ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ప్రత్యేక బృందం
అన్ని వార్డులు, వెయిటింగ్ ఏరియాలో మంచినీటి సౌకర్యం
ఆరోగ్యశాఖ అధికారులను
ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందించేందుకు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఎమర్జెన్సీ కేర్‌లో ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో మంత్రి సమీక్ష చేశారు. అందులో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎమ్‌డీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎండా కాలం నేపథ్యంలో వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు తీసుకుంటున్న చర్యలను, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ల కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. అవసరమైన మెడిసిన్, ఓఆర్‌ఎస్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు, వారి సంరక్షకులకు, సిబ్బందికి తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలనీ, పాడైన వాటిని రిపేర్లు చేయించాలని ఆదేశించారు. ఐసీయూ, అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామి కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కార్మికులను, పట్టణాల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీబార్సు, గిగ్ వర్కర్లను దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం తలెత్తితే రోగులకు ఇబ్బంది కలుగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉన్న నేపథ్యంలో అన్ని ఆస్పత్రుల్లోనూ పవర్ కేబుళ్లను చెక్ చేయించాలని సూచించారు. ఆస్పత్రి లోపల, బయట గుట్కా నమలడం, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దనిఆదేశించారు. మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో, లేవో? చూడాలని.. వాటి ఎక్స్‌పైరీ గడువు తేదీలను సైతం చెక్ చేయాలని ఆదేశించారు. మంటలు ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీకి మరోసారి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమీపంలోని ఫైర్ స్టేషన్ అధికారులతో, హాస్పిటల్ అధికారులు సమన్వయం చేసుకోవాలనీ, ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణీల పట్ల కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయటకెళ్తే వాటర్‌బాటిల్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలనీ, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు.
వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



