Wednesday, May 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఉచిత సలహాలొద్దు

ఉచిత సలహాలొద్దు

- Advertisement -

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై 
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఫైర్
విదేశాంగ వైఫల్యమే సంక్షోభానికి మూలం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలి

చమురు నిల్వల కోసమే యుద్ధం : 
 కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
స్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశ ప్రధాని మోడీ ఉచిత సలహాలు మానుకొని విదేశాంగ వ్యవహారాలను సరిదిద్దుకుంటే బాగుంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకులు ఎండి పాషా పార్టీ జెండాను ఆవిష్కరించారు. రొడ్డ అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై చేస్తున్న అక్రమ యుద్ధం వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుతున్నాయని అన్నారు. విదేశాంగ విధానాల్లో ప్రధాని మోడీ వైఫల్యాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇరాన్‌, రష్యాతో వ్యాపార సంబంధాలను వదిలేసి అమెరికా అధ్యక్షులు ట్రంప్‌కు మోకరిల్లడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. విదేశాంగ విధానంలో వైఫల్యం చెంది నేడు మోడీ ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. ఉచిత సలహాలు కాదు.. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. ఒకప్పుడు చట్టసభల సమావేశాలు జరుగు తున్నాయంటే ప్రజలకు మేలు జరుగుతుందని అందరూ భావించేవాళ్లు.. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. ప్రజలు సాధించుకున్న హక్కులను హరించడానికి చట్టా లను సవరించడానికి మాత్రమే ఆ సమావేశాలు పెడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందన్నారు. విద్యుత్‌ చట్టం, విత్తన చట్టం ద్వారా రైతులకు గుది బండగా మారాయన్నారు. దేశంలో మైనార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా పాలన సాగుతోందన్నారు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ చేసి తన అనుకూలమైన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పెంచుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. నరేంద్ర మోడీ కార్మిక, మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజరు కుమారుడు బాలికపై లైంగికదాడికి ఒడిగట్టి.. తప్పించు కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేస్తోందన్నారు. మిగతా హామీలు అమలుకు నోచుకోలేదని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

చమురు నిల్వల కోసం యుద్ధం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
పెట్టుబడి, సామ్రాజ్యవాద దేశాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు చమురు నిల్వలు ఉన్న ఇతర దేశాలపై దాడి చేస్తున్నాయని, అమెరికా, ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై దాడి అందులో భాగమేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సోషలిజం బలపడుతోందని చెప్పారు. అమెరికాలో సైతం సోషలిస్టు పార్టీ 51శాతం ఓట్లతో ట్రంపు అభ్యర్థిపై గెలుపొందినట్టు గుర్తు చేశారు. అమెరికాతో ఉన్న ఆదాని, అంబానీ వ్యాపారం కొనసాగించడం కోసం మోడీ ట్రంప్‌కు దాసోహం అయ్యారని విమర్శించారు.

పోరాటాలకు సిద్ధం కండి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌
పాలకుల నిర్లక్ష్యంతో అనాదిగా గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించినట్టు చెప్పారు. ఈ క్రమంలో అనేక సమస్యలు బహిర్గతమయ్యాయని, అప్పు లేని కుటుంబం ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, కొండమడుగు నరసింహ, కల్లూరు మల్లేశం ,మాటూరి బాలరాజు గౌడ్‌, జల్లెల పెంట య్య, గుంటూజు శ్రీనివాస్‌ చారి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాగిరి కిష్టయ్య, చౌటుప్పల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ బత్తుల జయమ్మ, దాసుగౌడ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పల్లె మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -