ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిత్యం రగిలించిన అసామాన్య ప్రజాకవి గద్దర్ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ వర్ధంతి (ఆగస్టు 6) సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించినప్పటికీ, ఉన్నత ఉద్యోగాల కోసం కాకుండా సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ప్రతి మనిషికి కూడు, గూడు, నీడ దక్కాలనే మహోన్నత లక్ష్యంతో జీవితాంతం పాటనే ఆయుధంగా మార్చుకుని ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రముఖుల్లో గద్దర్ అగ్రస్థానంలో నిలిచారని కొనియాడారు. పలు ఉద్యమ వేదికలను నిర్మిస్తూ తెలంగాణ ఆకాంక్షను గ్రామాగ్రామానికీ తీసుకెళ్లారనీ, ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. తన గళాన్ని గర్జనగా, పాటను తూటాగా మార్చి ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రజా కవి గద్దర్ అని అభివర్ణించారు. గద్దర్ అందించిన సాంస్కృతిక, సాహిత్య సేవలకు గౌరవ సూచకంగా ఆయన పేరుతో తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఏర్పాటు చేసి, సినీ కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. గద్దర్ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు చేరేలా తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గద్దర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



