– సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
హక్కుల కోసం బలమైన కార్మికోద్యమం నిర్మించాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు డిసెంబర్ 7,8,9 తేదీల్లో మెదక్ పట్టణంలో నిర్వహించబోతున్నామని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్ రాష్ట్ర మహా సభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, వీఎస్. రావు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎం. పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. నూతన ఆర్ధిక విధానాలు, ప్రయివేటీకరణ, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ తదితర అంశాలపై సెమి నార్లు, సదస్సులు ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలి పారు. మహాసభల నిర్వహణకు ఆర్ధిక నిధుల సేకరణకు ఏర్పడిన టీమ్‌లు ముమ్మరంగా కృషి చేస్తున్నాయని కార్మికులు, ఉద్యోగులు, శ్రేయోభిలాషులు విరివి గా విరాళాలు ఇస్తున్నారని చెప్పారు. వ్యయ, ప్రయాసలతో కూడుకున్న మహా సభల నిర్వహణకు మేధావులు, ప్రజాతంత్రవాదులు, యావత్తు శ్రామికులు సహ కరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరిస్తున్నదనీ, ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత బహుళజాతి గుత్త సంస్థలకు రక్షణ రంగాన్ని దారాధత్తం చేస్తున్నదని ఘాటుగా విమర్శించారు. మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో ప్రభుత్వరంగ సంస్థల భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు రాష్ట్ర సర్కారు పూనుకుంటున్న తీరును ఎండగట్టారు. రైల్వే రంగాన్ని క్రమంగా ప్రయివేటీకరిస్తున్న తీరును వివరించారు. ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల్లో మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, పుల్ టైమ్ డైరెక్టర్లను ప్రయివేటు వ్యక్తులతో నియమించుకోవడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం దుర్మార్గమని విమర్శించారు. ఈ చర్యలు దేశ ఆర్ధిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయనీ, సామ్రాజ్యవాదులతో మిలాఖత్ కావడం దేశ ద్రోహమని అన్నారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..30 రోజులుగా జరుగు తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్ డైలీవేజ్ కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు జీతాల పెంపు, జీవన ప్రమాణాలు, కార్మిక హక్కులు అమలు చేయాలని అన్నారు. షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్స్‌లోని కార్మికులకు కనీస వేతనాల పెంపుదలకు కనీస వేతన సలహా మండలి సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES