Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధ మేఘాలు?

యుద్ధ మేఘాలు?

- Advertisement -

ట్రంప్‌ హింట్‌తో ఇజ్రాయిల్‌ హైఅలర్ట్‌..సమావేశమైన ఇరాన్‌ పార్లమెంట్‌
దాడి చేస్తే లక్ష్యంగా చేసుకుంటాం : అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇరాన్‌ హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అన్న ఆందోళనలు బలపడుతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా సోషల్‌ మీడియా పోస్ట్‌, ఇజ్రాయిల్‌ ప్రకటించిన అత్యున్నత భద్రతా అలర్ట్‌, ఇరాన్‌ పార్లమెంట్‌ అత్యవసర సమావేశం..ఈ పరిణామాలన్నీ ఈ ప్రాంతంలో పరిస్థితి వేగంగా ఉద్రిక్త దిశలోకి వెళుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్‌ చుట్టూ సైనిక, దౌత్య స్థాయిలో కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం ఆందోళనతో పరిస్థితిని గమనిస్తోంది. ఇదే సమయంలో, ఇరాన్‌ లోపల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. పలు నగరాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, అరెస్టులు, ఆంక్షలు, కమ్యూనికేషన్‌ నియంత్రణలు పెరిగాయి.

ఇప్పటికే కొనసాగుతున్న అంతర్జాతీయ ఒత్తిళ్లతో కలిసి, ఈ అంతర్గత అశాంతి దేశ భద్రతా స్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. ఈ సమాంతర పరిణామాలు యాదృచ్ఛికమా? లేక అమెరికా ప్రేరేపితమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు, ఇరాన్‌ లోపల ఉద్భవించిన అల్లర్లు పూర్తిగా స్వయంచాలకమైనవి కావని, అమెరికా ప్రేరేపితమైనవని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. హెచ్చరికల భాష, భద్రతా అలర్ట్లు, అంతర్గత అస్థిరత, అత్యవసర పార్లమెంటు.. అన్నీ కలసి, మధ్యప్రాచ్యంలో మరో యుద్ధానికి దారితీయబోతున్నాయా అన్న అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఏ అర్ధరాత్రి ఏం జరుగుతుందోనన్న భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.

టెహరాన్‌ : అమెరికా నెక్ట్స్‌ టార్గెట్‌ ఇరాన్‌ అనే అనుమానాలు సర్వత్రావ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్‌ గాజాపై దురాక్రమణకు దిగాక..వెనువెంటనే ఇరాన్‌పైనా విరుచుకుపడింది. అయితే ఇరాన్‌ దెబ్బకు చావు తప్పి కన్ను లోట్టపోయినట్టు ఇజ్రాయిల్‌..అమెరికా వెనక్కి తగ్గిన విషయం విదితమే. ఇపుడు ఇరాన్‌లో అయేతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల బూచి చూపించి.. ట్రంప్‌ దాడికి సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన హింట్‌తో ఇజ్రాయిల్‌ హైఅలర్ట్‌ అయినట్టు లీకులు వస్తుండగా.. మరోవైపు ఇరాన్‌ పార్లమెంట్‌ కూడా సమావేశమైంది. దీంతో మధ్యప్రాచ్యదేశాల్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది.

ఇరాన్‌లో హింసాత్మకంగా నిరసన
ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీని వెనుక అమెరికా హస్తం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. సందు చూసి దెబ్బ తీయటానికే నిరసనలను ఉసిగొల్పుతున్నట్టు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సుమారు 200 మంది చనిపోయారు.

ఆజ్యంపోస్తున్న ట్రంప్‌ పోస్టు
ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ విలువ దారుణంగా పడిపోవడం, జీవన వ్యయాలు పెరగడం వంటి సమస్యలతో డిసెంబర్‌ 28 నుంచి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ట్రంప్‌.. ”ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఇరాన్‌ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది” అని నిరసనకారులకు మద్దతుగా పోస్టు పెట్టి కలకలం రేపారు.

ఇరాన్‌ అప్రమత్తం
అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయిల్‌ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. ఈ పరిణామాల వేళ ఇజ్రాయిల్‌ ప్రభుత్వం కూడా ట్రంప్‌ అండ చూసుకుని అడుగులేస్తోంది. తాజా పరిణామాల వేళ ఇరాన్‌ పార్లమెంట్‌ ఆదివారం సమావేశమైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చట్టసభ సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘెర్‌ ఖలీబఫ్‌ తాజాగా అమెరికా సైన్యానికి, ఇజ్రాయిల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కనుక తమపై దాడికి తెగబడితే ఆ దేశానికి చెందిన సైన్యాన్ని, ఇజ్రాయిల్‌ను ‘చట్టబద్ధ లక్ష్యాలు’గా చేసుకుంటామని తెలిపారు. ‘అమెరికాకు మరణశాసనం’ అంటూ పార్లమెంట్‌ సభ్యులు వేదిక వైపు దూసుకొచ్చిన సమయంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు.

ముప్పు కలుగుతుందని భావిస్తే చర్యలే : ఇరాన్‌
ఇరాన్‌ పార్లమెంట్‌ సమావేశాలను ప్రభుత్వ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నందుకు పోలీసులు, పార్లమెంటరీ రివల్యూషనరీ గార్డులను స్పీకర్‌ అభినందించారు. ‘ఆందోళనకారుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్న విషయం వారికి తెలియాలి. అరెస్టు చేసిన వారిని శిక్షిస్తాం’ అని ఆయన చెప్పారు. ‘ఇరాన్‌పై దాడి చేస్తే ఆక్రమిత భూభాగమైన ఇజ్రాయిల్‌ను, అన్ని అమెరికా సైనిక కేంద్రాలు, స్థావరాలు, నౌకలను చట్టబద్ధ లక్ష్యాలుగా చేసుకుంటాం. చర్య తర్వాత స్పందించడం మాకు ఇష్టం లేదు. ముప్పు కలుగుతుందని భావిస్తే రంగంలోకి దిగుతాం’ అని అన్నారు. కాగా నిరసన ప్రదర్శనలో పాల్గొనే వారిని దేవుని శత్రువులుగా చూస్తామని, వారికి మరణదండన విధిస్తామని ఇరాన్‌ అటార్నీ జనరల్‌ మహమ్మద్‌ మొవాహెదీ ఆజాద్‌ తెలిపారు.ఇరాన్‌ మద్దతు ఉన్న హమాస్‌ మిలిటెంట్లు 2023లో ఈ దేశంపై దాడులకు తెగబడ్డారు. అలాగే మరో గ్రూప్‌ హెజ్‌బొల్లాతోనూ పోరాడిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -