Saturday, May 9, 2026
E-PAPER
Homeసోపతిడయాబెటిస్‌పై ఎందుకింత ఫోకస్‌?

డయాబెటిస్‌పై ఎందుకింత ఫోకస్‌?

- Advertisement -

డయాబెటీస్‌ మెల్లిటస్‌ (డీఎం), తెలుగులో మధుమేహం అనే ఈ జబ్బుకు శరీరంలోని సర్వాంగాలను రుగ్మతకు గురిచేసే సామర్థ్యముంది. ఇతర ఏ జబ్బులకీ లేనంతటి, శరీరమంతటా ఆవహించ గలిగి, ప్రాణాంతక సంభావ్యశక్తి గలిగిన ఏకైక జబ్బు డీఎం.

శరీరంలోని ఏ అవయం కూడా దీని ప్రభావాల నుండి తప్పించుకోలేదు. అన్నీ కూడా రక్తనాళాలలో దీర్ఘకాలంగా ప్రవాహిస్తున్న అధిక గ్లూకోస్‌ స్థాయి (హైపర్‌ గ్లైసీమిక్‌) కలిగి ఉన్న రక్తం వలన సంభవించే సంక్లిష్టతలు. శరీరానికి ఇంధన సరఫరాకు మించిన గ్లూకోజ్‌ రక్తంలో ఉంటే అది ఆ నాళాల్లో, అవి ఉండే అవయవాల్లో వాపుకి కారకమౌతుంది. ఆ విధంగా రెండు రకాల ధ్వంసం జరగవచ్చు

1.కన్ను, కిడ్నీలు, నరాలు: వీటికి రక్తం సరఫరా చేసే చిన్న రక్తనాళాలు (మైక్రోవాస్క్యూలర్‌),
2. గుండె, మెదడు, కాళ్ళు: వీటికి సరఫరా చేసే పెద్ద రక్తనాళాలు (మాక్రోవాస్క్యూలర్‌) వ్యాధులుగా విభజించడం జరిగింది.
ఇవి కాకుండా మరింకెన్నో సంక్లిష్టతలు.. చర్మ సంబంధిత, లివర్‌, ఓవరీయన్‌, అల్జీమర్స్‌, కాన్సర్‌ వంటివి సంభవించవచ్చు.
ప్రథమంగా కంటిపై దీని ప్రభావమెలా ఉంటుందో తెలుసుకుందాం. డీఎం.. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. రెటినోపతి అంటే కన్ను లోపలి భాగంలో ఉండే సున్నితమైన పొరకు రక్తం సరఫరా చేసే నాళాలు బలహీనపడి, వాటి నుండి ద్రవం బయటకు వస్తుంది. దీంతో రెటీనాలో మరికొన్ని రక్తనాళాలు తయారౌతాయి. అవి ఇంకా సున్నితంగా ఉండి, రక్త స్రావాన్ని పెంచి సమస్యను జటిలం చేస్తాయి. రెటీనాను మరింత ధ్వంసం చేస్తాయి. అక్కడ కొత్తగా కణాలు చేరి పొరను వదులుగా, ఉబ్బేటట్లుగా చేయడంతో పొర ఊడిపోయి (రెటినల్డిటాచ్మెంట్‌) అంధత్వానికి దారి తీస్తుంది.
రెటినోపతి డీఎం టైపు, వ్యాధికాలంపై ఆధారపడి ఉంటుంది. టైపు -1 లో సామాన్యంగా వ్యాధి నిర్ధారణ జరిగిన ఇరవై ఏండ్లలో రెటినోపతి మొదలవొచ్చు. కానీ టైపు -2లో వ్యాధి నిర్ధారణకు పూర్వమే అంటే ప్రెడియాబెటిస్‌ స్థాయిలో నేరెటినోపతి రావొచ్చు.

నెఫ్రోపతి: కంటిలో జరిగినట్టుగానే కిడ్నీలో కూడా జరిగి, వాటి ప్రాథమిక విధి ఐన రక్తంలోని మలినాలను తొలగించే పనిని సమర్థవంతంగా చేయడాన్ని జటిల పరుస్తుంది. దీంతో రక్తంలో మలినాలు పెరిగిపోయి ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు మొదలై ఆరోగ్యం క్షీణించి, క్రమేణా క్రానిక్‌ కిడ్నీ డిసీస్‌ (సికెడి)గా పరిణమిస్తుంది.

న్యూరోపతి: నరాలు దెబ్బ తినడం కూడా డీఎం కాలవ్యవధిపై ఆధారపడి వుంటుంది. ఎక్కువ కాలంగా ఉన్న డీఎం న్యూరోపతికి దారి తీస్తుంది. ఇది మొదట పాదాల్లో మొదలై చేతులకు విస్తరిస్తుంది. వివిధ నరాల బలహీనతకు వేర్వేరుగా సూచికలు కనిపిస్తాయి. తిమ్మిరి, జలదరింపు, మంట, నొప్పి-తీవ్రస్థాయి డయాబెటికూ న్యూరోపతిలో నొప్పి, జలదరింపులు రాత్రిపూట విపరీతమై, బలమైన మందులకు కూడా లొంగకుండా ఉంటాయి. ఆ దశలో స్పర్శ, తాపమానం, కంపనాలకు కూడా సున్నితత్వం పెరగడమో, తగ్గడమో జరుగవచ్చు. నొప్పి అనేది శరీరం రక్షణాత్మక విధానాల్లో ఒకటి. తెలియకపోతే గాయాలు పునరావతం అవుతాయి. శరీరంలో, ముఖ్యంగా పాదాల్లో, కీళ్లలో ఎక్కడైనా కావొచ్చు. అదేవిధంగా ఆటోనోమిక్‌ నరాల్లో కలిగే మార్పుల వల్ల ఆకలి లేక పోవడం, వాంతులు, మలబద్ధకం, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, రక్తపోటు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నరాల సమస్యకు ప్రస్తుతం చికిత్స కష్టమే. దీనికి నివారణ ఒక్కటే మార్గం.

స్ట్రోక్‌: ఇది మెదడుకు రక్త సరఫరా చేసే పెద్ద రక్తనాళాలలో అథెరోస్క్ల్రోసిస్‌ పెంపొందడం వల్ల జరుగుతుంది. ఆకస్మికంగా రక్త ప్రసరణ తగ్గిపోయి, ఆక్సిజన్‌ సరఫరా మందగించడంతో బ్రెయిన్‌ భాగం మతి చెందడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటుంది.

కాళ్లలో నొప్పి: విశ్రమిస్తే తగ్గడం, రాత్రుళ్ళు మొదలయ్యి, ఆ తర్వాత పగలు కూడా కాళ్ళ నొప్పులు రావడం దీని సూచిక. పాదాల్లో స్పర్శ కూడా తగ్గి, కాళ్లలో చికిత్సకు లొంగని పుండ్లు తయారయ్యి, క్రమేపీ రక్తప్రసారం పూర్తిగా తగ్గిపోయి, గాంగ్రీన్‌గా మారవచ్చు. అప్పుడు కాలు తీసేయడమొక్కటే చికిత్స. కాలు తీసేయడంతో ఒక్కకాలితో నడక తగ్గిపోయి, కండరాలు బలహీనపడి, వీల్‌చైర్‌కి పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అల్జీమర్స్‌ డిసీస్‌, కొన్నిరకాల క్యాన్సర్లు నాన్‌ ఆల్కహాలికాలిక్‌ ఫాటీలివర్‌ డిసీస్‌-వీటన్నిటికీ డీఎంకి చాలా దగ్గర సంబంధం ఉన్నది. స్త్రీలలో ఎండో మెట్రియాల్‌ కాన్సర్లు డీఎంకి వాడే మందుల ప్రభావం వలన రావొచ్చని అధ్యయనాల అంచనా.అన్ని రకాల అంటువ్యాధులు డీఎం ఉన్నవారిలో తరుచుగా వస్తుంటాయి. ముఖ్యంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌-నోటి, చర్మం, జన్మాంగాలు, పాదాలు… ఈ చోట్లలోనే కాకుండా ప్రేగుల్లో, కిడ్నీలో, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వీరిలో తరచుగా రావచ్చు.

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ / ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -