ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర రూ.30 లక్షలు
మెక్సికోలోనూ సగటు టికెట్ ధర రూ.1 లక్ష
తీవ్ర అసంతప్తిలో ఫుట్‌బాల్ అభిమానులు
నవతెలంగాణ -క్రీడావిభాగం
2026 ఫిఫా ప్రపంచకప్ జూన్ 11 నుంచి ఆరంభం కానుంది. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ మెక్సికోలోని ఎస్టాడియో బెనెర్టె స్టేడియంలో జరుగనుంది. ఆతిథ్య మెక్సికో, దక్షణాఫ్రికాలు ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ప్రపంచకప్‌లో 104 మ్యాచ్‌లు జరుగనుండగా.. అమెరికా వేదికగా 11 నగరాల్లో అత్యధిక మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. మెక్సికోలో మూడు స్టేడియాల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయి. కెనడాలో రెండు స్టేడియాలు ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదికగా నిలుస్తున్నాయి. ప్రపంచకప్‌ను అమెరికాతో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెక్సికో, కెనడాలు.. టికెట్ల ధరల అంశంలో ఈ ప్రతికూల ప్రభావాన్ని చూస్తున్నాయి. అమెరికా తరహాలోనే మెక్సికో, కెనడాలో టికెట్ల ధరలను నిర్ణయించారు. దీంతో స్థానిక అభిమానులు, ప్రజలు ప్రపంచకప్ నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తపరుస్తున్నారు. ఇదే సమయంలో ఆకాశన్నంటే ధరలతో టికెట్లను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడంతో అమెరికా ప్రజలు, అభిమానులు సైతం ఫిఫాపై వ్యతిరేకతతో రగిలిపోతున్నారు. ఫిఫా ప్రపంచకప్ ముంగిట అన్నీ సవ్యంగా సాగుతుండగా.. నిర్వాహకుల అత్యాశ ఇప్పడు కొత్త సమస్యను తీసుకొచ్చింది.
సామాన్యులు కొనలేరు
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మెక్సికోలో 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆరంభ మ్యాచ్ కోసం ఏప్రిల్‌లో రెండో విడత టికెట్లను విడుదల చేశారు. టికెట్ల రూ.3-10 లక్షల వరకు ఉంది. ‘1970, 1986లో మెక్సికో ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ రెండు ప్రపంచకప్‌లకు హాజరయ్యాను. ఇప్పడు టికెట్ ధరలను చూస్తే ఆవేదనగా ఉంది. నా నెల పెన్షన్ రూ.90వేలు. రూ.3-10 లక్షల వరకు వెచ్చించి ప్రపంచకప్ టికెట్ ఎలా కొనగలను. మెక్సికో ఆర్థిక స్థితిగతుల ప్రకారం ధనవంతులు మాత్రమే ఈ టికెట్లను కొనగలరు. గత రెండు ప్రపంచకప్‌ల మాదిరిగా ఇది అనిపించటం లేదు. ఎందుకంటే ఇది అమెరికా నిర్వహిస్తున్న వరల్డ్‌కప్. టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు.
ప్రపంచకప్‌ను మెక్సికో సొంతంగా నిర్వహిస్తే బాగుండేది’ అని 70 ఏండ్ల మెక్సికో అభిమాని వాపోయారు. ఫైనల్ మ్యాచ్ టికెట్ రూ.30 లక్షలు ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టికెట్ ధరలు అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో టైటిల్ పోరు జులై 19న జరుగనుండగా.. రూ. 10 లక్ష?ల కనీస ధరతో ఫిఫా టికెట్లను అమ్మాకానికి పెట్టింది. ప్రీమియం హాస్పిటాలిటీ టికెట్లను ఫిఫా అధికారిక వెబ్‌సైట్‌లోనే ఏకంగా రూ. 30 లక్షల ధరతో అమ్మాకానికి ఉంచింది. ఫైనల్ మ్యాచ్ సంగతి పక్కనపెడితే.. గ్రూప్ దశ మ్యాచ్‌ల టికెట్ల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. స్వదేశంలో ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష?ంగా చూసి ఆస్వాదించాలని ఎదురుచూసిన అమెరికా అభిమానులకు టికెట్ ధరలతో ఫిఫా షాక్ ఇచ్చింది.
వెనక్కి తగ్గని ఫిఫా
టికెట్ ధరలపై ఫిఫా వెనక్కి తగ్గటం లేదు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో ఉందని, అందుకు తగినట్టుగానే ధరలు ఉన్నాయని ఫిఫా అధ్యక్షుడు ఇన్‌ఫాంటినో అన్నాడు. ‘మనం ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రూప్ దశ మ్యాచ్‌లో కనీసం 25 శాతం టికెట్లను రూ. 1.20 లక్షలకే అందుబాటులో ఉంచాం. అమెరికాలో కాలేజ్ గేమ్స్‌కు కూడా రూ. 27 వేలకు (300 డాలర్లు) దొరకదు. అలాంటిది, ఇది ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లు. టికెట్ ధరలు అందుకు అనుగుణంగానే ఉంటాయని’ ఇన్‌ఫాంటినో ‘దోపిడీ’ని సమర్థించుకున్నాడు.
