రాజకీయాలకతీతంగా అందరికీ ఇండ్లు
రామగుండంలో 800 మెగా వాట్ల ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
సింగరేణిని కాపాడేందుకు ప్రణాళికలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
గోదావరిఖనిలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, అడ్లూరి, సురేఖతో కలిసి రూ.175.92 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-గోదావరిఖని
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేస్తామని, రాజకీయాలకతీతంగా అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 96 లక్షల కుటుంబాలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుదిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి రూ.175.92 కోట్లతో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. రామగుండం నగరంలో వివిధ డివిజన్లలో రూ.80 కోట్ల 52 లక్షలు, టీయూఎఫ్‌ఐడీ ద్వారా రూ.88 కోట్ల 90 లక్షలతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ సరఫరా, ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపట్టనున్న రూ.6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు, 494 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పేదల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే రూ.22 వేలా 500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదన్నారు. 29 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు 24 గంటల త్రీ ఫేస్ విద్యుత్తు , 52 లక్షల పైగా నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం పాలకుర్తి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో చేపడతామని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కృషి మేరకు రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ప్రాంతంలో 10 సంవత్సరాలపాటు ఎటువంటి ప్రాజెక్టులు గత పాలకుల హయాంలో తేలేదని విమర్శించారు. సింగరేణి కార్మికులకు, జెన్ కో, డిస్కంలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించిందని, అదే రీతిలో రాష్ట్రంలో పనిచేసే ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోటి రూపాయల బీమా ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు, జే.అరుణశ్రీ, డి.వేణు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



