తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైస్ మిల్లింగ్ రంగం కీలకమైనది. రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత మిల్లర్లపై ఉంటుంది. ఈ ప్రక్రియలో రైతులు, ప్రభుత్వం, మిల్లర్లు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజాధనం సద్వినియోగమవుతుంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో రైస్ మిల్లింగ్ వ్యవస్థ అక్రమాలు, అవినీతి, పరిపాలనా వైఫల్యాలతో సమస్యాత్మకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ అధికారులు పలువురు మిల్లర్లను, డిఎస్‌ఓను అరెస్టు చేశారు. సన్న రకం ధాన్యాన్ని పక్కదారి పట్టించి, దాని స్థానంలో తక్కువ ధర కలిగిన దొడ్డు రకం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే మహబూబ్ నగర్ లో పట్టుపడ్డ ఒక అధికారి వద్ద రూ.200 కోట్లు దొరికినవి.ఈ పరిణామాలు రైస్ మిల్లింగ్ వ్యవస్థలోని లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ పూర్తయి, తప్పిదాలు నిర్ధారణ కావాల్సి ఉంది. మిల్లర్లతోపాటు అధికారుల బాధ్యతనూ తేల్చాలి.
ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం, అక్రమంగా విక్రయించడం, తప్పుడు లెక్కలు చూపించడం, బియ్యం అప్పగింతలో ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడటం తీవ్రమైన నేరాలు. ఇలాంటి అక్రమాలకు పాల్పడినవారు ఎంతటి ఆర్థిక, రాజకీయ పలుకుబడి కలిగినవారైనా చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవాలి. అదే సమయంలో మిల్లర్ల అక్రమాలకు సహకరించిన అధికారులు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది బాధ్యతను కూడా నిర్ధారించాలి. ధాన్యం కేటాయింపు నుంచి రవాణా, నిల్వలు, మిల్లింగ్, బియ్యం అప్పగింత వరకు ప్రతి దశను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం పాత్రపై సమగ్ర విచారణ జరగాలి. అధికారుల పర్యవేక్షణలోనే అక్రమాలు జరిగితే వాటిని గుర్తించడంలో విఫలమైనవారెవరు? అక్రమాలకు సహకరించినవారెవరు? అనే అంశాలపై కూడా విచారణ జరగాలి. మిల్లర్లపై మాత్రమే చర్యలు తీసుకుంటే వ్యవస్థలోని అవినీతి పూర్తిగా నిర్మూలించలేం. బాధ్యత మిల్లర్లకే కాకుండా పర్యవేక్షించాల్సిన అధికారులకూ ఉంటుంది.
పదేండ్ల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్
గత పదేళ్లలో ప్రతి మిల్లుకు, ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లో ఎంత ధాన్యం కేటాయించారు? వాస్తవంగా ఎంత ధాన్యం చేరింది? ఎంత మిల్లింగ్ జరిగింది? నిర్దేశిత అవుట్‌టర్న్ రేషియో ప్రకారం ఎంత బియ్యం రావాలి? ఎంత అప్పగించారు? ఎంత బకాయి ఉంది? అనే వివరాలను స్వతంత్ర నిపుణుల కమిటీ ద్వారా పరిశీలించాలి. స్టాక్ రిజిస్టర్లు, గోదాముల నిల్వలు, రవాణా పత్రాలు, వేబ్రిడ్జి రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, మిల్లింగ్ వివరాలను ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చాలి. అధికారుల తనిఖీ నివేదికలు, ధృవీకరణ పత్రాలు, గడువు పొడిగింపులు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని నిర్ధారించి బాధ్యుల నుంచి చట్టప్రకారం రికవరీ చేయాలి. ఆడిట్ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఈ ఆడిట్ కేవలం రికార్డుల పరిశీలనకే పరిమితం కాకూడదు. ప్రతి మిల్లును ఒక యూనిట్‌గా తీసుకొని, ప్రతి సీజన్‌కు సంబంధించిన ధాన్యం, బియ్యం నిల్వలు, అప్పగింతలు, బకాయిలను విడివిడిగా నిర్ధారించాలి. ఉద్దేశపూర్వకంగా ధాన్యాన్ని దుర్వినియోగం చేసినవారిని, ప్రభుత్వ జాప్యం లేదా విధానపరమైన లోపాల వల్ల బకాయిలు ఏర్పడినవారిని స్పష్టంగా వేరు చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి జరిగిన నష్టానికి అసలు బాధ్యులెవరో తెలుస్తుంది.
డిఫాల్టర్లందరినీ ఒకే గాటన కట్టకూడదు
ప్రభుత్వ ధాన్యాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసిన విల్‌ఫుల్ డిఫాల్టర్లు ఒకవైపు ఉంటే, ప్రభుత్వ విధానపరమైన లోపాలు, ధాన్యం సరఫరాలో జాప్యం, నిర్వహణ వ్యయాల పెరుగుదల, ఒప్పందాల్లోని అసమతుల్యత వంటి కారణాలతో బకాయిల్లో చిక్కుకున్న నాన్-విల్‌ఫుల్ డిఫాల్టర్లు మరోవైపు ఉన్నారు. ఈ రెండు వర్గాలను ఒకే విధంగా చూడటం సరికాదు. ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జాప్యాలు, విధానపరమైన సమస్యల వల్ల నష్టపోయిన నిజాయితీగల మిల్లర్ల సమస్యలను కూడా వాస్తవాల ఆధారంగా పరిష్కరించాలి. ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన బకాయిలను కూడా మిల్లర్ల ఉద్దేశపూర్వక తప్పిదాలుగా పరిగణించకూడదు. అలాగే శాస్ర్తీయమైన మిల్లింగ్ విధానాలు కూడా అవసరం. 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం అప్పగించాలనే ప్రస్తుత అవుట్‌టర్న్ నిబంధనను క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమీక్షించాలి.
ధాన్యం నాణ్యత, తేమ శాతం, నిల్వ కాలం, ఖరీఫ్, రబీ సీజన్ల మధ్య తేడాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షా మిల్లింగ్ నిర్వహించాలి. ధాన్యం సరఫరాలో ప్రభుత్వ జాప్యం వల్ల కలిగే నాణ్యత, బరువు నష్టాలకు బాధ్యతను స్పష్టంగా నిర్ణయించాలి. బియ్యం అప్పగింత గడువులు, నిల్వ వ్యయాలు, పరిహారం, డిమరేజ్ అంశాల్లో ప్రభుత్వం-మిల్లర్ల మధ్య న్యాయబద్ధమైన ఒప్పందాలు ఉండాలి. సకాలంలో ధాన్యం సరఫరా చేయకుండా మరోవైపు బియ్యం అప్పగింతకు కఠిన గడువులు విధించడం సమంజసం కాదు. ధాన్యం నిల్వల వల్ల కలిగే నష్టాలు, మిల్లింగ్‌కు అవసరమైన సమయం, పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను కూడా ఒప్పందాల్లో పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం, మిల్లర్ల మధ్య పరస్పర బాధ్యతలు, హక్కులకు తగిన ప్రాధాన్యత ఉండాలి.
పారదర్శకతతోనే వ్యవస్థకు భవిష్యత్తు
ధాన్యం కేటాయింపు నుంచి బియ్యం అప్పగింత వరకు ప్రతి దశను డిజిటల్ పర్యవేక్షణలోకి తీసుకురావాలి. మిల్లులవారీగా, సీజన్‌వారీగా నిల్వలు, మిల్లింగ్, అప్పగింతల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలి. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను, వారికి సహకరించిన అధికారులను శిక్షించడంతోపాటు ప్రభుత్వ విధానపరమైన లోపాలను సరిదిద్దాలి. ఇందుకోసం స్వతంత్ర నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర ఆడిట్‌ను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలి. తనిఖీలు, కేసులు, జరిమానాలకే పరిమితం కాకుండా వ్యవస్థలో అక్రమాలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు రూపొందించాలి. రైతుల ప్రయోజనాలు, ప్రజాధనం పరిరక్షణ, నిజాయితీగల మిల్లర్ల మనుగడ ఈ మూడింటికీ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను కాపాడాల్సిన అవసరం లేదు. అవినీతికి పాల్పడిన అధికారులను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో విధానపరమైన లోపాల వల్ల సంక్షోభంలో చిక్కుకున్న నిజాయితీగల మిల్లర్లకు న్యాయం చేయాలి. వ్యక్తులను కాపాడే వ్యవస్థ కాకుండా, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను కాపాడే వ్యవస్థ ఏర్పడినప్పుడే తెలంగాణ రైస్ మిల్లింగ్ రంగం గాడిలో పడుతుంది.
సయ్యద్ రఫీ, 9966025325







కామెంట్లు (0)