నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్ లకు కలెక్టర్ దగ్గర పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే కార్మికులకు ఇవ్వాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి సందర్బంగా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్ లకు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో మూడు నెలల వేతనాలు విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వం వేతనాలు విడుదల చేసి సుమారు మూడు నెలలు గడుస్తున్న జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇంకా కార్మికులకు వేతనాలు అందలేదన్నారు.
సమయానికి హాజరు శాతం తీసుకోకుండా డిఇఓ కార్యాలయం నుండి నిర్లక్ష్యం జరిగిందని,కొత్త అధికారి బాధ్యతలు తీసుకోవాలని మరికొన్ని రోజులు సి పి ఓ కార్యాలయంలో పెండింగ్ లో ఉంచారని, ఇప్పుడేమో కలెక్టర్ దగ్గర పెండింగ్ అని చెబుతున్నారని అన్నారు. కార్మికుల వేతనాల చెల్లింపులో జిల్లా అధికార యంత్రాంగం మధ్య సమన్వయం కొరవడిందని స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు.ప్రభుత్వం నుండి వేతనాలు విడుదల చేసిన కార్మికులకు అందజేయడంలో జిల్లా అధికార యంత్రాంగం బాధ్యతరాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. ప్రజావాణిలో ఇప్పటికే నాలుగు సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన కార్మికులకు వేతనాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పటికే పాఠశాలల్లో అదనపు పని భారాలను మోస్తూ అనారోగ్యాల పాలవుతున్న స్వీపర్ కార్మికులకు కనీసం వేతనం కూడా సక్రమంగా చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నించారు.
మారుముల గ్రామం వరకు ప్రభుత్వ పాలన ఫలాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్ ఏర్పాటు చేసినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సకాలంలో సమస్యలను పరిష్కారించకపోతే జిల్లా అధికార యంత్రాంగం స్థానికంగా ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.ఇప్పటికైనా కలెక్టర్ గారు స్వీపర్ కార్మికుల బాధలను అర్థం చేసుకొని పెండింగ్లో ఉన్న మూడు నెలలు వేతనాలు కార్మికుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగతా రెండు నెలల వేతనాలు కూడా వెంటనే స్వీపర్ కార్మికులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు రఘు, దరూర్ మండల కన్వీనర్ లక్ష్మన్న, కో కన్వీనర్ ఏసన్న, కార్మికులు లింగన్న, ఆంజనేయులు, ఫాతిమా, బాబన్న, బాబునాయుడు,నరసింహ పాల్గొన్నారు.



