నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం పెను విషాదాన్ని నింపింది. అనుమానాస్పద విషపూరిత మద్యం సేవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రభావిత గ్రామాల్లో వైద్య పరీక్షలు ప్రారంభించి, ముందుజాగ్రత్త చర్యగా పలు మద్యం దుకాణాలను సీల్ చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “సంబంధిత మంత్రి, అధికారులను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించాను. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇలాంటి వాటిని మా ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు” అని ఆయన మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.



