Sunday, December 21, 2025
E-PAPER
Homeసోపతిఅలుపెరుగని పరిశోధకుడు నశీర్‌ అహమ్మద్‌

అలుపెరుగని పరిశోధకుడు నశీర్‌ అహమ్మద్‌

- Advertisement -

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌… మన చరిత్రను నేటి యువతకు అందించాలని తపిస్తున్న వ్యక్తి. దేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింల విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. చరిత్ర మరిచిన ఎందరో త్యాగమూర్తులను నేటి తరానికి అందిస్తున్నారు. తన కర్తవ్య దీక్షలో భాగంగా 70 ఏండ్ల వయసులోనూ అలుపూ సొలుపూ లేక దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రచనా ప్రయాణంలో ఐదు దశాబ్దాలు, చరిత్ర అధ్యయన కారుడిగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న ఆయన పరిచయం…

నశీర్‌ అహమ్మద్‌ నెల్లూరు జిల్లా, అల్లూరు తాలూకా, పురిణి గ్రామంలో 1955 డిసెంబరు 22న జన్మించారు. తల్లిదండ్రులు షేక్‌ బీబీ జాన్‌, సయ్యద్‌ మీరా మొహిద్దీన్‌. వీరిది వ్యవసాయ కుటుంబం. ఎం.కామ్‌., ఎల్‌.ఎల్‌.బి., సాహిత్యరత్న (హిందీ)., డిప్లొమా ఇన్‌ జర్నలిజం చేశారు. ప్రస్తుతం తాడేపల్లి మండలం, గుంటూరులో ఉంటున్నారు.



రచనా రంగంలో…
నశీర్‌ అహమ్మద్‌కు చిన్నతనం నుండి రచనలు చేయడమంటే చాలా ఇష్టం. అయితే 1975లో ‘మరో ప్రపంచం’ లిఖిత మాసపత్రికలో తొలిసారిగా ఆయన కవితలు ప్రచురితమైంది. అప్పటి నుండి అనేక పత్రికల్లో ఆయన కవితలు, కథానికలు, కార్టూన్లు చోటు సంపాదించాయి. అంతేకాకుండా గేయాలు, కథలు, రాజకీయ, సామాజిక, సాహిత్య, చరిత్ర, సమీక్షా వ్యాసాలు, పలు వ్యంగ్య చిత్రాలు ప్రచురితమయ్యాయి. మిత్రుడు వేదాంతం సీతారామావధానితో కలసి ‘మరో ప్రపంచం’, ‘భేరి’ లిఖిత మాసపత్రికలు వెలువరించారు. రాష్ట్రంలోని పలు సాంస్కృతిక, సాహిత్య,సేవాసంస్థలలో సభ్యునిగా రచన, ప్రచురణకు సంబంధించిన బాధ్యతలను నిర్వహించారు. పలు ప్రజా సంఘాలు, సంస్థలు నిర్వహించి పలు పత్రికలకు సంపాదకునిగా సేవలందించారు. 2006 నుండి 2011 వరకు ‘ఇండియా’ అనే మాసపత్రికను స్వయంగా ప్రచురించి పాఠకులకు ఉచితంగా అందించారు.

చరిత్ర తవ్వకాలు
భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చరిత్ర తవ్వకాలు మొదలుపెట్టారు. వారి త్యాగాలను వివరిస్తూ 1999లో పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాల రచన, ప్రచురణను ఆరంభించారు. అప్పటి నుండి భారత స్వాతంత్య్రోద్యమం -ముస్లింలు, భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లిం మహిళలు, భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు, మ్కెసూరు పులి : టిపూసుల్తాన్‌, భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాటాలు, షహీద్‌-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌, భారత స్వాతంత్య్ర సంగ్రామం: ముస్లిం యోధులు-1, చిరస్మరణీయులు, 1857: ముస్లింలు, అక్షరశిల్పులు, చరితార్థులు (తెలుగు)/ ది ఇమ్మోర్టల్స్‌ (ఆంగ్లం), కువైట్‌ కబుర్లు, బిస్మిల్‌- అష్ఫాఖ్‌, పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌: అష్ఫాఖుల్లా ఖాన్‌, కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా, అజాద్‌ హింద్‌ ఫౌజ్‌: ముస్లిం పోరాట యోధులు, గాంధీజీ ప్రాణరక్షకుడు – బతఖ్‌ మియా అన్సారీ, చరితార్థులు -2 (తెలుగు)/ ది ఇమ్మోర్టల్స్‌-2 (ఆంగ్లం), మహాత్మాగాంధీ : ముస్లిం సహచరులు – అనుచరులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత స్వాతంత్య్ర సమరయోధులు, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్‌, ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం: హిందూ-ముస్లిం ఐక్యత, అండమాను జైలు: ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులు, భారత స్వాతంత్య్రోద్యమం : తెలంగాణ ముస్లిం యోధులు, భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్ర ముస్లిం యోధులు తదితర చరిత్ర గ్రంథాలను రచించి వెలువరించారు.

వివిధ భాషల్లో…
ఈ గ్రంథాలలో కొన్ని ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, గుజరాతి భాషల్లోకి అనువాదమయ్యాయి. భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని ఎంపిక చేసిన గ్రంథాలయాలకు, సాహితీ సంస్థలకు, ప్రచార వ్యవస్థలకు, ప్రచార వ్యవస్థల గ్రంథాలయాలకు, వ్యక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ‘భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు’ శీర్షికతో ఆయన రాసిన సుదీర్ఘ ఆంగ్ల వ్యాసం అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింల పాత్ర’ వ్యాససంపుటిలో చోటుచేసుకుంది. నశీర్‌ గ్రంథాలను పలు ప్రాంతాల, భాషల దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక పత్రికలు ధారావాహికంగా ప్రచురించాయి, ప్రచురిస్తున్నాయి. తెలుగు-ఆంగ్ల భాషల్లో 2014లో ‘చరితార్థులు’ పేరిట 155 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో వెలువడిన ఆల్బం జాతీయంగా, అంతర్జాతీయంగా విశేష ఆదరణ పొంది 2019లో తమిళభాషలో వెలువడింది. త్వరలో ఉర్దూ, మళయాలం, హిందీ, గుజరాతి, మరాఠీ భాషల్లో కూడా వెలువడనుంది. ప్రస్తుతం భారత విభజనను వ్యతిరేకించిన ముస్లింలు, భారత స్వాతంత్య్ర సంగ్రామం: ఉలేమాల భాగస్వామ్యం, భారత స్వాతంత్య్ర సంగ్రామం: ముస్లిం అమరవీరులు, చరితార్థులు -3 , చరిత్ర సృష్టించిన ముస్లిం మహిళలు తదితర గ్రంథాల రూపకల్పనలో నిమగమైయున్నారు.

పాఠకులకు ఉచితంగా
ఆయన గ్రంథాలను పిడియఫ్‌ ఫైల్స్‌ రూపంలో అసంఖ్యాక పాఠకుల అభ్యర్థనల మేరకు మెయిల్‌, వాట్సప్‌, టెలిగ్రాం యాప్‌ల ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. అంతర్జాలంలో రెండు ప్రత్యేక వెబ్‌సైట్లు ఏర్పాటు చేయించి పుస్తకాలను ఆసక్తిగల పాఠకులు ఉచితంగా/సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించారు. వీటి ద్వారా సుమారు 60 వేల మందికి పైగా పాఠకులు పుస్తకాల ‘పిడియఫ్‌ ఫైల్స్‌’ పొందారు. అంతర్జాలం ద్వారా పాఠకులకు పుస్తకాలు అందిస్తున్న ‘మనసు ఫౌండేషన్‌’ (కనియంపాడు, నెల్లూరు జిల్లా) సంస్థకు, ‘అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం’ (గుంటూరు), ‘సారస్వత నికేతనం’ (వేటపాలెం) గ్రంథాలయాలకు ఆయన తన పుస్తకాల ‘పిడియఫ్‌ ఫైల్స్‌’ పంపించి ఆయా సంస్థల ద్వారా ఆసక్తి చూపిన పాఠకులకు అందజేస్తున్నారు.



చిత్రపఠాల ద్వారా…
నశీర్‌ కేవలం గ్రంథాల రూపంలోనే కాకుండా మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొని అసమాన త్యాగాలు, సాహసాలకు పేరుగాంచిన భారత ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల సమాచారాన్ని ప్రజలందరికీ అందజేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అందుకే వివిధ సంస్థల, వ్యక్తుల ఆహ్వానం మేరకు వేలాది సభలు, సమావేశాలలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ చారిత్రక సమాచారాన్ని ప్రధానంగా యువత, విద్యార్థుల ఎరుకలోకి తెచ్చేందుకు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను వ్యయప్రయాసలకొర్చి తయారు చేయించారు. ఆ చిత్రాలతో తన స్వీయ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా ఇప్పటికి 57 రాష్ట్రాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

నేమ్‌ స్టిక్కర్స్‌
స్వాతంత్య్ర సమరయోధుల వర్ణ చిత్రాలు, వారి సంక్షిప్త వివరాలతో ‘నేమ్‌ స్టిక్కర్లు’ రూపొందించారు. వీటిని పాఠశాల విద్యార్థులు తమ పుస్తకాల్లో అంటించుకునేలా పిల్లలకు కానుకగా అందిస్తున్నారు. ఈ నేమ్‌స్టిక్కర్ల ముద్రణకు సహకరించిన దాతల సహకారంతో కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా వీటిని అందజేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షల నేమ్‌స్టిక్కర్లను ముద్రించి వేలాది విద్యార్ధులకు పంపిణి చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అలాగే విజిటింగ్‌ కార్డు సైజులో ప్రత్యేక కార్డుబోర్డుల మీద స్వాతంత్య్ర సమర యోధుల చిత్రాలు, ఆ యోధుల విశిష్టతలను క్లుప్తంగా ముద్రిస్తున్నారు. దీనికి ఆర్ధిక చేయూత ఇచ్చిన వదాన్యుల చిరుకానుకగా ప్రజానీకంలో పంపిణీ చేస్తున్నారు. వీటిని స్వయంగా పంచడంతో పాటు దేశ వ్యాప్తంగా పలు సాహిత్య, సామాజిక సేవా సంస్థలు, ఆయా సంస్థల కార్యకర్తల ద్వారా కూడా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 50,000 కార్డులను పంపిణి చేయించారు.

దాతల సహకారంతో…
స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో ప్రత్యేక క్యాలెండర్లు ప్రతి ఏటా రూపొందించి పంపిణీ చేస్తున్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోని పలు చారిత్రక ఘట్టాలను, స్వాతంత్య్ర సమరయోధుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా వారి విశిష్టతలను ప్రజలకు పరిచయం చేయాలన్న సంకల్పంతో సేవా, సాంస్కృతిక, సాహిత్య సంస్థలు, వ్యక్తుల ఆర్ధిక చేయూతతో కరపత్రాలు, చిరు పొత్తాలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

ఖ్యాతి గడించారు
ఈ విధంగా గత పాతికేండ్లుగా రచన, ప్రచురణ, పంపిణీ, ప్రచార కార్యక్రమాలను నశీర్‌ అహమ్మద్‌ అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా భారత స్వాతంత్య్రోద్యంలో ముస్లింల పాత్రను వివరిస్తూ పరిశోధనాత్మక చరిత్ర పుస్తకాలను రచించి వెలువరిస్తున్నారు. అంతే కాకుండా ఆయా గ్రంథాలలోని సమాచారాన్ని సామాన్య ప్రజల చెంతకు చేర్చడంతో నిరంతరం కృషి సల్పుతున్నారు. డెబ్భై ఏండ్ల వయసులోనూ కేవలం రచనలకే పరిమితం కాకుండా ఓ కార్యకర్తగా, నాయకుడిగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక భారతీయుడిగా ఖ్యాతి గడించారు.

– సలీమ
94900 99083

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -