Sunday, July 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వెలుగు పూల దారిలో నవతెలంగాణ

వెలుగు పూల దారిలో నవతెలంగాణ

- Advertisement -

పదకొండేంళ్ల నవతెలగాణ నవనవోన్మేషంగా ముందుకు సాగుతోంది.
తెలంగాణ నేల చైతన్య ప్రవాహానికి దోసిళ్లు పడుతూ మానవీయ హృదయాలకు వేదికవుతున్నది.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా, సవాళ్లు ముంచెత్తినా…
అన్నింటినీ అధిగమించి, సహచరులతో చేయి కలిపి
చరచర బిరబిర పదపదమంటూ చిగురించే ఆశలతో విశ్వాసపు శ్వాసలతో
జనంతోని స్వరం కలిపి కదులుతోంది.
అక్షరాల ఆలయాన సోపతి సంపద నింపి ఆశయాల దారుల్లో అలుపెరుగని పయనంలో
ఆదరించు పాఠకులకు సహకరించే రచయితలకు వేల వేల వందనాలు…

హృదయపూర్వక శుభాకాంక్షలు.
సోపతిలో ప్రచురితమవుతున్న శీర్షికలు పాఠకుల మన్ననలు అందుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘మీకు తెలుసా’ తోపాటు, కథలు, కవితలు, సినిమా వ్యాసాలు, నెమలీక, పుస్తక సమీక్షలు లాంటి అనేక రచనలు ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నాయి. పత్రికను ఇంత అందంగా తీర్చి దిద్దుతున్న సంపాదకులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.
డా. పొన్నం రవిచంద్ర, సీనియర్‌ జర్నలిస్ట్‌, ఫిల్మ్‌ క్రిటిక్‌.

కొత్త రచయితలకు వేదిక
సోపతి అంటే.. ఆదివారం కాఫీ కప్పుకి బెస్ట్‌ ఫ్రెండ్‌! సోపతి చేతిలో ఉంటే ఆదివారం మరింత పండుగలా అనిపిస్తుంది. వార్తల మధ్య నవ్వులు, విజ్ఞానం, సాహిత్యం అన్నీ ఒకే చోట దొరికే చిరునామా సోపతి. మా ఇంట్లో కాఫీ కంటే ముందు సోపతి తెరవడమే అలవాటు! ఒక్కసారి చదవడం మొదలుపెడితే చివరి పేజీ వరకు ఆగాలనిపించదు. కొత్త ఆలోచనలకు, కొత్త రచయితలకు వేదికగా నిలుస్తోంది. చదివిన ప్రతిసారి ‘ఇంకో పేజీ ఉంటే బాగుండేది’ అనిపించే అనుబంధం. ఆదివారం బోర్‌ కొడితే… ‘సోపతి’ అంటుంది, ‘నేనున్నానుగా!’. చదువును సరదాగా, సరదాను ఆలోచనగా మార్చే మంచి మిత్రుడు సోపతి. సోపతి చదవడం అంటే ఒకేసారి నవ్వడం, నేర్చుకోవడం, ఆలోచించడం. ఇంట్లో చిన్నారి నుంచి తాతయ్య వరకు అందరూ ఎదురు చూసే ఆదివారం అతిథి సోపతి. ప్రతి వారం కొత్తదనంతో పలకరిస్తూ పాఠకుల మనసులను గెలుచుకుంటోంది. ఇలాగే మరెన్నో ఏండ్లు పిల్లలకు, పెద్దలకు విజ్ఞానానికి, వినోదానికి, సాహిత్యానికి చిరునామాగా నిలవాలని… ఇలాగే ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకుంటూ ప్రతి ఇంటికీ ఆలోచనల వెలుగు పంచాలని కోరుకుంటున్నాను. నవతెలంగాణ.. సోపతి కుటుంబానికి హదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు!
– పద్మా కమలాకర్‌

వైవిద్యభరితం…
ప్రజాశక్తి స్థానంలో వచ్చిన ‘నవ తెలంగాణ’ దినపత్రిక మరింత ఆకర్షణీయంగా, వైవిద్యభరితంగా వెలువడటం అభినందించదగ్గ విషయం. ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయే పత్రికలలో కనిపించని వార్తలు, ప్రజా సమస్యలు ఇందులో కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా సంపాదక పేజీలో వచ్చే వ్యాసాలు సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా ఉండడం విశేషం. మిగతా దినపత్రికల అనుబంధాలతో పోల్చి చూస్తే నవ తెలంగాణ ఆదివారం అనుబంధం ‘సోపతి’ మరింత కొత్తగా, వైవిద్యభరితంగా తీసుకురావడం సంతోషకరం. సాహిత్యం, సంస్కృతి, సినిమాలతో పాటు కనిపించే ప్రత్యేక వ్యాసాలు కూడా పాఠకులను ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి.
– కె.పి అశోక్‌ కుమార్‌

సోపతితో నా అనుబంధం
సోపతితో నా అనుబంధం ఆగస్టు 2015 నుండి. ఆనాటి నుండి నేను సోపతిని, సోపతి నన్ను వదలలేదు. మొదట నేను రాసిన దృశ్యకళలపై ఒక పేజీ వ్యాసాల కోసం సోపతి ఆదివారం అనుబంధం పత్రిక విప్పి చూసేదాన్ని. అలా సోపతిలో వచ్చే మిగిలిన వ్యాసాలు కూడా చదవడం అలవాటు అయింది. తరువాత ఆధునిక భారతీయ దృశ్యకళాయానం పేరుతో కొంచెం పెద్ద వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. అవి వారం విడిచి వారం వచ్చినా, ప్రతివారం సోపతి చూడడం మాత్రం మానలేదు. ఆన్‌లైన్‌ పత్రిక అయినా సరే కచ్చితంగా చదివేదాన్ని. బహుశా అందుకు కారణం వీరు ఇచ్చే వైవిధ్యకరమైన వ్యాసాలే. ఒకసారి ముఖ్యమైన సినీతారల విశేషాలైతే, మరోసారి ఈ తరం వారి మానసిక వ్యథలు. ఇంకోసారి ఆలోచనా భరితమైన వ్యాసాలు. అదీ కాకుంటే క్రీడాకారుల విశేషాలు.. ఇలా ప్రతీ వారం పిల్లల కోసం చక్కటి సమాచార పొందికలు. అలాగే ప్రపంచ రాజకీయాలపై స్పందించిన ఆలోచనాపరుల వ్యాసాలూ… మొత్తంమ్మీద సోపతి చిన్న పత్రిక అయినా మానవతావాదిగా రకరకాల కోణాల్లో సమాచారం అందిస్తూ, కళలకూ పేజీల భాగం పంచుతూ, నాలాంటి కళాచరిత్రకారిణినీ తనతో కలుపుకుని ముందుకు వెళ్తున్నందుకు ఆనందంగా వుంది.
– డా.యం.బాలామణి

కాలక్షేపం కాదు
కాలక్షేపం కోసం కాక చైతన్యం కోసం నడిచే పత్రిక నవతెలంగాణ. ‘అనుదినం జనస్వరం’ దాని నినాదం. ‘సోపతి’ ఓ చిరు భాగం. పత్రిక మాతృక ప్రజాశక్తి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకవర్గంలో నేనో సభ్యునిగా ఉన్నందుకు ఇప్పటికీ గర్విస్తుంటా. 45 ఏండ్ల ప్రస్థానం. ఎన్నో ఒడిదుడుకులు. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు. అయినా విలువలు విలువలే. రాజీలేని ప్రజామార్గం. ఆ అనుబంధమే నా బంధం. ప్రస్తుతం సోపతిలో ‘తోలుబొమ్మలాట’ పేరుతో ఓ కాలం ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను సామాన్యులకు అర్థం చేయించాలనే తపనతో వారం వారం కుస్తీపడుతున్నా. అలాగే నా సహ రచయితలు కూడా. విభిన్న వేదికల సమాహారం కావడం వలన సోపతికి ఆ వైశిష్ట్యం లభిస్తున్నదనేది నా భావన. మరోసారి పత్రిక నిర్వాహకులకు అభినందనలు. ధన్యవాదాలు.
– కె.శాంతారావు, రంగస్థల కార్యకర్త

ప్రజాస్వామ్యానికి బాసట నవతెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, ప్రజా పక్షం వహించే పత్రికగా ఆవిర్భవించిన ‘నవ తెలంగాణ’ స్వల్ప కాలంలోనే విశిష్ట గుర్తింపు పొందింది. వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజా సమస్యలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వార్తా కథనాలను అందిస్తోంది. నిరుద్యోగుల పోరాటాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం గళం విప్పుతోంది. సాగునీరు, మద్దతు ధర, కరెంట్‌ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశోధనాత్మక కథనాలను ప్రచురిస్తోంది. ప్రగతిశీల ఆలోచనలు పెంపొందించేలా ప్రత్యేక శీర్షికలు, సాహిత్య వ్యాసాలు, సామాజిక విశ్లేషణలకు పెద్దపీట వేస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూ ప్రతిపక్ష భూమికను పోషిస్తోంది. సమాజానికి ఒక ఆదర్శవంతమైన దిశా నిర్దేశం చేసే వామపక్ష ఉద్యమ రాజకీయాల ఆవశ్యకతను, ఆ ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న ‘నవ తెలంగాణ’ ప్రజాస్వామ్యానికి బాసటగా నిలుస్తూ వస్తోంది. ఇందుకు నవ తెలంగాణ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు. పాఠకులకు శుభాకాంక్షలు.
– ప్రొఫెసర్‌ బెల్లి యాదయ్య

సచిత్ర శోభితంగా…
సమాజంలో మూఢత్వానికి వ్యతిరేకంగా ప్రజాసమూహాల్లో ఉన్నత భావజాల వనరులను పెంపొందింప జేయడంలో నవ తెలంగాణపత్రిక గత దశాబ్ది కాలంగా విశేషంగా కషిచేస్తుంది. పాలక వర్గాల నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తూ వామపక్ష, భీమ్‌పక్ష రాజకీయాల ఉమ్మడి విలువలను నవతెలంగాణ పత్రిక ఎప్పటికప్పుడు పాఠకులకు చేరవేస్తుంది. సమకాలీన రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల పట్ల పాఠకులకు సదావగాహన కల్పించే విధంగా ఎడిట్‌ పేజీ వ్యాసాలు ఉంటున్నాయి. ఫాసిజంపై నవతెలంగాణ పత్రిక సాహసోపేతంగా అక్షర యుద్ధం చేస్తుంది. మానవిలో ప్రచురితమవుతున్న కథనాలు, రచనలు ఇంటర్వ్యూలు మహిళా సాధికారతకు నిదర్శనంగా ఉంటున్నాయి. నవతెలంగాణ సోపతి ఆదివారం అనుబంధం అన్ని వర్గాల పాఠకులను అలరించే విధంగా సచిత్ర శోభితంగా రూపుదిద్దుకుంటుంది. సమకాలీన రాజకీయ ఆర్థిక, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక పరిణామాలపై సొపతిలో ప్రామాణికమైన మంచి రచనలు వెలువడుతున్నాయి. జన్‌ జీ తరానికి కొత్త జోష్‌ నిచ్చే విధంగా సోపతిలో స్ఫూర్తి దాయకమైన రచనలు వస్తున్నాయి. దశాబ్దకాలంగా వివిధ వర్గాల, శ్రేణుల పాఠకులకు మెరుగైన సేవలందిస్తున్న నవతెలంగాణ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు
– ఆచార్య కోయి కోటేశ్వరరావు

అక్షర వారధి
నవతెలంగాణ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సంపాదకీయ విభాగానికి, పాత్రికేయ మిత్రులకు అలాగే అక్షరాభిమానులకు ఒక రచయితగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ‘అనుదినం జనస్వరం’గా సమాజంలో జరుగుతున్న పరిణామాలను నిష్పాక్షికంగా విశ్లేషిస్తూ, ప్రజాపక్షం వహించి, ప్రజల గొంతుకగా నిలవడంలో నవతెలంగాణ ఎప్పుడూ ముందుంటుంది. వార్తలను అందించడమే కాకుండా, సమాజంలో చైతన్యాన్ని రగిలించే అద్భుతమైన సాహిత్యాన్ని, విశ్లేషణలను అందిస్తూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. కూలీల కష్టాన్ని, రైతన్న కన్నీటిని, ఉద్యోగుల ఆశలను, యువత ఆవేదనను, వార్తల వేదికపై నిలబెట్టి, పాలకుల కళ్ళు తెరిపించిన అక్షర వారధి ఇది.! లాభాల వేటలో లోకం మునిగినా, వ్యాపార విలువల వెల్లువలో కొట్టుకుపోక.. నిబద్ధతకు నిలువెత్తు రూపంగా, సామాన్యుడి గుండె చప్పుడుగా నిలిచిన పత్రిక! రచయితల ఆలోచనలకు, సమాజ హితాన్ని కోరే కలాలకు నవతెలంగాణ ఎల్లప్పుడూ ఒక వేదికగా నిలుస్తోంది. ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ, వారి హక్కుల కోసం పోరాడే పత్రికగా నవతెలంగాణ ప్రస్థానం నిరంతరం దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వార్షికోత్సవ వేళ పత్రిక మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని, సమాజ చైతన్యంలో తన ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మరోసారి పత్రికా బృందానికి నా అభినందనలు!
– తరిగొప్పుల వి ఎల్లెన్‌ మూర్తి

బహుధా ప్రశంసనీయం
వార్త వ్యవస్థ ప్రజాస్వామ్యానికి నాడీమండలం వంటిది. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ‘నవతెలంగాణ’ దినపత్రిక చేస్తున్న సేవ బహుధా ప్రశంసనీయం. దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, క్రీడా రంగాల్లోని వార్తలను సమగ్రంగా నిస్పక్షపాతంగా నవతెలంగాణ అందిస్తున్నది. యథాతథంగా వార్తల్ని ప్రచురించటమేకాదు, ఎడిట్‌ పేజీలో వ్యాసాలు, వ్యాఖ్యలు, ప్రముఖుల ఆలోచనా విశ్లేషణులు పాఠకులలో మంచి అవగాహనతో పాటు వారిలో విమర్శనాత్మకమైన దృష్టిని పెంపొందించుతున్నాయి. ఇక ఆదివారం అనుబంధం ‘సోపతి’ నిజంగా మంచి సావాసగాడు. ఇందులో మీరు అందించే వ్యాసాలు, ఆరోగ్యం, పర్యాటకం, పరిశోధనలు, కథలు, కవితలు, సమీక్షలు అన్ని రంగాల ప్రజలను అలరిస్తున్నాయి. ఇటువంటి పత్రిక 10 ఏండ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకుని 11 ఏండ్ల పరిణతిలోకి అడుగు పెడుతోన్న ఈ శుభసందర్భాన పత్రికా యాజమాన్యానికి, సిబ్బందికి, ఆదరిస్తోన్న తెలుగు ప్రజానీకానికి శుభాకాంక్షలు.
– కూర చిదంబరం, కథకులు

నిత్యనూతనంగా…
దినపత్రికల అనుబంధ పత్రికలా కాక ఒక ప్రత్యేక వార పత్రికలా ఆరంభమైంది ‘సోపతి’. మొదట్లో శ్రీమతి ముప్పాళ్ల రంగనాయకమ్మగారి సీరియల్‌ నవల, ముక్తవరం పార్థసారధి గారి అనువాద రచన సీరియల్‌గా వచ్చేవి. కరోనా కాలంలో ‘ఈ – పత్రిక’గా వచ్చిన సోపతి ఇప్పుడు తిరిగి అచ్చులో రావడం ఎందరో పాఠకులకు పాత అనుభూతిని పునర్జీవింపచేసింది. కథ, కవర్‌ పేజీ వ్యాసం, సామాజిక, మానసిక విశ్లేషణ వ్యాసాలు, ప్రామాణికమైన పుస్తక సమీక్షలు, ప్రత్యేకంగా కవితలకు ఒక పేజీ, బాలలకు నెమలీక, పదరంగం, చిత్రాలు సూడరోలో అద్భుతమైన చిత్రాలు అందిస్తున్న నవతెలంగాణ ఆదివారం అనుబంధం ‘సోపతి’ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఆవిష్కరించుకుంటుందని ఆకాంక్షిస్తున్నాను.
– చింతపట్ల సుదర్శన్‌

కొనసాగుతూనే ఉంటాను
40 ఏండ్ల నా సాహిత్య జీవితంలో ఈ సంస్థతో 30 ఏండ్ల అనుబంధం వుంది. ప్రజాశక్తి ఆదివారం అనుబంధం, స్నేహ, 2014 నుండి నవ తెలంగాణ సోపతి ఆదివారం అనుబంధంతో పాటు కల్చరల్‌ పేజీలలో నేను ఇప్పటివరకు సుమారు 500 పైగా వ్యాసాలు రాశాను. గతేడాది సోపతిలో నేను ‘హైదరాబాద్‌ సినిమా’ కాలమ్‌లో రాసిన వ్యాసాలకే 2025 సంవత్సరానికి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్‌ ఫిలిం అవార్డును అందుకున్నాను. ఇది నేను నా జీవితంలో గర్వంగా చెప్పుకోదగిన విషయం. నవతెలంగాణతో ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.
– హెచ్‌ రమేష్‌ బాబు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -