లక్నో : యూపీలోని అయోధ్యలో రామమందిరం పేరుతో పారదర్శకత, భక్తి, జాతీయ గర్వాన్ని ప్రస్తావించిన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు ఇప్పుడు అదే ఆలయ ట్రస్ట్ చుట్టూ వస్తున్న అవినీతి ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. భూముల కొనుగోళ్ల నుంచి భక్తుల విరాళాల లెక్కల వరకు వరుస వివాదాల్లో ఆర్‌ఎస్‌ఎస్ నేత, ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా పేరు వినిపిస్తోంది. అయితే ఆయనకు సంఘ్ అండదండలు ఉన్నాయనీ, ఈ వివాదం నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ట్రస్ట్ చుట్టూ వివాదాలు తగ్గడం లేదు. భూముల కొనుగోలు అక్రమాల ఆరోపణలు ఇంకా పూర్తిగా చల్లారకముందే, ఇప్పుడు భక్తులు సమర్పించిన నగదు, బంగారు ఆభరణాల దుర్వినియోగం ఆరోపణలు మరోసారి ఆలయ ట్రస్ట్‌ను వివాదంలోకి నెట్టాయి. ఈ రెండు వివాదాల్లోనూ పదేపదే వినిపిస్తున్న పేరు ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ అనిల్ కుమార్ మిశ్రా. ప్రస్తుతం యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రామమందిరంలో భక్తుల విరాళాల దుర్వినియోగంపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు అనిల్ మిశ్రాను కూడా గంటల తరబడి ప్రశ్నించింది. అయితే విచారణ జరిగినప్పటికీ గురువారం (25న) నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
విరాళాల లెక్కలన్నీ ఆయన చేతుల్లోనే
ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ప్రకారం.. రామమందిరంలో భక్తులు సమర్పించే నగదు విరాళాల స్వీకరణ, లెక్కింపు, భద్రపరిచే ప్రక్రియ మొత్తం అనిల్ మిశ్రా పర్యవేక్షణలో సాగుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు నగదు వస్తుండగా, ప్రత్యేక సందర్భాల్లో అది రూ.50 నుంచి రూ.60 లక్షలకు చేరుకుంటోంది. అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారుల సమాచారం ప్రకారం 2024 జనవరి నుంచి ట్రస్ట్ ఖాతాల్లో రూ.100 కోట్లకు పైగా నగదు జమ అయ్యింది. బ్యాంకే నగదు లెక్కించాల్సి ఉన్నప్పటికీ.. ట్రస్ట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుని లెక్కింపు బాధ్యతను ట్రస్ట్‌కే అప్పగించినట్టు ఒక అధికారి తెలిపాడు. ట్రస్ట్ నియమించిన 40–50 మంది ఉద్యోగులు రెండు షిఫ్ట్‌లలో ఈ ప్రక్రియ నిర్వహించగా వారిలో పలువురు ప్రస్తుతం సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని తాము స్వతంత్రంగా ధృవీకరించలేక పోయినట్టు కథనం పేర్కొంది.
2021 భూముల వివాదంలోనూ ఇదే పేరు
అనిల్ మిశ్రా పేరు వివాదాల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో రామమందిర ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. భూముల యజమానుల నుంచి ట్రస్ట్ నేరుగా కొనుగోలు చేయకుండా.. ముందుగా అప్పటి బీజేపీ మేయర్ ఋషికేశ్ ఉపాధ్యాయ్ బంధువులు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, అదే భూములను ట్రస్ట్‌కు 9 నుంచి 12 రెట్లు అధిక ధరలకు విక్రయించారని ప్రభుత్వ భూ రికార్డులు చూపించాయి. కేవలం రెండు లావాదేవీల్లోనే ఉపాధ్యాయ్ కుటుంబానికి రూ.18.8 కోట్ల లాభం వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు విక్రయ పత్రాలకు ట్రస్ట్ తరఫున చట్టబద్ధ సాక్షిగా సంతకం చేసిన వ్యక్తి అనిల్ మిశ్రానే. ట్రస్ట్‌లో భూముల కొనుగోలు కమిటీ ఉన్నప్పటికీ.. కమిటీ సమావేశం లేకుండానే అనిల్ మిశ్రా, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ కలిసి నిర్ణయాలు తీసుకున్నారని కొందరు ట్రస్టీలు ఆరోపించారు. దీనిపై ఇద్దరూ స్పందించకపోవటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
సంఘ్‌కు అత్యంత కీలక వ్యక్తి
అనిల్ మిశ్రా సాధారణ నాయకుడు కాదని అయోధ్యలోని పలువురు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు అంటున్నారు. ‘‘ఆయన సంఘ్‌కు చిన్నప్పటి నుంచి అంకితభావంతో పనిచేసిన వ్యక్తి. ఆయనపై చర్యలు తీసుకుంటే అది నేరుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ వ్యవహారం చివరకు నీరుగారే అవకాశం ఉంది’’ అని ఓ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు పేర్కొన్నట్టు కథనం వెల్లడించింది. అయితే మిశ్రా కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు.
రిటైర్డ్ అధికారి నుంచి ట్రస్ట్ ట్రస్టీగా
1985లో యూపీ హోమియోపతి శాఖలో ఉద్యోగంలో చేరిన మిశ్రా..2019లో హోమియోపతి మెడిసిన్ బోర్డు రిజిస్ట్రార్‌గా పదవీ విరమణ చేశారు. అదే ఏడాది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో అనిల్ మిశ్రా ట్రస్టీగా నియమితులయ్యారు. 2024 జనవరిలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగిన యాగాల్లో ప్రధాన యజమానిగా (యజమాన్) కూడా అనిల్ మిశ్రానే వ్యవహరించారు. ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మాత్రం ప్రధాని మోడీ యజమానిగా పాల్గొన్నారు.
బ్రాహ్మణ వర్గ ఆధిపత్యంపై ఆరోపణలు
అయోధ్యలో బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థలో ఉన్న కీలక స్థానాల్లో ఎక్కువ మంది బ్రాహ్మణ, ఠాకూర్, బనియా వర్గాలకు చెందిన వారేనని కథనం పేర్కొంది. అనిల్ మిశ్రా బ్రాహ్మణుడు కావడం కూడా ఆయన ఎదుగుదలకు కారణమైందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు చెందిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో బ్రాహ్మణుల పట్ల పక్షపాతం ఉందని మరో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు కూడా వ్యాఖ్యానించినట్టు కథనం వివరించింది.
కుటుంబమంతా ఆలయ పరిసరాల్లోనే
అనిల్ మిశ్రా కుటుంబ సభ్యులు కూడా రామమందిర పరిసరాల్లోనే తమ వృత్తులు కొనసాగిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు రవి ఆలయం ప్రధాన ద్వారం వద్ద ‘శ్రీరామ్ భోగ్’ అనే రెస్టారెంట్ నడుపుతుండగా.. చిన్న కుమారుడు శుభ్రాంశు అయోధ్యలో హోమియోపతి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. మరో కుమారుడు శుద్ధాంశు జర్మనీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల అనిల్ మిశ్రా ఒక ఖరీదైన కారును కూడా కొనుగోలు చేశారు.
ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు
రామమందిర విరాళాల దుర్వినియోగంపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనా.. విరాళాల నిర్వహణ బాధ్యత వహించిన అనిల్ మిశ్రాపై ఇప్పటివరకు ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు. భూముల కొనుగోలు వివాదం నుంచి విరాళాల లెక్కల వరకు ప్రతి కీలక అంశంలో ఆయన పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలపై దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది. దీంతో సంఘ్ ఆదేశాల మేరకు పని చేసే యూపీలోని డబుల్ ఇంజిన్ సర్కారు.. అనిల్ మిశ్రాను రక్షిస్తుందన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఈ వివాదంలో సమాధానాలు దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విరాళాల వివాదంలో సంఘ్ నేత హస్తం!
- Advertisement -
- Advertisement -



