నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డీఏ) విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నీట్-ఎస్‌ఎస్ 2026 కౌన్సెలింగ్‌ను తక్షణమే పూర్తి చేయాలని హైదరాబాద్ నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డీఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇది దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్యులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని తెలిపారు. నీట్-ఎస్‌ఎస్ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ మార్చిలో ప్రారంభమైనప్పటికీ, పలుమార్లు వాయిదా పడుతూ ఇప్పటికీ పూర్తి కాకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సూపర్ స్పెషాలిటీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వైద్యులు తీవ్ర మానసిక, ఆర్థిక, వృత్తిపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే సీట్లు పొందిన అభ్యర్థులు కూడా అప్‌గ్రేడేషన్ వస్తుందో లేదో అనే అనిశ్చితిలో ఉండటంతో వారు ప్రస్తుత కాలేజీలో కొనసాగాలా..? కొత్త కాలేజీకి వెళ్లాలా..? అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉండటం, తరచూ ప్రయాణాలు చేయడం, వసతి ఖర్చులు భరించడం, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోలేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఇది వైద్యుల వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, సూపర్ స్పెషాలిటీ సీట్లు ఖాళీగా ఉండటం వల్ల బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై కూడా ప్రభావం పడుతోందని వివరించారు.కౌన్సెలింగ్ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగాలని తాము కోరుతున్నామన్నారు. అయితే, కౌన్సెలింగ్ ప్రక్రియను అనవసర జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని మాత్రమే విజ్ఞప్తి చేశారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), కేంద్ర ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకుని మిగిలిన కౌన్సెలింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. వేలాది మంది యువ వైద్యుల భవిష్యత్‌ను, వారి కుటుంబాల సంక్షేమాన్ని, దేశ ఆరోగ్య వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తక్షణమే నీట్-ఎస్‌ఎస్ 2026 కౌన్సెలింగ్ పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



