ఓపెన్ సెలక్షన్స్‌తో గ్రామీణ క్రికెటర్లకు ప్రాతినిథ్యం
హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీల ఏర్పాటు
క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అంబటి రాయుడు
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 2026-27 సీజన్‌కు సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీలను ప్రకటించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అంబటి రాయుడు సెలక్షన్ కమిటీలను ప్రకటించారు. సీనియర్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో జట్లను మాజీ రంజీ క్రికెటర్ పి. అక్షత్‌రెడ్డి సారథ్యంలోని కమిటీ చూసుకోనుండగా.. జూనియర్ క్రికెట్ సర్కిల్ బాధ్యతలను మాజీ రంజీ ప్లేయర్ ఆకాశ్ భండారి నేతృత్వంలోని కమిటీ చూసుకోనుంది. ‘హైదరాబాద్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అందుబాటులోని ఉత్తమ వ్యక్తులను సెలక్టర్లుగా ఎంచుకున్నాం. ప్రతి లీగ్ మ్యాచ్‌కు సెలక్షన్ కమిటీ నుంచి ఒకరు హాజరవుతారు. లీగ్స్, ఓపెన్ సెలక్షన్స్‌తో పాటు సూపర్‌లీగ్ అనంతరం ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసి అంతిమంగా జట్టును ప్రకటిస్తారు. ప్రతి ఫార్మాట్‌కు, ప్రతి ఏజ్ గ్రూప్ జట్టుకు 3000 మందితో ఓపెన్ సెలక్షన్స్ నిర్వహిస్తాం. ఏదేని ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశారు? ఎందుకు చేయలేదనే వివరాలను సెలక్షన్ కమిటీ పొందుపరిచేలా వ్యవస్థను రూపొందించాం. లీగ్‌లకు గ్రౌండ్, మ్యాచ్ అఫీషియల్స్‌ను ఏఐ ఆధారిత సాంకేతికతో కేటాయిస్తామని’ అంబటి రాయుడు తెలిపాడు. హైదరాబాద్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అంబటి రాయుడికి పూర్తి స్వేచ్ఛ అందించామని, క్రికెట్ వ్యవహారాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం ఉండదని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. సీనియర్ సెలక్షన్ కమిటీ : పి. అక్షత్ రెడ్డి (చైర్మెన్), టి. సుమన్, మెహిది హసన్, టి. పవన్‌కుమార్, ఇందర్ శేఖర్ రెడ్డి. జూనియర్ సెలక్షన్ కమిటీ : ఆకాశ్ భండారి (చైర్మెన్), పి. రమేశ్‌కుమార్, షోయబ్, సర్వేశ్ కుమార్, టిమోతి కుమార్.
రాష్ట్ర జట్లకు మూడంచెల్లో ఎంపిక
- Advertisement -
- Advertisement -



