Saturday, June 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం28 నుంచి నితిన్‌ నబీన్‌ రాష్ర్ట పర్యటన

28 నుంచి నితిన్‌ నబీన్‌ రాష్ర్ట పర్యటన

- Advertisement -

అధికారంలోకి రావడమే లక్ష్యం : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష‍ులు 
ఎన్‌ రామచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మూడు రోజులు రాష్ర్టంలో పర్యటిస్తారని ఆపార్టీ రాష్ర్ట అధ్యక్ష‍ులు ఎన్‌ ‌రామచందర్‌‌రావు తెలిపారు. శుక్రవారంనాడిక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనరల్ సెక్రెటరీ వీరేందర్ గౌడ్, కోశాధికారి దేవకి వాసుదేవరావు, రాష్ట్ర మీడియా ఇంచార్జ్ అండ్‌ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్‌ తాడూరి శ్రీనివాస్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. నితిన్‌ ‌నబీన్‌ ఈనెల 28న శంషాబాద్ చేరుకుని, అక్కడి రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్రంలోని పది జిల్లాల పార్టీ నూతన కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమావేశంలో పాల్గొని, ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అవుతారని వివరించారు.

29వ తేదీ ఉదయం విజ్ఞాన భారతి ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ (వీబీఐటీ) ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారనీ, ఆ తర్వాత వరంగల్ వెళ్లే మార్గంలో భువనగిరిలో ఘనస్వాగతం అందుకుని, వరంగల్‌లో లంబాడ, కోయ, చెంచు, గోండు వంటి వివిధ ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. 30వ తేదీ ఘట్‌కేసర్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ (స్టేట్ వర్కింగ్ కమిటీ) మరియు ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసి,మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తారని వివరించారు. ఈ పర్యటన పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఉద్దేశించినదే తప్ప ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

స్వాగతిస్తున్నాం
తుంగభద్ర నది గేట్లకు మరమ్మతులు చేయాలనే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాంచందర్‌‌రావు తెలిపారు. అయితే నీటి వాటాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ప్రతిపాదించిన నవేలి రిజర్వాయర్ (35 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవల ప్రాజెక్ట్ (20 టీఎంసీలు) వల్ల తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటా దెబ్బతిని కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఏం మాట్లాడారో, రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి హామీలు తెచ్చారో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు.

ఎన్‌ఆర్‌‌సీపై ఓట్‌‌బ్యాంక్‌ ‌రాజకీయాలు
జీతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. 2013 బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని, 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారతీయుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఓటరు నమోదు ప్రక్రియలో ఆధారాల కోసం నిర్దేశించిన 12 రకాల పత్రాలలో పాస్‌పోర్ట్ కూడా ఒకటి మాత్రమేనని స్పష్టం చేశారు. ఒవైసీ ప్రజలను తప్పుదారి పట్టింస్తూ, ప్రజల్లో అనవసర భయభ్రాంతులు సృష్టించవద్దని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -