కనిగిరిలో పెద్దఎత్తున రాస్తారోకో ధాన్యానికి నిప్పు
కొణిజర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ- వీపనగండ్ల/కొణిజర్ల
ధాన్యం కొనుగోలు చేయాలని, గన్నీ సంచులు, లారీల కొరత, కాంటాల తదితర సమస్యలపై రైతులు శనివారం వనపర్తి, ఖమ జిల్లాల్లో రాస్తారోకో, ధర్నాలు చేశారు. వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం కనిగిరి గ్రామంలో రైతులు కొల్లాపూర్-పెబ్బేరు ప్రధాన రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలిసన వెంటనే అధికారులు అక్కడకు వచ్చి రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. జిల్లా అధికారులు వచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకూర్చోవడంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడించారు. గతంలో కొనుగోలు కేంద్రంలో ఎలా కొనుగోలు చేశారో అదేవిధంగా చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
కొణిజర్లలో ధర్నా
గన్నీ సంచులు, కాంటాలు, మిల్లుల అలాట్మెంట్‌కు లారీలు ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వందలాది రైతు సంఘం నాయకులతో కలిసి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. గన్నీ సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నా స్థానిక రైతులకు ఇవ్వకుండా పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. విషయాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్ అరుణకు ఫోన్‌లో వివరించగా.. స్పందించిన అదనపు కలెక్టర్ 10 వేల గన్నీ సంచులను వెంటనే కొనుగోలు కేంద్రానికి రెండు వ్యాన్ల ద్వారా పంపించారు. లోకల్ రైస్ మిల్లులు ఎలాట్ చేస్తామని హామీ ఇచ్చారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



