Magazines

ఓటు విలువను నీరుగార్చిన విధానాలెన్నో..!

2 గంటల క్రితం

vote
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 4 నిమిషాల చదవడం

ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయానికి ఏకైక ప్రతీక ఓటు. స్వతంత్ర భారత దేశము ప్రజలకు అందించిన అందరికీ సమాన హక్కును కల్పిస్తూ అందించిన అంతిమ ఏకైక ఆయుధం ఓటు. అలాంటి ఓటు పట్టుమని పది సంవత్సరాలైనా సరే స్వతంత్రంగా ఉన్నదో లేదో గానీ వేటగాళ్ల కాట్లకు గురవుతూనే ఉన్నది. వేటగాళ్లు ఒక్కరా ఇద్దరా!అనేకులు! ఓటుకు పడిన గాట్ల వల్ల ప్రజాస్వామ్యమే ఖూనీ అయిపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుపైన గత రెండేండ్లుగా జరుగుతున్న ఓటర్ లిస్టుల ప్రక్షాళన సందర్భంగా దాదాపు 13.5 కోట్ల ఓటర్లను లిస్టులోంచి తొలగించారన్న అంశంపై వివాదం తారస్థాయికి చేరింది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల10వ తారీఖున పెద్ద ఎత్తున నిరసనకు దిగడం, ముందస్తు అరెస్టులు ఆ తరువాత ఇండియా కూటమి హలో సుప్రీం కోర్టు వంటివన్నీ కొత్త పరిణామాలు. ఈ సందర్భంగా ఓటర్ లిస్టుల ప్రక్షాళనలో జరుగుతున్న అవకతవకలు ఒకమాట అయితే ఎన్నికల సంఘం ప్రతిష్ట పూర్తిగా మసకబారే విధంగా ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ సాగిందని అర్థమవుతుంది.

స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో రాజ్యాంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అట్లాంటి రాజ్యాంగంలో అత్యంత కీలక భూమిక పోషించవలసిన ఒక ప్రధాన అంగము భారత ఎన్నికల కమిషన్. ఆ ఎన్నికల కమిషన్ ఈరోజు ఒక కళంకాన్ని ఎదుర్కొంటుంది. భారత ఎన్నికల సంఘానికి ప్రతిష్ట మసకబారితే భారతదేశ ప్రజాస్వామ్యముకే విలువ ఉండదు. నిజానికి కేవలం ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ సందర్భంగా తలెత్తిన వివాదాంశాల కన్నా మించిన ప్రక్షాళన ఓటుకు సంబంధించి మరింత లోతుగా భారతదేశ ఎన్నికల వ్యవస్థను భారతదేశంలో జరుగుతున్న ఓటింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓటు నమోదు నుంచి ప్రజాప్రతినిధుల కాలం ముగిసే వరకు ఓటరు నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. కానీ ఓటు నమోదు నుండి ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధి పదవి కాలం ముగిసే వరకు ఓటరు అంతిమ నిర్ణయానికి ఎన్నో రకాల తూట్లు పొడుస్తున్నారు. నిజానికి ఓటు అమ్ముడిపోతున్నది, ఓటర్లు తమను తాము అమ్ముకుంటు న్నారు అని ఓటరు పైన నిందలు వేస్తాం. కానీ అది అబద్ధం. అభ్యర్థులు ఓటర్లను అభ్యపెట్టి ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు.

ఓటు నమోదు ప్రభుత్వం బాధ్యత. భారతదేశ పౌరులందరికీ విధిగా ఓటు హక్కును కల్పించవలసినది ప్రభుత్వమే. అలా కల్పించిన ఓటు స్వేచ్ఛగా వినియోగించే అవకాశం కూడా ఇవ్వాలి. కానీ ఈరోజు ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేసే పరిస్థితి లేదు. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుండి ఓటరుపై విపరీతమైన ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఎన్నో ప్రలోభాలతో కూడుకొని ఉంటుంది. అభ్యర్థులు తమ అవసరాల కోసం ఓటర్లను ప్రలోభపెట్టి, డబ్బులు పంచడం అనేది భారతదేశ ఎన్నికల వ్యవస్థలో సాధారణ అంశంగా మారింది. ఎన్నికల్లో డబ్బులు పంచబడుతున్నాయన్న విషయం ఎన్నికల సంఘానికి తెలియనిది కాదు. అయినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అంటే ఓటును వేటాడుతున్న వారిని వదిలేసినట్లే అర్థం. ఎన్నికల వ్యవస్థ అభ్యర్థులకు విధించిన ఎన్నికల ఖర్చు పరిమితి పై ఏమాత్రము చర్య తీసుకోదు. చర్యల అంశాన్ని పేపర్ పైన మాత్రమే వదిలేస్తారు. ఎన్నికలలో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల నుండి అభ్యర్థులు సాగించే ఎన్నికల ప్రచారంలో వారు ఉల్లంఘించే ఎన్నికల కోడును కూడా సీరియస్ గా తీసుకోరు.

అంతేకాకుండా అభ్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంపై లేదా కొన్ని నిబంధనల ప్రకారం కులము, మతము, ప్రాంతం, మిలిటరీ వంటి అంశాలను ప్రస్తావించకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు అట్లాంటి నిబంధనలను ఉల్లంఘిస్తుంటే ఎన్నికల సంఘం గాని, అధికారులు గాని చర్యలు తీసుకున్న సందర్భాలు తక్కువ. అధికార పార్టీ పై ఎప్పడు తీసుకోరు. అంతేకాకుండా ఎన్నికల సంఘం అధికార పార్టీకి ఊడిగం చేసే విధంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తుంటే ఓటర్లు లేదా ఓటును స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని ఎక్కడ ఇచ్చినట్లౌతది. ఇక ఓటును ప్రభావితం చేయగలిగిన రెండవ అంశం రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు ఈ దేశంలో కుల, మత, ప్రాంత ఆధిపత్య కూటమిలుగా విభజించబడ్డాయి. అందుచేత అస్తిత్వ రూపాలలో ఓటర్లను పూర్తిగా ప్రభావితం చేసే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల ప్రాబల్యంతో ఓటు విలువిలాడిపోతుంది. కులమే అభ్యర్థి, పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. అంటే స్వేచ్ఛగా రాజ్యాంగం ప్రకారము పరిపాలన కోసం ఓటు వేయాల్సినటువంటి స్థితి ఈరోజు అనేక రాష్ట్రాలలో లేదన్నమాట.

రాజకీయ పార్టీలు అభ్యర్థులను కరారు చేసేటప్పుడు కూడా కులమత ప్రాంతాలకు మరియు ఆర్థికంగా బాగా ధనవంతులకు మాత్రమే ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎన్నికల వ్యవస్థలో ధనబలం ఇతరతరా అస్తిత్వ బలాలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయో దానికి కారణం ఎవరయ్యారంటే పార్టీలేనన్న విషయాన్ని మరవరాదు. ఆ రకంగా ఓటు ప్రాధాన్యతను పార్టీలు భూస్థాపితం చేసేశాయి. అధికార పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పరిపాలన సాగించాలి. కానీ అధికారానికి ఎక్కిన మరుసటి రోజు నుండే పూర్తిగా ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా లేదా తమకు అనుకూలంగా ఓట్లు పడే ప్రాంతాలలో లేదంటే సమూహాలలో మాత్రమే సరైన పరిపాలన చేసే విధంగా సాగుతుంది. అంటే ఓటర్లను స్వేచ్ఛాయుతంగా కాకుండా ప్రలోభపెట్టే విధంగా ఎన్నిక కాబడిన ప్రభుత్వాలు కూడా ప్రవర్తిస్తుంటే ఇక ఓటరు స్వతంత్రత ఎక్కడ ఉన్నట్లు. మీడియా పూర్తిగా ఏకపక్షమైపోయి లేదా విడిపోయి ఓటర్లకు తప్పుడు సమాచారాన్ని లేదా వండివార్చిన సమాచారాన్ని ఇవ్వడం వల్ల ఓటు స్వతంత్రత కనుమరుగైపోతుంది. అధికారం ఉంటేనే వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అనే నానుడి ఏర్పడిన తర్వాత బడా పెట్టుబడిదారులు తమకునచ్చిన పార్టీ గెలవాలని లేదా తాము ప్రతిపాదించే అభ్యర్థి గెలవాలని లేదా తామే అభ్యర్థులుగా గెలవాలనేటువంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి.

అందుచేత బడా వ్యాపారులు ఓటర్లను ప్రలోభపెట్టే అనేక రకాల మార్గాలను ఎన్నుకొని ప్రజాస్వామ్యంలో ప్రధాన భూమిక నిర్వహించే ఓటు ప్రాధాన్యతను తగ్గించారు. ఓటు విలువ పక్కదారి పట్టే మరో సందర్భం ఏమంటే ఎన్నికల అనంతరము ఎన్నిక కాబడిన అభ్యర్థి తన స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులు చేయడము. అట్లా పిరాయింపులు చేసినటువంటి అభ్యర్థిని లేదా అభ్యర్థుల సమూహాన్ని అధికార పార్టీలు ప్రోత్సహించి, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే పరిస్థితి ఉన్నది. అనగా ఓటరు అభిప్రాయాన్ని ఎన్నికైన ప్రతినిధులు పూర్తిగా భూస్థాపితం చేస్తున్నారని అర్థమవుతుంది. పార్లమెంటు, శాసనసభలలో ఎన్నిక కాబడిన అభ్యర్థులు గైర్హాజరై ఓటర్ల అభిప్రాయాన్ని ఏ మాత్రము శాసన నిర్మాణ కార్యక్రమంలో వ్యక్తపరచకుండా ఓటు విలువను దిగజారుస్తుండటం మరో కోణం. దీంతో పాటు శాసనసభ, పార్లమెంటు స్పీకర్ల ఏకపక్ష వ్యవహార శైలి కూడా ఓటర్ల అభిప్రాయాన్ని తుంగలో తొక్కినట్లు చేస్తోంది. అంటే అధికార పక్షానికి పూర్తిగా వంతపాడి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఏ మాత్రం విలువను ఇవ్వకుండా లేదా ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా స్పీకర్లు కూడా ఓటర్ల అభిమతాన్ని నీరుగార్చిన పరిస్థితి వాస్తవం.


గూళ్ల తిరుపతయ్య, 9951300016

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్