బెంగాల్‌లో విజయానికి దోహదపడిన సర్, మత విద్వేష ప్రచారం అసోంలో బెంగాలీ ముస్లింలే లక్ష్యంగా దుందుడుకు ప్రసంగాలు
న్యూఢిల్లీ : శాసనసభ ఎన్నికలలో విజయాలు సాధించిన అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్డీఏ ఇప్పుడు 20కి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నదని చెప్పుకొచ్చారు. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలను పోల్చినప్పుడు దక్షిణాదిన తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందన్న విషయం స్పష్టమవుతోంది. వివాదాస్పద ఓటరు జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) నీడలో జరిగిన ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను బీజేపీ చిత్తుగా ఓడించింది. కేంద్రంలో వరుసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పటికీ తనకు ఇప్పటి వరకూ అందని ద్రాక్షగా మిగిలిన ప్రతిపక్ష కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ విజయం తూర్పు ప్రాంతంలో బీజేపీ పట్టును మరింత పెంచింది. అలాగే పొరుగున ఉన్న అసోంలో కూడా కాషాయ పార్టీ రికార్డు స్థాయిలో మూడోసారి విజయం సాధించింది.
కొరకరాని కొయ్యగా దక్షిణాది
ప్రస్తుతం దేశంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చినప్పటికీ దక్షిణ ప్రాంతాలు మాత్రం దానికి కొరకరాని కొయ్యగానే మారాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అధికార మార్పిడిని కోరుకున్నప్పటికీ దానివలన బీజేపీకి ఒరిగిందేమీ లేదు. ఈ ఎన్నికలలో ఇద్దరు బలమైన ప్రాంతీయ నాయకులు ఓటమి పాలవడం గమనార్హం. మమతా బెనర్జీతో పాటు బీజేపీకి గట్టి ప్రాంతీయ ప్రత్యర్థిగా నిలిచిన స్టాలిన్ కూడా అధికారానికి దూరమయ్యారు. తమిళనాడులో నటుడు, రాజకీయ నేత అయిన విజరు సారథ్యంలోని టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకోగా బీజేపీ మిత్రపక్షమైన అన్నా డీఎంకే మూడో స్థానానికే పరిమితమైంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పది సంవత్సరాల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా అధికారం తరచూ చేతులు మారుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ విజయోత్సవ సభలో చేసిన ప్రసంగంలో దక్షిణాదిలో పార్టీ పట్టు సాధించలేకపోవడాన్ని పెద్దగా ప్రస్తావించలేదు.
ఓ వైపు ‘సర్’…మరోవైపు మతతత్వ ప్రచారం
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ 45.88 శాతం ఓట్లను సాధించగా తృణమూల్ కాంగ్రెస్ 40.8 శాతం ఓట్లు మాత్రమే పొందింది. 2021 ఎన్నికలలో బీజేపీకి 38.1 శాతం, తృణమూల్‌కు 47.9 శాతం ఓట్లు వచ్చాయి. బెంగాల్‌లో విజయం కోసం బీజేపీ చాలా కాలంగా ఎదురు చూస్తూనే ఉంది. గత పదిహేను సంవత్సరాలుగా తృణమూల్ అక్కడ అధికారంలో ఉండగా వామపక్షాలు, కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడానికి బీజేపీ తీవ్ర కృషే చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడానికి రెండు ప్రధాన అంశాలు దోహదపడ్డాయి. అవి వివాదాస్పద సర్ ప్రక్రియ, తీవ్ర స్థాయిలో వినిపించిన మతతత్వ ప్రచారం. ఈ ఎన్నికలలో బీజేపీ ఉత్తర ప్రాంతంలో తన పట్టును నిలుపుకోవడంతో పాటు ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, కొల్‌కతా, దక్షిణ బెంగాల్‌లోని టీఎంసీ కంచుకోటలను కూడా బద్దలు కొట్టింది. తృణమూల్ పాలనలో రాష్ట్రంలో అవినీతి మితిమీరిపోయింది. అభివృద్ధి కుంటుపడింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సహజంగానే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానితో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ప్రక్రియ మొత్తం రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసింది.
కేంద్ర బలగాలు, దర్యాప్తు సంస్థల మోహరింపుతో..
ఎన్నికల కమిషన్ విధించిన కఠినమైన నిబంధనల కారణంగా బెంగాల్‌లో ఓటర్ల సంఖ్య సుమారు 90 లక్షల మేర తగ్గింది. ఎన్నికలకు పక్షం రోజులు కూడా సమయం లేని దశలో 27 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యం కోసం 19 ట్రిబ్యునల్స్ వైపు చూడాల్సి వచ్చింది. ఓటు హక్కు రద్దు విషయంలో తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు సుప్రీంకోర్టు సైతం నిరాకరించింది. రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియ ద్వారా ‘చొరబాటుదారుల’ను ఏరివేయడంపై దృష్టి సారించిన బీజేపీ మతపరమైన విద్వేషపూరిత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల మధ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను, జాతీయ దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను రాష్ట్రానికి పంపింది. ఇది ఆ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని సైనికీకరణకు ఓ ఉదాహరణ.
తమిళనాడు, కేరళంలో పెరగని బలం
ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాలన్నింటిలోనూ బీజేపీ ప్రభుత్వాలు విస్తరించి ఉన్నాయి. తన విజయోత్సవ ప్రసంగంలో మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించడం మరచిపోలేదు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ కేవలం 240 స్థానాలకు మాత్రమే పరిమితమైందన్న విషయం గురించి మాత్రం మాట్లాడలేదు. కాగా బెంగాల్‌లో కన్పించిన బీజేపీ ప్రచార జోరు తమిళనాడు, కేరళలో కన్పించలేదు. హోం మంత్రి అమిత్ షా ఏకంగా రెండు వారాల పాటు బెంగాల్‌లోనే మకాం వేశారు. దక్షిణాదిన బీజేపీ ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్ర మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉంది. ఇప్పటికే తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తాజాగా కేరళలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం స్వల్పంగా పెరిగింది. 2021లో నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు కేవలం ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాలలో వేళ్లూనుకుపోవడానికి అన్నా డీఏంకేతో పొత్తు ఉపకరిస్తుందని ఆశించిన కాషాయ పార్టీకి నిరాశే ఎదురైంది. కేరళలో మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఓట్ల శాతాన్ని మాత్రం పెద్దగా పెంచుకోలేకపోయింది. తిరువనంతపురంలోనే ఆ పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. బీజేపీకి చెందిన పలువురు రాష్ట్ర నాయకులు ఈ ఎన్నికలలో పరాజయం పాలవడం ఈ ఎన్నికలలో కన్పించిన మరో విశేషం.
బెంగాలీ ముస్లింలే లక్ష్యంగా..
బెంగాల్‌లో ఏ పరిస్థితులలో ఎన్నికలు జరిగాయన్న విషయాన్ని దాటవేసిన మోడీ పార్టీ సాధించిన విజయాన్ని ‘చారిత్రకమైనది’గా అభివర్ణించారు. బెంగాల్ పొరుగు రాష్ట్రమైన అస్సాంలో కూడా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. అక్కడ బీజేపీ ఓట్లు 33.21 శాతం నుంచి 37.81 శాతానికి పెరిగాయి. గడచిన దశాబ్ద కాలంగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలం 29 స్థానాల నుంచి 19 స్థానాలకు పడిపోయింది. దాని ఓట్ల శాతం మాత్రం దాదాపు స్థిరంగానే ఉంది. అస్సాం ఎన్నికలలో బీజేపీ తన ప్రాంతీయ మిత్రపక్షాలైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణపరిషత్‌లతో కలిసి పోటీ చేసింది. అటు కాంగ్రెస్ కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. బెంగాల్‌లో మాదిరిగా అస్సాంలో కూడా బీజేపీ రాష్ట్రంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన మత విమర్శలు చేసింది. వారిని బహిష్కరించాలని పిలుపు ఇవ్వడం, సరిహద్దు రాష్ట్రంలో జనాభా మార్పులను ప్రస్తావించడం, అక్రమ వలసదారులను తరిమేస్తామని హామీ ఇవ్వడం వంటివి చేసింది. ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, బెంగాల్‌లో సర్ ప్రక్రియను చేపట్టిన ఎన్నికల సంఘం అస్సాంలో మాత్రం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సవరణ’ మాత్రమే జరిపింది.



