ మహారాజ్ ఆధ్వర్యంలో బుధవారం రైతులు ధర్నా చేశారు. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పరిగి మండలం రాపోల్, కడ్లాపూర్, దోమ మండలం బట్లచందారం, కొండాయపల్లి గ్రామాల్లో ఇండిస్టియల్ పేరిట రైతుల సారవంతమైన సాగు భూములు గుంజుకోవడం చాలా దారుణమన్నారు. తాతల కాలం నాటి భూములను నమ్ముకుని బతుకుతున్న రైతులను రోడ్డున పడేయడం అన్యాయమని, తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూసేకరణను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ధర లేక, రుణమాఫీ కాక ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూసీని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు కానీ, ఆ నది పుట్టిందే వికారాబాద్ జిల్లాలో అని, ఇక్కడ కంపెనీలు పెడితే మూసీ నది కలుషితం కాదా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం సేకరించాలనుకున్న 1200 ఎకరాల్లో 1000 ఎకరాలు అసైన్డ్ భూమి ఉన్నదని, 200 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయని వివరించారు. సాగు భూములు తీసుకుంటే రైతుల జీవనాధారం దెబ్బతింటుందని చెప్పారు. రైతుల భూముల జోలికొస్తే కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని సూచించారు. విషారధన్ మహరాజ్ మాట్లాడుతూ.. భూముల కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్కో జిల్లాలో లక్ష ఎకరాల చొప్పున 33 జిల్లాల్లో 33 లక్షల ఎకరాల భూములను తీసుకోవడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూనుకున్నదని తెలిపారు. ధర్నా సందర్భంగా పోలీసులు భారీగా మోహరించి కవితను అరెస్టు చేసేందుకు యత్నించగా తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే కవితను అరెస్టు చేసి బంట్వారం పోలీస్టేషన్‌కు తరలించారు. దీన్ని నిరసిస్తూ జాగృతి కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి బాలయ్య ముదిరాజ్, జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్, కో-కన్వీనర్స్ వెంకటేష్, యాదగిరి, మల్లికార్జున్, శ్రీనివాస్ ముదిరాజ్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రైతుల గోస ముఖ్యమంత్రికి పట్టదా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