అఫీషియల్ బ్లాక్‌మార్కెట్
అమెరికాలో స్పోర్ట్స్ ఈవెంట్ల టికెట్ల రీసేల్‌కు అనుమతి ఉంటుంది. ఫిఫా ప్రపంచకప్ టికెట్లను కొనుగోలు చేసిన అభిమానులు.. ఆ టికెట్లను రీ సేల్ చేసేందుకు ఫిఫా వెబ్‌సైట్‌లోనే సదుపాయం కల్పించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ టికెట్లను కొందరు ఏకంగా రూ. 2-3 కోట్ల వరకు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. రీసేల్ టికెట్లను ధరలను అమ్మకందారులు నిర్ణయిస్తే.. ఆ ధరకు కొనుగోలు చేయగలిగినవారు డబ్బులు చెల్లించి సొంతం చేసుకుంటారు. ఎవరూ స్పందించకుంటే, అమ్మకానికి పెట్టిన వారు ధరలను సవరించుకునే వీలుంటుంది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ జులై 19న కాగా.. ఆ లోగా రీ సేల్ మార్కెట్‌లో టికెట్ ధరలు నమ్మశక్యం కాని స్థాయికి చేరుకుంటాని విశ్లేషకుల అంచనా. రీసేల్ మార్కెట్ నుంచి సైతం ఫిఫా ఆదాయం ఆర్జించనుంది. అమ్మినవారి నుంచి 15 శాతం, కొన్నవారి నుంచి 15 శాతం ఫీజును ఫిఫా దక్కించుకుంటుంది. దీంతో ఇటు టికెట్ల అమ్మాకాలతో పాటు రీ సేల్ మార్కెట్‌లోనూ ప్రతి టికెట్‌పై 30 శాతం సొమ్ము చేసుకోనుంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతోంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా 16 నగరాల్లో సాకర్ సంగ్రామానికి ఆతిథ్యం ఇస్తున్నాయి.
ఫిఫా ప్రపంచకప్‌కు మూడు సార్లు ఆతిథ్యం అందించిన ఘనత దక్కించుకునేందుకు మెక్సికో ఎదురుచూస్తుండగా.. ఆ ఉత్సాహం, ఆనందం అభిమానుల్లో కనిపించటం లేదు. అందుకు కారణం, ఫుట్‌బాల్ ప్రపంచకప్‌పై అభిమానుల్లో ఉన్న క్రేజ్, అభిమానాన్ని టికెట్ల ధరల రూపంలో ‘దోపిడీ’ చేసేందుకు ఫిఫా సిద్ధమవటమే. 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ (ఖతార్) సగటు టికెట్ ధర రూ.1.5 లక్షలు కాగా.. 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ (యుఎస్‌ఏ) సగటు టికెట్ ధర రూ. 12 లక్షలు. అమెరికా, మెక్సికో, కెనడా.. మూడు దేశాల అభిమానుల నుంచి టికెట్ ధరలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా ఫిఫా వెనక్కి తగ్గటం లేదు. అభిమానులకు టికెట్ల ధరలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేయకుండా, దోపిడీని సమర్థించుకునే పనిలో పడింది. అంతిమంగా, ఇది ఫిఫా ప్రపంచకప్ సక్సెస్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? ఆసక్తికరం. ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ను స్టేడియంలో చూడాలని అనుకుంటాను. కానీ, టికెట్ కోసం లక్ష రూపాయలు పెట్టను. డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసిన ప్రజలు, అభిమానులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాను. సాధారణ ప్రజలు, అభిమానులు ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లకు వెళ్లలేకపోతే అది కచ్చితంగా నిరుత్సాహమే.
– డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మనం మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఎంతో అభివద్ది చెందింది. టికెట్ ధరలు సైతం అందుకు తగినట్టుగానే ఉంటాయి. అమెరికాలో కాలేజ్ గేమ్స్‌కు టికెట్ ధర 300 డాలర్లు. మరి, ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌కు అదే ధరకు టికెట్ ఉంటుందా?’
– ఇన్‌ఫాంటినో, ఫిఫా అధ్యక్షుడు
ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరలు స్థిరంగా లేవు. ఆన్‌లైన్‌లో డిమాండ్‌కు తగినట్టుగా డైనమిక్‌గా పెరుగుతున్నాయి. అగ్రజట్లు తలపడే మ్యాచ్‌ల టికెట్ ధరలు మరింత అధికంగా ఉన్నాయి. సామాన్య అభిమానులకు ఏమాత్రం అందుబాటులో లేవు. టికెట్ ధరలను దోపిడీగానే పరిగణించాలి’
-అమెరికా, మెక్సికో,
కెనడా సగటు సాకర్ అభిమానులు



