వస్తు, సేవల ఆధారిత పన్ను (జీఎస్టీ) రేట్లలో చేసిన సవరణల గురించి మోడీ ప్రభుత్వం చాలా గొప్పలు పోయింది. ప్రభుత్వం ప్రదర్శించిన దయాగుణం గురించి దాని ప్రచార యంత్రాంగం ఓవర్‌టైం చేసి మరీ తెగ ప్రచారం చేసింది. సామాన్యుడికి చాలా అవసరమయిన సమయంలోనే, అంటే పండుగల సీజన్ లోనే, అతగాడిమీద భారాన్ని మోడీ ప్రభుత్వం తగ్గించి ఏవిధంగా ఊరట కల్పించిందో వివరించే ప్రకటనలను గుప్పించింది. జీఎస్టీ రేట్ల సవరణ వలన 390కి పైగా సరుకులు ఏవిధంగా చౌకగా లభిస్తున్నాయో తెలియజేస్తూ రకరకాల ప్రకటనలను ఢిల్లీ మెట్రోలోని ప్రతీ రైలు బోగీ ప్రదర్శించింది. ఆ ప్రకటనల మీద ప్రధాని మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాల చిత్రాలు ప్రముఖంగా కనిపించాయని వేరే చెప్పనక్కరలేదు. ఇక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దీపావళి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఏవిధంగా కనిపిస్తోందో పదే పదే ప్రకటిస్తూనే వచ్చారు. జీఎస్టీ రేట్ల సవరణ వలన మోటారు వాహనాల ధరలు తగ్గిపోయి ఏయే బ్రాండ్ల కార్ల అమ్మకాలు ఎంతెంత పెరిగాయో వార్తాపత్రికలు కథనాల మీద కథనాలు గుప్పించాయి.
మహా అయితే, ఇదంతా పరిస్థితిని ఒకవైపు నుంచి చూపించే ప్రయత్నం మాత్రమే. దీనికి వున్న రెండో వైపును చాలా జాగ్రత్తగా కనపడనివ్వకుండా చూసుకుంటున్నారు. జీఎస్టీ సవరణల ఫలితంగా ప్రభుత్వానికి తగ్గే పన్ను ఆదాయం గురించి, దాని పర్యవసానాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. కొంతమంది ప్రభుత్వ ఆర్థిక వేత్తలైతే రేట్లు సవరించినందువలన జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో తగ్గుదల పెద్దగా ఉండబోదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేట్లు తగ్గినందువలన సరుకుల అమ్మకాలు పెరుగుతాయని, రేటు తగ్గినందువల్ల తగ్గే ఆదాయం కాస్తా అమ్మకాలు పెరగడం ద్వారా భర్తీ అయిపోతుందని వారు ప్రకటిస్తున్నారు. ఇది సాధ్యం కాదని దిగువ వివరణ స్పష్టం చేస్తుంది. జీఎస్టీ రేట్లు తగ్గించక ముందు ఒకానొక వస్తువు ధర రూ.100 ఉందని, దానిమీద 28 శాతం జీఎస్టీ ఉండేదని అనుకుందాం. జీఎస్టీ రేట్లు 28 నుంచి 18 శాతానికి తగ్గించినందువలన దాని అమ్మకం రేటు రూ.128 నుంచి రూ.118కి తగ్గుతుంది.
అంటే 8 శాతం తగ్గింది. దీనివలన ప్రభుత్వానికి తగ్గిపోయే పన్ను ఆదాయం అమ్మకాలు పెరగడం ద్వారా భర్తీ కావాలంటే ఆ వస్తువు అమ్మకాలు 56 శాతం పెరగాలి. అలా పెరగాలంటే ఆ వస్తువుకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ 56 శాతం పెరగాలి. అంత మేరకు మార్కెట్‌లో డిమాండ్ పెరగడం అనేది అసాధ్యం. అందుచేత ప్రభుత్వ ఆదాయంలో గణనీయంగా తగ్గుదల ఉండబోతుంది అన్నది ఎవరూ నిరాకరించలేని సత్యం. ఒకవేళ పన్ను రేట్లు తగ్గినది ఎక్కువమంది ప్రజలు తరచూ కొనుగోలు చేసే వస్తువుల మీద అయివుంటే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండే అవకాశం ఉండేది. ధరలు తగ్గినట్లు ప్రకటించగానే, ఆ సరుకులను అనేకమంది ఒక్క సారి అదనంగా కొనుగోలు చేస్తారు. అప్పుడు వాటి అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయంలో ”వెంటనే” తగ్గుదల ఉండదు. కాని ఒక్కసారి కొన్నప్పటికీ ఆ వస్తువులను ఉపయోగించడానికి కొంత సమయం పడుతుంది గనుక రేట్లు తగ్గిన వెంటనే జరిగిన స్థాయిలో వాటి అమ్మకాలు ఆ తర్వాత కాలంలో అదే స్థాయిలో కొనసాగవు. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. అయితే ఈ తగ్గుదల వెంటనే కనిపించదు.
ప్రస్తుతం మోటారు వాహనాల అమ్మకాలు పెరిగినందువలన ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గ కుండా యథాతధంగా కొనసాగుతుందన్న వాదన పూర్తిగా తప్పు. ప్రతీయేడూ వాటి అమ్మకాలలో పెరుగుదల రేటు ఇదే స్థాయిలో కొనసాగడం అసాధ్యం. ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గినందువలన కలిగిన లోటును కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవాల్సి వుంటుంది. దీనిగురించి తర్వాత చర్చిద్దాం. ప్రభుత్వానికి ఆదాయంలో కలిగే లోటును భర్తీ చేయడానికి అదనపు వన రులను కేంద్ర ప్రభుత్వం వెతుక్కోవాలి. సంపన్నుల మీద అదనంగా పన్ను విధించవచ్చు. కాని ఈ ప్రభుత్వం ఎంతసేపూ ఆ సంపన్నుల వల్లే ”అభివృద్ధి” సాధ్యం అంటూ వల్లిస్తూ వాళ్లని అన్ని రకాలుగానూ వెనకేసుకు వస్తుంది. అందుచేత ఆ సంపన్నుల మీద అదనపు పన్ను విధించే ఆలోచనే దానికి లేదు. ఇక మిగిలినది శ్రామిక ప్రజలు. వాళ్లమీద అదనపు పన్నుల భారాన్ని మోపడం అంటే అప్పుడు జీఎస్టీ రేట్ల సవరణ ఫలితంగా ప్రజల మీద భారం తగ్గిందని చేసుకుంటున్న ప్రచారం కాస్తా వట్టి బూటకం అని తేలిపోతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రభుత్వం శ్రామిక ప్రజలమీద అదనపు పన్ను భారం మోపే ప్రతిపాదన ఏదీ చేయలేదు.
ఇక ద్రవ్యలోటును పెంచే అవకాశం కూడా లేదు. కేంద్రమే కాదు, రాష్ట్రాలకూ అటువంటి అవకాశం లేదు. నిజానికి కేంద్రం ప్రస్తుతం తన ద్రవ్యలోటును ఇప్పుడున్న స్థాయికన్నా ఇంకా దిగువకు తగ్గించే ప్రయత్నంలో ఉంది. కనుక జీఎస్టీ రేట్ల మార్పుల ఫలితంగా ప్రభుత్వం ఆదాయం తగ్గడం, దాని ఫలితంగా ప్రభుత్వం చేసే వ్యయం తగ్గడం అనివార్యం. ప్రభుత్వ వ్యయంలో తగ్గుదల ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? ప్రజా వైద్య సేవలకు, ప్రభుత్వ విద్యకు చేసే ఖర్చు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రెండు రంగాలలోనూ పెద్ద స్థాయిలో ప్రయి వేటీకరణ జరిగింది. ప్రభుత్వం ఈ రెండు రంగాలమీద చేసే ఖర్చు కూడా తగ్గింది. రాబోయే కాలంలో ఇది మరింత తగ్గుతుంది. అప్పుడు శ్రామిక ప్రజానీకం మరింత ఎక్కువగా ప్రయివేటు విద్య, వైద్యం మీద ఎక్కువ ఖర్చు చేయ వలసిన అగత్యం ఏర్పడుతుంది. దాని ఫలితంగా వారి కొనుగోలుశక్తి బాగా పడిపోతుంది. అంటే జిఎస్‌టి రేట్ల తగ్గింపు చేసి ప్రభుత్వం ప్రజలకు కుడి చేత్తో ఇచ్చినది కాస్తా ఎడం చేత్తో లాగేసుకుంటుందన్నమాట.
అంతటితో అయిపోలేదు. ఇప్పుడు జీఎస్టీ రేట్ల తగ్గింపు వలన ప్రయోజనం లభించేది కేవలం సామాన్యులకు మాత్రమేనా?ఎంతమాత్రం కాదు. సంపన్న వర్గాలకూ ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు మోటారు వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయంటే ఆ ప్రయోజనం సంపన్నులకే వచ్చిందని కనిపిస్తోంది. కాని, అనివార్యంగా తగ్గనున్న ప్రభుత్వ వ్యయం వలన ఎక్కువగా దెబ్బ తినేది మాత్రం శ్రామిక ప్రజలే. వాళ్లకి ప్రస్తుతం కాస్తంతగానైనా విద్యా వైద్య రంగాల్లో లభిస్తున్న ప్రభుత్వ సేవలు ఇంకా తగ్గిపోయి ప్రయివేటు సేవలను కొనుగోలు చేయలేని స్థితిలో పడిపోతారు. ఈ రెండు రంగాలే కాదు. పెన్షన్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు చెల్లించవలసిన కూలీ ఇప్పటికే బకాయి పడుతోంది. ఇకముందు ఇంకా ఎక్కువ బకాయి పడనుంది. అంటే జిఎస్‌టి రేట్లు సవరించినందు వలన శ్రామిక ప్రజానీకానికి ఒరిగిన ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. ఇది సమాజంలో నెలకొన్న ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుంది.
జీఎస్టీ రేట్లను తగ్గించినందువలన కొన్ని సరుకుల రేట్లు వెంటనే తగ్గుతాయి. దానిని ప్రజలకు చూపిం చవచ్చు. తన ఘనతగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యయం తగ్గిపోయి ప్రజల ఇబ్బందులు పెరిగేది దీని ఫలితంగానే అయినా దాని ఫలితంగా తలెత్తే వ్యతిరేకత వెంటనే కనిపించదు. ఒకవైపు సంపద అసమానతలను, పేదరికాన్ని పెంచే దిశగా జీఎస్టీ రేట్లను తగ్గిస్తూనే. దాని వలన నష్టపోయే పేదలకే ఏదో మహోపకారం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అదే మోడీ ప్రభుత్వం చేస్తున్న గారడీ. అయితే, మనం జీఎస్టీ రేట్ల తగ్గింపును తప్పుబట్టాలా? అక్కరలేదు. కాని మనం నొక్కి చెప్పవలసిన విషయం ఇక్కడ ఒకటి ఉంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వలన ప్రభుత్వానికి ఎంత ఆదాయం తగ్గనుందో, అంతే మోతా దులో సంపన్నుల మీద ఏదో విధంగా భారం పెంచి వారి నుంచి అదనంగా వసూలు చేయాలి.
అప్పుడే జిఎస్‌టి తగ్గింపు వలన సామాన్యులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదే. అటువంటి నిర్ణయం చేసే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఏమైనా పన్ను పెంచినా దాన్ని రాష్ట్రాలతో పంచుకునే పరిస్థితే లేదు. అందువలన జీఎస్టీ రేట్ల తగ్గింపు ఫలితంగా రాష్ట్రాల ఆదాయాలు మరింతగా తగ్గిపోతాయి. అంతేగాక విద్య, వైద్యం. పెన్షన్లు వగైరా సేవలకు పడే కోతలను ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంగానే పరిగణిస్తారు. తమ రాష్ట్రాల బడ్జెట్‌ల ద్రవ్యలోటును పెంచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకి లేకుండా చేశారు. దీనంతటి పర్యవసానంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. జీఎస్టీ రేట్ల సవరణ ప్రహసనాన్ని మొత్తంగా పరిశీలిస్తే రేట్లు తగ్గించిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కితే, ఆర్థిక అసమానతలు పెరిగి, సంక్షేమంలో కోత ప్రజలకు మిగులుతుంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



