నవతెలంగాణ – హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంపై హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. లాటరీలో ఇళ్లు దక్కించుకోని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన ధరావతు మొత్తాన్ని బుధవారం నుంచి తిరిగి చెల్లించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు. ఈ వాపసు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి హౌసింగ్ బోర్డు రూ.10 వేలను ఈఎండీగా స్వీకరించింది. ఆన్లైన్ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించిన వారు డబ్బుల వాపసు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని గౌతమ్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఏ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు చెల్లించారో, తిరిగి అదే ఖాతాకు జమ చేస్తామని వివరించారు. అయితే, కొందరు మీ-సేవ కేంద్రాల్లో నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించామని, వారు మాత్రం డబ్బు వాపసు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
నగదు రూపంలో చెల్లించిన వారు హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in ద్వారా ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఇది పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని ఆయన పేర్కొన్నారు. పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040-24603572 నంబరుకు ఫోన్ చేయవచ్చని సూచించారు.



