Saturday, June 27, 2026
E-PAPER
HomeNewsయువత ఆగ్రహానికి వేదిక సీజేపీ

యువత ఆగ్రహానికి వేదిక సీజేపీ

- Advertisement -

మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కొత్త తరం ఉద్యమం
పరీక్షల లీకులు, విద్యా వ్యవస్థ వైఫల్యాలపై ఆగ్రహం

విస్తరిస్తున్న దేశవ్యాప్త నిరసనలు
అన్ని వర్గాల మద్దతు ఇరకాటంలో కేంద్ర సర్కార్

కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి యువ తరం సవాలు విసురుతున్నది. ఇందుకు సోషల్‌ ‌మీడియాలో దూసుకొచ్చిన కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) వేదికవుతోంది. దేశంలో పరీక్షల లీకులు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న గందరగోళం, నిరుద్యోగం, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి సమస్యలపై యువతలో పేరుకుపోయిన అసంతృప్తిని ఈ వేదిక నేడు వీధుల్లోకి వచ్చేలా చేసింది. లక్ష‍లాది మంది యువతకు గొంతుకగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశ రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. యువతలో వస్తున్న ఈ అనూహ్య మార్పు కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.

​ న్యూఢిల్లీ : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ప్రారంభమైన నిరసనలు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాలకు విస్తరించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మొదలైన ఆందోళన నిరవధిక ధర్నాగా మారింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ప్రధాన డిమాండ్‌పై స్పందించకపోవడం ఉద్యమకారుల్లో అసంతృప్తిని పెంచుతోంది.

డిజిటల్‌ ‌ఫైట్‌ ‌నుంచి స్ట్రీట్‌ ‌ఫైట్‌ ‌వరకు..
సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు కోట్లాది మంది అనుచరులు ఉన్నారు. ఇందులో చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. సీజేపీ నిర్వహించిన తొలి రాజకీయ నిరసనలో యువత పెద్ద సంఖ్యలో కనిపించడం ఈ ఉద్యమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఉద్యమాలు, నిరసనలపై ఇప్పటి వరకు అంతగా అనుభవం లేని సీజేపీ.. పరిమిత వనరులతో తొలి ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించి యావత్‌ ‌దేశం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నీట్‌ ‌విషయంలో మోడీ సర్కారు తీరును బయటపెట్టడంలో విజయం సాధించింది.

చలనం లేని కేంద్రం
సీజేపీ ఉద్యమంపై ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. గత దశాబ్దంలో.. మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా అనేక నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. ఇందులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటూ నిరసనలు, పలు పర్యావరణ ఉద్యమాలు, విద్యార్థి పోరాటాలు ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శించింది. ఢిల్లీ సరిహద్దుల్లో గోతులు తవ్వడం, మేకులు వేయడం, నిరసనకారులను దేశద్రోహులుగా ముద్రించడం, సామాజిక కార్యకర్తలపై కఠిన చట్టాల కింద కేసులు పెట్టడం వంటి చర్యలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసింది. దీంతో అంతే స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. అయితే సీజేపీ ఉద్యమాన్ని కూడా ఆ విధంగానే అణచివేస్తే ప్రజాగ్రహం తప్పదన్న విషయాన్ని గ్రహించిన మోడీ ప్రభుత్వం.. ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. సీజేపీ పోరాటంతో తమకు వచ్చే నష్టమేమీ లేదన్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ​

‘విద్యా వ్యవస్థలో ప్రక్ష‍ాళన జరగాలి’
సీజేపీ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం ఇదొక్కటే సరిపోదని అంటున్నాయి. విద్యా వ్యవస్థలో సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలు, ప్రభుత్వ నిధుల కోతలు, ప్రయివేటీకరణ ధోరణులు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు వంటి అంశాలపై కూడా పోరాటం సాగాలని వారు కోరుతున్నారు. ‘‘కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే విజయంగానే భావించొచ్చు. కానీ వ్యవస్థలో మార్పు కోసం విస్తృత ఉద్యమం అవసరం’’ అని అభిప్రాయపడుతున్నారు. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చోటు చేసుకున్న ఏ ఒక్క పెద్ద వైఫల్యానికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించలేదనీ, అలాంటి పరిస్థితిలో ఒక కేంద్రమంత్రి రాజీనామా చేయడం కూడా ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి పెద్ద విజయమే అవుతుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

​మోడీ ప్రభుత్వానికి కొత్త సవాలు
బీజేపీకి యువత అసంతృప్తి ఇప్పుడు కొత్త రాజకీయ సవాలుగా మారుతోంది. నిరుద్యోగం, పరీక్షల లీకులు, విద్యా సంక్షోభం వంటి అంశాలపై యువత నేరుగా ప్రశ్నించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్న సంఘటనలు కనిపించేవి. కానీ సీజేపీ పోరాటం వ్యక్తిగత సమస్యల నుంచి వ్యవస్థపై ప్రశ్నలు వేయడం వరకు ఎదిగిన కొత్త తరం అసంతృప్తికి ప్రతిబింబమని పరిశీలకులు చెప్తున్నారు. మోడీ సర్కారు దీనిని ఒక తాత్కాలిక నిరసనగా చూస్తే పొరపాటే అవుతుందని హెచ్చరిస్తున్నారు. ‘‘ఒకప్పుడు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైన యువత ఇప్పుడు వీధుల్లోకి వస్తోంది. అదే ఈ ఉద్యమం యొక్క అసలు ప్రాధాన్యం. సీజేపీ విజయం సాధిస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే.. ప్రభుత్వ వైఫల్యాలపై యువత మౌనంగా ఉండబోదన్న సంకేతాన్ని మాత్రం ఈ ఉద్యమం ఇప్పటికే దేశానికి ఇచ్చింది’’ అని వారు అంటున్నారు.

​వ్యక్తుల కోసం కాదు.. భవిష్యత్తు కోసం
సీజేపీ ఉద్యమంలో పాల్గొంటున్న యువత ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. ‘ఇది ఏ ఒక్క నాయకుడి ఉద్యమం కాదు’ అని చెప్తోంది. అభిజీత్ దీప్కే, ఇతర నాయకుల కోసం తాము రాలేదని, దేశ యువత భవిష్యత్తు కోసం వచ్చామని వారు చెప్తున్నారు. అయితే ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించాలంటే ప్రతి రాష్ట్రంలో స్థానిక కమిటీలు, నిర్వాహక బృందాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని కూడా వారు గుర్తుచేస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే యువతలో ఉన్నది పాలపొంగు వంటి ఆవేశం కాదనీ, ఒక నిర్దిష్టమైన ఆలోచనతో చేస్తున్న ఉద్యమమని పరిశీలకులు వివరిస్తున్నారు.

వామపక్ష‍ాల నుంచి మద్దతు
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్‌ఏ వంటి వామపక్ష‍ అనుబంధ విద్యార్థి సంఘాలు సీజేపీ నిరసనలకు మద్దతుగా నిలిచాయి. మొదట్లో సీజేపీ రాజకీయ సంస్థలతో దూరంగా ఉన్నప్పటికీ.. క్రమంగా ఇతర ఉద్యమాల అనుభవాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించిందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అంటున్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కో వాలంటే విడివిడిగా పోరాడే ఉద్యమాలు కలిసిరావాలని చెప్తున్నారు. విద్యార్థి, ఉద్యోగ సంబంధ ఉద్యమాలు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. సీజేపీ నిరసనల మరో ప్రత్యేకత ఏమిటంటే దేశంలో ప్రధాన మీడియా పట్టించుకోని సమస్యలకు కూడా వేదిక కల్పించడం. మణిపూర్ హింసపై దేశవ్యాప్తంగా దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తున్న యువకుడు బేవేష్ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ‘‘మణిపూర్ గురించి మాట్లాడేందుకు నాకు వేదిక ఇచ్చింది సీజేపీ. నేను మాట్లాడినప్పుడు వేలాది మంది మణిపూర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దేశం మమ్మల్ని మర్చిపోయిందనుకున్నాను. కానీ చాలా మందికి అసలు పరిస్థితి తెలియదని అర్థమైంది’’ అని ఆయన చెప్పాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -