గ్రామీణ ఉపాధి కొత్త బిల్లుపై విమర్శలు
కేంద్రంపై ప్రతిపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్షాలు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ‘జాతిపిత’ మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఎందుకని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లు, 2025 (వీబీ- జీ ఆర్‌ఏఎం జీ బిల్లు, 2025)ను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని చూస్తున్నది. ఇందులో భాగంగా బిల్లును లోక్‌సభలో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్‌లో చేర్చారు. ఈ బిల్లు ద్వారా 2005లో అమలులోకి వచ్చిన ఎంజీఎన్ ఆర్‌ఈజీఏను రద్దు చేసి.. ‘వికసిత్ భారత్-2047’కి అనుగుణంగా కొత్త గ్రామీణ అభివృద్ధి రూపకల్పనను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రతిపక్షాల విమర్శలు
కేంద్రం తీసుకొచ్చే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా పేరు మార్పును వ్యతిరేకిస్తున్నాయి. గాంధీ పేరును తీసివేయడాన్ని తప్పుబడుతున్నాయి. పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. పార్లమెంటు కాంప్లెక్స్ హౌజ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. పథకం పేరు మార్పుతో కార్యాలయాలు, స్టేషనరీ మొదలైన వాటిపై అనవసర ఖర్చు పెరుగుతుందనీ, దాని వల్ల ప్రజలకు ఏం లాభమనీ అన్నారు. మహాత్మా గాంధీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పెద్ద నాయకుడిగా పరిగణిస్తారు. మహాత్మాగాంధీ పేరు తొలగించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనీ కేంద్రాన్ని నిలదీశారు. పార్లమెంటరీ గ్రామీణ అభివృద్ధి మరియు పంజాయతీరాజ్ స్టాండింగ్ కమిటీ చైర్మెన్, కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలకా కేంద్రం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు. పని దినాలను 150కి పెంచడం, వేతనాలను పెంచడం వంటి అనేక సిఫారసులను చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బాపూ పేరుతో వారికి వచ్చిన సమస్య ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకం కాబట్టి దానిని అంతం చేయాలని వారు (కేంద్రం) చూస్తున్నారు. వారు బిల్లును తీసుకొచ్చారు, కానీ మహాత్మాగాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చర్య మహాత్మా గాంధీకి అవమానకరమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ సభ్యులు డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. వీరే.. గాంధీని హత్య చేసిన గాడ్సేను పూజిస్తారని తెలిపారు. వారు మహాత్మాగాంధీని అవమానపర్చి, చరిత్ర నుంచి ఆయనను తొలగించాలనుకుంటున్నారు అని చెప్పారు.



