నవతెలంగాణ-హైదరాబాద్: డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ …. సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం కార్యకర్తలు, నేతలు ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఆటోలు , గూడ్స్ వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఆటో, హమాలీ ఇతర కార్మికులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. పాలకుల వైఫల్యాన్ని నిరసిస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ …. గత మూడు రోజుల నుండి డీజిల్, పెట్రోల్ కొరతతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా పాలకులలో స్పందన కరువైందన్నారు. కొరత లేదని బుకాయిస్తూ, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి సైతం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ బాధ్యతను మాత్రం విస్మరిస్తున్నారని ఆరోపించారు. అధికారులే కాదు, ఆయిల్ కొరత తీవ్రంగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది ? అని ప్రశ్నించారు. కేంద్రం, మోడీ.. అమెరికాకు, ట్రంప్ కు లొంగిపోయారని మండిపడ్డారు. రష్యా, ఇతర దేశాల నుండి చౌకగా ఆయిల్ కొనుగోలుకు అవకాశాలున్నా.. ట్రంప్ ఆదేశాలకు లొంగి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని దుయ్యబట్టారు. దేశంలో డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ సమస్య తీవ్రంగా ఉన్నా, మోడీ పార్లమెంటు సభ్యుల పెంపు, రాష్ట్రాల మధ్య అసమానతలు సృష్టించే డీలిమిటేషన్ పైన, ప్రతిపక్షాలపై నిందలు మోపటం పైన దృష్టి పెట్టారు తప్ప, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతూ కేంద్ర పాలకులు… ఆయిల్, గ్యాస్ సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రిలయన్స్ తదితర ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు డీజిల్ పెట్రోల్ సరఫరా నిలిపివేసినా, కేంద్రం చోద్యం చూస్తోంది తప్ప, చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
నష్టాల పేరుతో ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించాయని, కొరతను సృష్టిస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఆయిల్ రేట్లు పెంచడానికి కేంద్రం, ఆయిల్ కంపెనీలు కుట్ర పన్నాయని, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి టిడిపి, జనసేన రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించాయన్నారు. ఇతర రాష్ట్రాలు కంటే అధికంగా ఏపీలో ఆయిల్ సంక్షోభం నెలకొన్నదని, మంత్రులు, సింగపూర్ పర్యటనలో, ముఖ్యమంత్రి బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయిల్ కొరత లేదని పాలకులు, అధికారులు బకాయిస్తూ.. కొరతను నివారించటంపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. మూసివేసిన బంకులు, బంకులు వద్ద బారులు తీరిన వాహనాలు పాలకులకు కనపడటం లేదా ? అని అడిగారు. రైతులు డీజిల్ కోసం ఎదురుచూస్తూ పంటలు దెబ్బతింటున్నా, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదన్నారు. బంకులు వద్ద పోలీస్ పహారా పెట్టవలసిన స్థితి ఏర్పడిందన్నారు. రవాణా వ్యవస్థ స్తంభిస్తున్నదని, ఆయిల్ లేక ఆటో కార్మికులు, మరోవైపు హమాలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సాధారణ రాకపోకులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, బంకుల వద్ద గంటలు తరబడి వేచి ఉండి వేసవికాలంలో సాధారణ జనం తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు.
మోడీకి భజన చేయడంలో నిమగ్నమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో దృష్టి లోపించిందని ధ్వజమెత్తారు. ఇప్పటికీ గ్యాస్ కొరత తీరలేదు, బ్లాక్ లో 3 వేలు, 4 వేలకు సిలిండర్ అమ్ముతున్నారు, అనేక మంది చిరు వ్యాపారులు దెబ్బ తిన్నారు, హోటల్లు మూతపడ్డాయి, ఉపాధి దెబ్బ తిన్నదన్నారు. దీనికి డీజిల్ పెట్రోల్ కొరత తోడైంది, అటు పట్టణాలు, ఇటు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో ప్రభుత్వము, యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని నిప్పులుచెరిగారు. హెచ్చరికలు, ప్రకటనలు, సమీక్షలకే పాలకులు పరిమితమయ్యారని విమర్శించారు. చిన్న పని జరిగినా తమ గొప్పగా చెప్పుకునే పాలకులు, రాష్ట్రములో ఏర్పడిన ఈ కష్టాలకు బాధ్యత వహించకుండా తప్పించుకోవడం సిగ్గుచేటన్నారు. మరోవైపు పరిశ్రమలకు బల్క్ డీజిల్ రేటు పెంచడంతో బంకులపై ఒత్తిడి పెరిగిందన్నారు. ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు మూత బడటంతో సమస్య మరింత తీవ్రమైందని, అయినా ప్రభుత్వం పరిస్థితులు చక్కదిద్దటంలో విఫలం అయిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా పూర్తిస్థాయిలో జరుగుతోందని, 24 గంటలు అమ్మకాలు సాగుతున్నాయని కానీ ప్రజలకు నిత్యవసరంగా మారిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ మాత్రం లభించడం లేదు అని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి, అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా అవకాశం ఉన్న అన్ని దేశాల నుండి ఆయిల్ దిగుమతులు చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో కొరత లేకుండా… కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆయిల్, వంటగ్యాస్ తీసుకురావాలన్నారు. బ్లాక్ మార్కెట్ అరికట్టాలి, రవాణా వాహనాలతో పాటు, రైతులకు అవసరమైన ఆయిల్ సక్రమంగా అందించాలి, కార్మికుల ఉపాధిని కాపాడాలి, వ్యవసాయాన్ని రక్షించాలని కోరారు. ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం, పాలకులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెంచే కుట్రలు ఆపండి, సక్రమంగా సరఫరా చేయండి అని నినదించారు. నేడు జరిగిన ఈ నిరసన ధర్నాలో సిపిఎం నేతలు బి. రమణ రావు ,బోయి సత్యబాబు, కే దుర్గారావు, ఈవీ నారాయణ, టీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



