ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది, అరుదైనది, అత్యంత అమూల్యమైనది. మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు… మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్నీ, చిత్రవిచిత్ర ప్రదేశాల్ని సృష్టించి పెట్టింది. జీవితంలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాల్సిందే, వాటి చెంతకు వెళ్లి రావాల్సిందే. అలాంటి… అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
తియాంజీ పర్వతాలు
కొన్ని కొన్ని ప్రదేశాల్ని చూస్తే… అద్భుతాన్ని తలపిస్తాయి. ఈ తియాంజీ పర్వతాలు అలాంటివే. అక్కడకు ఒక్కసారి వెళ్లినా చాలు… ఈ జీవితానికి ఇక చాలు అనిపిపించినా ఆశ్చర్యం అక్కర్లేదు. చైనా…. హునాన్ ప్రావిన్స్‌లో ఉన్నాయీ పర్వతాలు. సున్నపురాయితో ఏర్పడి దట్టమైన పచ్చదనం పరచుకొని, మంచు తెరల మధ్య మైమరపిస్తాయి. పర్యాటకులు కేబుల్ కార్‌లో హుయాంగ్‌షీ విలేజ్‌కు వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఈ పర్వతాల్ని చూస్తే. మతిపోవడం ఖాయం. అంతెందుకు అవతార్ సినిమాలో తేలియాడే పర్వతాలకు ఈ మౌంటేన్సే ఇన్స్‌రేషన్.
సొకోత్రా ఐలాండ్
ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కల్ని చూడాలనుకుంటే… మీకు పర్‌ఫెక్ట్ ప్లేస్ ఈ సొకోత్రా ఐలాండ్. ఇది యెమెన్‌లో ఉంది. సరికొత్త లోకాన్ని పరిచయం చేసే ఈ దీవి 60 లక్షల ఏండ్ల కిందట ఆఫ్రికా నుంచి విడిపోయింది. అదేం విచిత్రమో గానీ ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్ష జాతులు ఇక్కడున్నాయి. ఇక్కడ 300 రకాల అరుదైన చెట్లున్నాయి. ముఖ్యంగా… డ్రాగన్ బ్లడ్ ట్రీ, బల్బోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనం చూడగలం. అటు ప్రపంచ టూరిస్టులు, ఇటు సైంటిస్టులు… వెళ్లే ప్రదేశాల్లో ఇదీ ఒకటి.
36 అడుగుల చెయ్యి
కొన్నింటిని చేరాలంటే… సాహస యాత్ర చెయ్యాలి. నానా తిప్పలు పడాలి. చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న ఈ చెయ్యి అలాంటిదే. చిలీకి చెందిన శిల్పి మేరియో ఇర్రాజబల్ 1992లో దీన్ని చెక్కాడు. అన్యాయం, బాధలు, హింస, ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించాడు. ఎక్కడో ఎడారిలో ఓ సందేశాన్నిస్తూ చెక్కడం వల్ల ఈ 36 అడుగుల ఎత్తున్న హ్యాండ్‌కి చాలామంది అభిమానులున్నారు. మండే ఎండల్ని లెక్కచెయ్యకుండా అక్కడకు వెళ్లి… చూసి వస్తుంటారు.



