Saturday, June 27, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌కు షాక్‌

చాంపియన్‌కు షాక్‌

- Advertisement -

ఐర్లాండ్‌ చేతిలో భంగపాటు
34 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి

బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌ టీమ్‌ ఇండియాపై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాట్‌తో అంచనాలకు మించి రాణించిన ఆతిథ్య ఐర్లాండ్‌… బంతితో భారత్‌ను బోల్తా కొట్టించింది. ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. లోర్కాన్‌ టక్కర్‌ (50) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తొలుత ఐర్లాండ్‌ను నిలబెట్టాడు. గెరాత్‌ డెలానీ (49) సైతం జతకలవటంతో ఐర్లాండ్‌ 182/9 పరుగులు చేసింది. ఛేదనలో శాంసన్‌ త్వరగా వికెట్‌ కోల్పోగా హోలార్డ్‌ మిడిల్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లను అవుట్ చేసి మ్యాచ్‌ను ఐర్లాండ్‌ చేతుల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ్నుంచి టీమ్ ఇండియా కోలుకోలేదు. 18.5 ఓవర్లలోనే 148 పరుగులకు ఆలౌటైంది. తొలి టీ20లో 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

నవతెలంగాణ-బెల్‌ఫాస్ట్‌
కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ వైఫల్యం కొనసాగుతుంది. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందంజలో నిలిచినా.. లీగ్‌ దశలోనే నిష్క్రమించగా.. తాజాగా టీ20 ఫార్మాట్‌ ప్రపంచ చాంపియన్‌ టీమ్‌ ఇండియా అయ్యర్‌ సారథ్యంలో తొలి మ్యాచ్‌లో భంగపాటుకు గురైంది. పసికూన ఐర్లాండ్‌ అగ్రజట్టు భారత్‌ను 34 పరుగుల తేడాతో ఓడించగా… కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ శకం ఓటమితో మొదలైంది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటంలో భారత్‌ దారుణంగా విఫలమైంది. 18.5 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (49, 20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ మోత మోగించినా.. మరో ఎండ్‌లో సంజు శాంసన్‌ (5), ఇషాన్‌ కిషన్‌ (1), శ్రేయస్‌ అయ్యర్‌ (3), వాషింగ్టన్‌ సుందర్‌ (9) బ్యాట్లేత్తేశారు. దీంతో భారత్‌ మరో ఏడు బంతులు ఉండగానే కుప్పకూలింది. ఐర్లాండ్‌ బౌలర్లు మాథ్యూ (3/38), మాట్‌ హోలార్డ్‌ (3/28), జై మూండ్ర (2/25) భారత్‌ పతనాన్ని శాసించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ (50, 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించగా, గరెత్‌ డెలానీ (49, 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. భారత బౌలర్లలో హర్షిత్‌ రానా (3/24), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/28), అక్షర్‌ పటేల్‌ (2/33) రాణించారు. ఐర్లాండ్‌ ప్లేయర్‌ మాట్‌ హోలార్డ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. భారత్‌, ఐర్లాండ్‌ రెండో, ఆఖరు టీ20 బెల్‌ఫాస్ట్‌లోనే ఆదివారం జరుగనుంది.


అభిషేక్‌ మెరిసినా..!
భారత్‌ లక్ష్యం 183 పరుగులు. ప్రత్యర్థి ఐర్లాండ్‌. విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ ఐర్లాండ్‌ బౌలర్‌ మూండ్ర ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే భారత్‌కు షాక్‌ ఇచ్చాడు. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (5)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మరో బౌలర్‌ మాట్‌ హోలార్డ్‌.. వరుస ఓవర్లలో ఇషాన్‌ కిషన్‌ (1), శ్రేయస్‌ అయ్యర్‌ (3)ను సాగనంపాడు. దీంతో 5.1 ఓవర్లలో 60/3తో భారత్‌ ఒత్తిడిలో కూరుకుంది. మరో ఎండ్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (49) తనదైన జోరు చూపించాడు. రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో దండెత్తాడు. 20 బంతుల్లోనే 49 పరుగులు పిండుకున్న అభిషేక్‌ ఐర్లాండ్‌ బౌలర్లను ఆడుకున్నాడు. కానీ అతడికి మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. తిలక్‌ వర్మ (19, 21 బంతుల్లో 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేలా కనిపించాడు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన తిలక్‌ కాసేపు వికెట్ల పతనం అడ్డుకున్నాడు. కానీ స్వల్ప విరామంలో అభిషేక్‌, తిలక్‌ డగౌట్‌కు చేరటంతో భారత్‌ ఓటమి కూరల్లో చిక్కుకుంది. వాషింగ్టన్‌ సుందర్‌ (9) నిరాశపరిచాడు. శివం దూబె (25, 14 బంతల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మెరుపులు ఎక్కువ సేపు కొనసాగలేదు. అక్షర్‌ పటేల్‌ (15), హర్షిత్‌ రానా (8), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2) పెవిలియన్‌కు చేరుకునేందుకు పోటీపడ్డారు. 18.5 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోయిన భారత్‌ 148 పరుగులే చేసింది. 34 పరుగుల తేడాతో తొలి టీ20లో దారుణ పరాజయం చవిచూసింది. ఐర్లాండ్‌ బౌలర్లు మాథ్యూ (3/38), హోలార్డ్‌ (3/28), మూండ్ర (2/25) రాణించారు.

టక్కర్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌
బెల్‌ఫాస్ట్‌లోని సివిల్‌ సర్వీసెస్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వరల్డ్‌ చాంపియన్‌పై బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు టిమ్‌ టెక్టర్‌ (17, 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), రాస్‌ అడైర్‌ (12, 7 బంతుల్లో 2 ఫోర్లు) ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నంచినా.. ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. పేసర్‌ హర్షిత్‌ రానా ఓపెనర్లు ఇద్దరినీ సాగనంపాడు. హ్యరీ టెక్టర్‌ (0)ను అర్ష్‌దీప్‌ డకౌట్‌గా సాగనంపాడు. దీంతో 3.4 ఓవర్లలో 30/3తో ఐర్లాండ్‌ కష్టాల్లో పడింది. బెన్‌ కాలిట్జ్‌ (15) కాసేపు అలరించినా.. వికెట్‌ నిలుపుకోలేదు. ఈ సమయంలో కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ (50), గరేత్‌ డెలానీ (49) ఆతిథ్య జట్టును నిలబెట్టారు. ఐదో వికెట్‌కు 44 బంతుల్లో 64 పరుగులు జోడించారు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో టక్కర్‌ 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. టక్కర్‌ నిష్క్రమించినా.. జార్జ్‌ డాక్‌రెల్‌ (19, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి డెలానీ జోరు కొనసాగించాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 17 బంతుల్లోనే 49 పరుగులు పిండుకున్నారు. దీంతో ఐర్లాండ్‌ మంచి స్కోరు నమోదు చేసింది. అర్థ సెంచరీ ముంగిట డెలానీ అవుటైనా.. ఐర్లాండ్‌ మంచి స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో హర్షిత్‌ రానా, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ రాణించినా.. ఐర్లాండ్‌ అప్పటికే మంచి స్కోరు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -