రూపాయి విలువపై మార్కెట్ శక్తులకే వదిలేయాలి : మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ రికార్డ్ కనిష్టాలను నమోదు చేస్తోంటే.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం పెద్ద ఆందోళన చెందొద్దని అన్నారు. కరెన్సీ హెచ్చు తగ్గులు ఆర్థిక వ్యవస్థ పనితీరును నిర్ణయించలేవని, మార్కెట్ శక్తులకు వదిలివేయాలని చెప్పారు. శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో రూపాయి పతనంపై మంత్రి మాట్లాడారు. ఇటీవల డాలర్‌తో రూపాయి విలువ 91కి చేరువలో నమోదవడంపై ప్రభుత్వం తరుపున మంత్రి తొలిసారి స్పందించారు. రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోకుండా మార్కెట్ శక్తులకు వదిలివేయాలని మంత్రి పేర్కొన్నారు. మారకం రేట్లు చాలా సున్నితమైనవని తెలిపారు. కరెన్సీ కదలికలను అతిగా రాజకీయం చేయడం లేదా అతిగా నిర్వహించడం చేయకూడదని చెప్పుకొచ్చారు. విమర్శకులు రూపాయి క్షీణతపై కాకుండా ప్రస్తుత భారత వృద్ధి రేటుపై దృష్టి పెట్టాలన్నారు.
రూపాయి విలువ తగ్గినప్పుడు ఎగుమతిదారులు ప్రయోజనం పొందుతారన్నారు. దీంతో భారత వస్తువుల ఎగుమతికి మద్దతు లభిస్తుందన్నారు. భారత ఎగుమతి వస్తువులు ఎవరికి చౌకగా మారుతున్నాయో మంత్రి వివరిస్తే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కుటుంబాల్లో పొదుపు తగ్గుతోందన్న ఆందోళనలను మంత్రి తప్పుబట్టారు. పొదుపు, పెట్టుబడులు పెరుగుతున్నా యంటూ సమర్థించుకున్నారు. పైగా ఆస్తులు పెరుగుతున్నాయని తెలిపారు. రూపాయి విలువ పతనమై, ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడు సతమతమవుతుండగా కేంద్ర మంత్రి అడ్డగోలుగా సమర్థించడం సరికాదని పలువురు ఆర్థిక విశ్లేషకులు విమర్శిస్తున్నారు.



