Magazines

నయా ఫాసిజం నిర్దిష్ట పోకడలు

2 గంటల క్రితం

new fascism
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 6 నిమిషాల చదవడం

జార్జి డిమిట్రోవ్ కొమింటర్న్ 7వ మహాసభకు అధ్యక్షత వహించి, ఫాసిజంతో పోరాడేందుకు ‘యునైటెడ్ ఫ్రంట్’ వ్యూహాన్ని రూపొందించిన ప్రముఖ బల్గేరియన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. 1933లో నాజీలు జర్మనీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రీచ్‌స్టాగ్ తగలబెట్టాడన్న అక్రమ అభియోగం మోపి డిమిట్రోవ్ను, సహచర కమ్యూనిస్టు నాయకులను జైలులో నిర్బంధించారు. కోర్టు కేటాయించిన లాయర్ సేవలను నిరాకరించి కేసు విచారణలో డిమిట్రోవ్ తన వాదనలను తానే వినిపించుకున్నాడు. డిఫెన్స్ వాదనలో భాగంగా నాజీల నాయకుడు, హిట్లర్ ప్రభుత్వంలో యుద్ధ మంత్రి అయిన హెర్మన్ గోరింగ్‌ను సాక్షిగా విచారించాలని కోరాడు. కోర్టు ఆ అభ్యర్థనను ఆమోదించింది. డిమిట్రోవ్ క్రాస్-ఎగ్జామినేషన్ ఎంత శక్తివంతంగా సాగిందంటే, ఒకానొక దశలో గోరింగ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ‘‘నువ్వు ఒక దుర్మార్గుడివి, నిన్ను ఉరితీయాలి’’ అని ఉక్రోషంగా అరిచాడు. కానీ డిమిట్రోవ్ శాంతంగా, అత్యంత పదునుగా తన మీదా, సహచర కమ్యూనిస్టు నాయకుల మీదా మోపిన కేసు నకిలీ స్వభావాన్ని బట్టబయలు చేశాడు. చివరికి కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. అధికారంలో ఉన్న నాజీల నాయకుడికి సమన్లు పంపి విచారించేందుకు అనుమతించిన నాటి జర్మన్ న్యాయమూర్తి వ్యవహార శైలికి, ఆరేళ్లకు పైగా జైలులో మగ్గుతున్నప్పటికీ విచారణ కూడా ప్రారంభం కాని కొంతమంది యువ నిందితులకు కనీసం బెయిల్ కూడా మంజూరు చేయని ప్రస్తుత భారతీయ న్యాయ వ్యవస్థ తీరుకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత దిగ్భ్రాంతికరమైనదో మీరే ఊహించుకోండి.

అటువంటి ఒక ఖైదీ అమిత్ షా ను కోర్టుకు పిలిపించి క్రాస్-ఎగ్జామినేషన్ చేయాలని కోరితే మన అత్యున్నత న్యాయ వ్యవస్థ ఏ రకంగా స్పందిస్తుందో మన ఊహకైనా అందదు. ఈ రెండు కేసుల మధ్య ఇంత తేడా ఎందుకుంది అన్న ప్రశ్న సహజంగానే మనలో తలెత్తుతోంది. దీనికి అంత సుదూర చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల క్రితమే, అమెరికన్ ఫెడరల్ కోర్టు ఒకటి డోనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమెరికా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున చెల్లవని కొట్టేసింది (తత్ఫలితంగా, యాదృచ్ఛికంగానే అయినా ప్రస్తుతం ఇండో-అమెరికన్ వాణిజ్య ఒప్పందం పునఃపరిశీలనలో ఉందనుకోండి). సదరు న్యాయస్థానం మీద ట్రంప్ కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. అమెరికా న్యాయ వ్యవస్థకు, మన భారతీయ న్యాయ వ్యవస్థకు మధ్య ఇంత తేడా ఎందుకు ఉందన్న ప్రశ్న మళ్లీ మనలో ఉత్పన్నమవుతోంది. నాజీ జర్మనీ పాలనలో కూడా కనీవినీ ఎరుగని స్థాయిలో భారతీయ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వర్గానికి ఎందుకింతలా లొంగిపోతోంది? వాస్తవానికి రీచ్‌స్టాగ్ అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభమయ్యే నాటికి ‘వైమార్ రిపబ్లిక్’ ఏర్పడి (1918) కేవలం 15 సంవత్సరాలే అయ్యింది. కానీ భారతదేశంలో మన రాజ్యాంగం, మన గణతంత్ర రాజ్యం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కాలం (75 ఏండ్లు) మన్నింది. కాబట్టి మన సంస్థలు, ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ మరింత బలోపేతమై ఉండాల్సింది కదా. కానీ అలా జరగలేదు. ఎందుకని? ఫాసిజం అనండి లేదా నయా-ఫాసిజం అనండి, అది అత్యంత ఆధునికమైన ధోరణి.

ఇది కార్పొరేట్ పెట్టుబడి, ఫాసిస్టు మతతత్వ శక్తుల మధ్య కుదిరిన అపవిత్ర చెలిమి ఆధారంగా ఉద్భవిస్తుంది. ఇలాంటి చెలిమి గుత్త పెట్టుబడిదారీ యుగంలో మాత్రమే సాధ్యపడుతుంది. అదీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడి, తన చట్టబద్ధతను కోల్పోయే ప్రమాదం ఆసన్నమైన సమయంలో తలెత్తుతుంది. నిజానికి, ఫాసిజంపై మార్క్సిస్టు అవగాహనకు, ఉదారవాద అవగాహనకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే-గుత్త పెట్టుబడి ఆధిపత్యాన్ని కాపాడటంలో ఫాసిజం పాత్రను మార్క్సిజం గుర్తించడమే. ఉదారవాదం పక్కదోవ పట్టించే వాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. నయా-ఫాసిజం కాలంలో ఇది మరింత వాస్తవం. ఎందుకంటే పూర్వపు ఫాసిజం, నయా-ఫాసిజం వలె కాకుండా, పక్క దోవ పట్టించే ఉపన్యాసాలు ఇచ్చినా నిరుద్యోగ సమస్యను అధిగమించగలిగింది. లోటు బడ్జెట్ ద్వారా వ్యయాన్ని, ముఖ్యంగా భారీ సైనిక వ్యయాన్ని పెంచడం ద్వారా అది డిమాండు సృష్టించి నిరుద్యోగాన్ని భారీగా తగ్గించింది. అయితే ఫాసిజం, నయా-ఫాసిజాలు ఆధునిక పోకడలే అయినప్పటికీ, అవి ఫ్యూడల్ యుగపు ఆలోచనలను, భావజాలాలను ఉపయోగించుకుంటాయి. ఇవి ఆయా దేశాల గత చరిత్రను బట్టి దేశానికీ దేశానికీ మారుతుంటాయి. ఆధునిక సమాజంలో మెజారిటీ ప్రజలలో ద్వేషాన్ని పెంచడానికి సృష్టించే ‘వాళ్లు’ అనే పదం ఐరోపాలో నల్లజాతీయులు, ముస్లిం వలసదారులు కావచ్చు. కానీ భారతదేశంలో ‘వాళ్లు’ అంటే దళితులు, ముస్లింలే. ‘వాళ్లు’ ఇక్కడ విదేశీ వలసదారులు కారు, వేల సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్న స్థానిక నివాసితులు.

ఈ ‘అన్య’ వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అబద్ధాలు కూడా దేశాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతి సంద ర్భంలోనూ ఆ దేశ చరిత్రను వికృతంగా చిత్రీకరిస్తాయి. ఈ వ్యత్యా సమే ఫాసిజం, నయా-ఫాసిజం నిర్దిష్ట పోకడలకు దారితీస్తుంది. ఈ విధంగా ఫాసిజం, నయా-ఫాసిజం రెండూ కొన్ని స్పష్టమైన సాధారణ లక్షణాలను కలిగి ఉంటాయి-ప్రజలపై తీవ్రమైన అణచివేత, కార్పొరేట్ పెట్టుబడితో సన్నిహిత సంబంధం, ఒక ‘‘నాయకుడి’’ చుట్టూ వ్యక్తి పూజ నిర్మాణం, మైనారిటీపై ద్వేషాన్ని పెంచడం-ఇవన్నీ అందులో భాగమే. అయినప్పటికీ, అవి ఆయా దేశాల ప్రత్యేక సందర్భాన్ని బట్టి ఒక్కో దేశానికీ ఒక్కోరకంగా ఉంటాయి. ఫాసిజం అనేది ఆధునిక పోకడ. ఇది ఆధునిక యుగానికి చెందినది. కానీ ఇది మధ్య యుగం నాటి ఫ్యూడల్ భావజాల పక్షపాతాలను సాధనంగా ఉపయోగిస్తుంది. ఇది ప్రేరేపించే సామాజిక విప్లవ ప్రతీఘాత స్వభావం ఈ పక్షపాత భావజాలం ద్వారానే నిర్ణయించబడుతుంది. భారతదేశంలో నయా-ఫాసిజం మధ్యయుగ పక్షపాత భావ జాలాన్ని విరివిగా వాడడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సామా జికంగా నిమ్న కులాలకు చెందిన వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం ఇందులో భాగమే. భారతదేశంలో నయా-ఫాసిస్టుల ఆగ్రహం ప్రధానంగా ముస్లింలపై కేంద్రీకృతమై ఉన్నందున ఈ వాదన వింతగా అనిపించవచ్చు. కానీ నిమ్న కులాలపై ఉన్న పక్షపాతం ముస్లింలపై పక్షపాతానికి మారడం రెండు స్పష్టమైన కారణాల వల్ల నిరంతరం సాగుతుంది. ముస్లిం జనాభాలో ఎక్కువ భాగం గతంలో కుల అణచివేత నుండి తప్పించుకోవడానికి మతం మారిన వారి సంతానమే.

వ్యక్తుల మధ్య సహజమైన అసమానతలు ఉంటాయన్న భావన ఒక దాని నుండి మరొక దానికి వ్యాపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, వ్యక్తి ప్రాథమిక హక్కుల పట్ల నయా-ఫాసిస్టులు ప్రదర్శించే నిర్లక్ష్యం కులవ్యవస్థ అసమానతల నుండి సంక్రమించిన అవశేషమే. అన్ని భూస్వామ్య సమాజాలు మానవుల మధ్య ఉన్న సహజ అసమానతల భావనపై ఆధారపడి ఉంటాయని వాదించవచ్చు, అయితే సాధారణ ప్రజల పట్ల, అధికారంలో ఉన్న వారి పట్ల ఉన్నత వర్గాల వైఖరిలో తేడా పాశ్చాత్య ప్రపంచంలోని దేశాలతో పోలిస్తే భారతదేశంలో భిన్నంగా ఏమీ లేదు. కాబట్టి కార్యనిర్వాహక వర్గానికి న్యాయ వ్యవస్థ లొంగిపోవడాన్ని కేవలం కుల వ్యవస్థ లాంటి వారసత్వ భూస్వామ్య విలువల ఆధారంగా వివరించలేము. అయితే, కొన్ని పాశ్చాత్య దేశాలలో భూస్వామ్య విలువలను తీవ్రంగా దెబ్బతీసి, వ్యక్తుల మధ్య సమానత్వం, వ్యక్తిగత హక్కుల పవిత్రతపై ఉన్నత వర్గాలలో విస్తృత విశ్వాసాన్ని సృష్టించిన బూర్జువా ప్రజాతంత్ర విప్లవాలు జరిగాయి. అటువంటి బూర్జువా ప్రజాతంత్ర విప్లవాలు సంభవించిన రెండు దేశాలలో (ఇంగ్లాండ్, ఫ్రాన్స్) పాలక రాచరిక శక్తులను ఉరిశిక్షలకు గురి చేశాయి. ఈ చర్యలు వ్యక్తుల సమానత్వ భావనలకు విస్తృత ఆమోదాన్ని కల్పించాయి. భారత దేశంలో సామాజిక, రాజకీయ సమానత్వానికి సంబంధించిన బూర్జువా ఆలోచనలు ఉన్నత వర్గాలలో ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. బూర్జువా ఆలోచనలు ఆర్థిక సమానత్వాన్ని అంటనైనా అంటలేదన్నదాంట్లో సందేహమే లేదు. ఫలితంగా, స్వాతంత్య్రానంతర భారతదేశంలో లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగం ద్వారా ప్రజలు అనుభవి స్తున్న హక్కులు, ఈ హక్కుల రక్షణకు న్యాయ వ్యవస్థ చొరవ తీసుకోకుండా పోయే ప్రమాదం ఎప్పుడూ కొనసాగుతూ వచ్చింది.


ప్రజల హక్కులను కుదించడమే సహజ ధోరణిగా ఉన్న నయా-ఫాసిస్టు పాలనలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అత్యంత కీలకమైన కోణంలో, నేడు భారతదేశంలో సాగుతున్న పోరాటం ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే అయినప్పటికీ...ఈ పోరాటంలో న్యాయ వ్యవస్థలో కూడా సమాజంలో నెలకొని ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థ దృక్పథాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ప్రజల హక్కులను లాక్కుంటున్న వైనానికి సంబంధించి రెండు తాజా ఉదాహరణలను మీకు గుర్తు చేస్తాను. మొదటిది, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం. గ్రామీణ పేదలు కోరిన మీదట వంద రోజుల పనిని కల్పించే హక్కును కల్పించే చట్టాన్ని గతంలో పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఆమోదించింది. అలాంటి చట్టబద్ధ హక్కును మోడీ ప్రభుత్వం లోక్‌సభలో ఎటువంటి చర్చ లేకుండా కేవలం మూజువాణి ఓటు ద్వారా రద్దు చేసింది. ఇక రెండవ ఉదాహరణ-చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుమారు 13 కోట్ల మంది ఓటు హక్కును తొలగించడానికి చేసిన ప్రయత్నం. ఇది ఏ ప్రజాస్వామ్యానికైనా పునాదిగా ఉన్న రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కును రద్దు చేయడం తప్ప మరొకటి కాదు. ఇటువంటి రద్దుల వెనుక ఉన్న నిగూఢమైన లక్ష్యం ఏమిటంటే-ప్రజలు తమ హక్కులను డిమాండ్ గా కోరడానికి బదులుగా తమకు ఫలానా పార్టీ సంక్షేమ పథకాలు అందించింది కాబట్టి ఆ పార్టీ పట్లా, ఆ ప్రభుత్వం పట్లా కృతజ్ఞతతో ఉండాలి అనేదే.

ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే, మన న్యాయ వ్యవస్థ ఈ రెండు సందర్భాలలోనూ ప్రజల హక్కులను కాపాడేందుకు జోక్యం చేసుకోలేదు. అక్టోబర్ 6న జరగాల్సిన పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ఓటర్ల హక్కుల రద్దు విషయంలో న్యాయ వ్యవస్థ వైఖరి మరింత ఆందోళన కలిగించేదిగా ఉన్నది. ఇవి కేవలం ఉపఎన్నికలు మాత్రమే కాబట్టి ఓటర్ల హక్కుల రద్దు ఫిర్యాదులను పరిష్కరించడం కోర్టు అంత అత్యవసరంగా భావించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. కానీ ఇది శుద్ధ తప్పుడు వాదన. బ్రిటన్‌లో ఒక ఉప ఎన్నిక ఫలితం ఆ దేశ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితికి దారితీసింది. అంతేకాక ఇది న్యాయ వ్యవస్థ వైఖరిలోని ప్రతికూలతను స్పష్టం చేస్తుంది-రాజ్యాంగబద్ధంగా తమకు దక్కాల్సిన హక్కులను డిమాండ్ చేయడానికి బదులుగా, ప్రభుత్వం తమకు ఏది ఇస్తే దాంతోనే ప్రజలు సంతృప్తి చెందాలని న్యాయ వ్యవస్థ భావిస్తున్నట్లు ఉంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం కొనసాగుతున్న పెడ ధోరణులను సరిదిద్దడమనే అంశాన్ని కూడా ప్రజాస్వామ్యం కోసం సాగే పోరాటంలో అంతర్భాగంగా మలచుకోవాలి. సమాజంలో వేళ్లూనుకుపోయిన నిచ్చెన మెట్ల ఆధిపత్య భావజాలాన్ని అధిగమించి న్యాయస్థానాలు కాలిక స్పృహతో ముందుకు సాగాల్సిన మౌలిక అవసరాన్ని వాటికి గుర్తింపజేయాలి. (స్వేచ్ఛానుసరణ)


ప్రభాత్‌ ‌పట్నాయక్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్