రిజిస్ట్రేషన్ రద్దు నోటిఫికేషన్‌పై సీపీఐ(ఎం) ఆందోళన
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ లేఖ
న్యూఢిల్లీ : నిర్దిష్ట నేరాల్లో చార్జిషీట్ దాఖలు చేశారనే కారణంతో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ చట్టం, 1955 కింద నోటిఫికేషన్ జారీ చేయడంపై సీపీఐ(ఎం) పార్లమెంట్ సభ్యులు జాన్ బ్రిట్టాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. ఇటువంటి చర్య తీసుకోవడం వల్ల తీవ్రమైన చట్టపరమైన, రాజ్యాంగపరమైన, విధానపరమైన ఆందోళనలు తలెత్తుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అటువంటి చట్టపరమైన, రాజ్యాంగపరమైన, విధానపరమైన అంశాలను బ్రిట్టాస్ తన లేఖలో ప్రస్తావించారు. ఓసిఐ కార్డుదారులను ప్రభావితం చేసే ఏ చర్య అయినా కచ్చితంగా చట్టానికి అనుగుణంగా వుండేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సరైన అధికార పరిధి కలిగిన న్యాయస్థానం సముచితమైన న్యాయ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చర్యలు వుండాలని సూచించారు.
”దీనికున్న చట్టపరమైన బలహీనతలే కాకుండా, ఈ చర్య సహజ న్యాయం, సముచితమైన ప్రక్రియ, దామాషా సూత్రాల కింద కూడా ఆందోళనలను లేవనెత్తుతోంది. రిజిస్ట్రేషన్ రద్దుకు ముందుగా న్యాయపరమైన నిర్ధారణ లేకపోతే ఒసిఐ కార్డుదారులు ఏకపక్షంగా లేదా పక్షపాతంతో కూడిన చర్యలకు గురవుతారు. తద్వారా చట్టం ముందు అందరూ సమానమే అంటూ న్యాయానికి రాజ్యాంగపరంగా ఇచ్చిన హామీలు దెబ్బతింటాయి. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్యక్రమం సుదీర్ఘకాలంగా భారతదేశ పారదర్శకతకు, అందరినీ కలుపుకుని పోయే తత్వానికి, నాగరికత కొనసాగింపునకు, మన మృదువైన శక్తిని బలోపేతం చేసేందుకు, విదేశాల్లోని మన వారితో గల భావోద్వేగ బంధాలను మరింత పరిపుష్టం చేసేందుకు ఒక చిహ్నంగా నిలిచివుంది.” అని బ్రిట్టాస్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎవరు దోషులో న్యాయపరమైన నిర్ధారణ జరగకుండా కేవలం చార్జిషీట్ దాఖలు చేశారనే కారణంతోనే ఒసిఐ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం అనేక చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను లెవనెత్తుతుందని సిపిఎం ఎంపి పేర్కొన్నారు. ”కేవలం పోలీసు డాక్యుమెంట్‌గా వుండే చార్జిషీట్‌లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేదా న్యాయపరమైన తుది తీర్పు వుండవు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన-1948 ప్రకారం, శిక్షార్హమైన నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరూ చట్టానికి అనుగుణంగా సాగే బహిరంగ విచారణా ప్రక్రియలో దోషులని తేలేంతవరకు వారు అమాయకులేనని భావించాల్సి వుంటుందనే సూత్రం పొందుపరచబడిందని, అలాగే వారి రక్షణకు అవసరమైన అన్ని హామీలనూ అమలు చేయాల్సి వుంటుంది. ” అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ పార్లమెంట్ అనుమతి లేకుండానే మాతృక చట్టాన్ని సమర్ధవంతంగా సవరిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. ఎందుకంటే, చార్జిషీట్ దాఖలైందంటూ రిజిస్ట్రేషన్ రద్దుకు కొత్త కారణాలను చూపేందుకు చట్టం అధికారాన్ని ఇవ్వలేదన్నారు.
ఓసీఐ కార్డుదారుడు తన తల్లిదండ్రులను, బంధువులను చూసేందుకు తరచుగా భారతదేశాన్ని సందర్శిస్తాడని, ఇక్కడ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటాడని, భారత సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ దేశాభివృద్దికి గణనీయంగా దోహదపడతాడని బ్రిట్టాస్ తన లేఖలో పేర్కొన్నారు. ”భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో అత్యంత అంకిత భావం కలిగిన భాగస్వాములుగా నిరంతరంగా సేవలందిస్తూ వుండే అంతర్జాతీయ ప్రవాస భారతీయుల్లో ఈ నిబంధన తీవ్రమైన ఆందోళన రేకెత్తించింది. ఓసీఐ కార్డుదారులు భారత్‌తో కుటుంబ సంబంధాల పరంగా, సాంస్కృతికంగా, ఆథ్యాత్మికంగా, ఆర్థికపరంగా లోతైన సంబంధాలను కలిగివున్నారు. కేవలం 2024-2025 ఆర్థిక సంవత్సరంలోనే భారత్‌కు వీరి ద్వారా 135.46 బిలియన్ల డాలర్ల చెల్లింపులు అందాయి. గతేడాది కన్నా ఇది 14శాతం ఎక్కువ. ఇది, దేశ జీడీపీలో మూడు శాతానికి మించి వుంది.
తద్వారా అంతర్జాతీయంగా ఇటువంటి చెల్లింపులు అందుకునే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో వుంది. స్వదేశానికి ఇలా పంపే మొత్తాలే కాకుండా, వారి పెట్టుబడులు, దాతృత్వం, సాంకేతిక సహకారం ఇవన్నీ కూడా భారతదేశ ఆర్థిక, సామాజిక కూర్పును అంచనాలకు మించి బలోపేతం చేస్తున్నాయి.” అని ఆ లేఖ పేర్కొంది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) అంటే విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతి ప్రజలకు మంజూరు చేసే శాశ్వత నివాస హోదా. ఓసీఐ కార్డుదారులు పూర్తి స్థాయి భారత పౌరులు కాదు. వారు ఇక్కడ ఓటు వేయలేరు. ప్రభుత్వ పదవులను నిర్వహించలేరు, వ్యవసాయ భూమిని కొనుగోలు చేయలేరు. కానీ వీసా లేకుండా వారు భారత్‌కు ప్రయాణం చేయగలరు. ఎంతకాలం కావాలంటే అంతకాలం వుండొచ్చు, ప్రవాస భారతీయుల మాదిరిగానే చాలా హక్కులు కలిగి వుంటారు. అంటే ఇక్కడ పనిచేయడం, చదువుకోవడం, స్వంతంగా వ్యవసాయేతర ఆస్తులను కలిగివుండడం వంటివి వుంటాయి. భారత్‌కు, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు మధ్య పటిష్ట సంబంధాలు కొనసాగించేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది.