రాజస్తాన్‌లో ప్రశ్నాపత్రం లీక్ కేసు నమోదు చేసిన సీబీఐ
మహారాష్ర్టలో ఒకరి అరెస్ట్
ఈనెల 3న దేశవ్యాప్తంగా జరిగిన పరీక్ష
22 లక్షల మంది విద్యార్థులకు నిరాశ
నిరుత్సాహంలో తల్లిదండ్రులు
మోడీ సర్కార్ వైఫల్యాలకు నిదర్శనం
మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం.. :
ఎన్‌టీఏ డీజీ అభిషేక్‌సింగ్
న్యూఢిల్లీ : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపరీక్ష నీట్ యూజీ-2026 రద్దయ్యింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్తాన్‌లో లీక్ అయ్యిందనే ఆరోపణలతో ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ జరిగిన నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా 22 లక్షలమంది రాసారు. పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశ్నాపత్రం లీకైన విషయం నిర్థారణ కాగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ కేంద్రాన్ని సంప్రదించారు. కేంద్రం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ వెంటనే ప్రశ్నాపత్రాలు ముద్రించిన నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఒకర్ని ఆరెస్టు చేసినట్టు తెలిసింది. లీకేజీతో నష్టపోయిన ఆశావాహులకు న్యాయం చేయడానికి త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామనీ, దీనికి సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది. ఈ ప్రక్రియ పదిరోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపింది. మళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలే ఉంటాయనీ, ఎలాంటి అదనపు రుసుము ఉండబోదని తెలిపింది. నీట్ యూజీ పరీక్షను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించారు. 551 నగరాలు, ఇతర దేశాల్లోని 14 సిటీల్లో నిర్వహించిన ఈ పరీక్ష?కు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా పరీక్షను రద్దు చేస్తూ ఎన్‌టీఏ నుంచి ఊహించని ప్రకటన రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.
సీబీఐ దర్యాప్తు.. కేసు నమోదు
పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకు సంబంధించి బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాజస్తాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూపు నుంచి సమాచారాన్ని సేకరించేందుకు త్వరలోనే అక్కడికి ఓ బృందాన్ని అధికారులు పంపనున్నారు. విచారణకు అవసరమైన అన్ని రికార్డులనూ సీబీఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో ఒకరి అరెస్ట్
మహారాష్ట్ర పోలీసులు నీట్ లీకేజీ వ్యవహారంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నాశిక్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికారి డీసీపీ కిరణ్‌కుమార్ చెప్పారు. రాజస్తాన్ నుంచి పోలీసుల బృందం వచ్చి ఆయనను కస్టడీలోకి తీసుకుంటుందని తెలిపారు. ఇటు పేపర్ లీకేజీ వ్యవహారం కూడా రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపుతోంది. వరుస లీకేజీ ఘటనలపై కేంద్రం వైఫల్యాన్ని పలు పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
పేపర్ లీక్‌పై సరైన విచారణ జరపాలి
నీట్ పేపర్ లీక్‌పై సరైన విచారణ జరపాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజి డిమాండ్ చేశారు. మే 3న జరిగిన నీట్ యూజీ-2026 పరీక్ష రద్దుకు దారితీసిన ప్రశ్నపత్ర లీకేజీపై మంగళవారం విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన చేపట్టింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నేతలు నినాదాలు హోరెత్తించారు. పోలీసులకు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి నెట్టి అరెస్టులు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజి మాట్లాడుతూ… నీట్ పెట్టినప్పటి నుంచీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తన అసమర్థతను మరోసారి నిరూపించుకుందని విమర్శించారు.
మొత్తం 720 మార్కులకు గాను దాదాపు 600 మార్కులు తారుమారు చేశారని, ఇది పరీక్ష సమగ్రతను తీవ్రంగా దెబ్బతీసిందని దుయ్యబట్టారు. పరీక్షలోని 180 ప్రశ్నల్లో దాదాపు 15 ప్రశ్నలు ఒక నమూనా ప్రశ్నపత్రంతో ముందుగానే పంపిణీ చేశారని, కెమిస్ట్రీ విభాగం నుంచి సుమారు 120 ప్రశ్నలు యథాతథంగా లీక్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ప్రతిష్టాత్మక నీట్ పరీక్షలలో జరుగుతున్న అవకతవకలకు మోడీ ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలని అన్నారు. పరీక్షల వ్యవస్థను కేంద్రీకరించడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఎస్‌ఎఫ్‌ఐతో సహా విద్యార్థి సంఘాలు, సమాజంలోని ఇతర వర్గాలు మొదటి నుంచే ఎత్తి చూపాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకరణ ప్రయత్నాల ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో పరీక్షల మాఫియాలు పుట్టుకొచ్చేందుకు మార్గం సుగమం చేశారని విమర్శించారు. భారీ స్థాయిలో ప్రవేశ పరీక్షల కోచింగ్ మార్కెట్‌ను ప్రోత్సహించి, నిస్సహాయ స్థితిలో ఉన్న దేశ మధ్యతరగతిని దోపిడీ, అభద్రతలోకి నెట్టివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలి
నీట్ పరీక్ష రద్దు ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలను అరెస్టు చేయడాన్ని ఆ సంఘం కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణం నాయకులను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం బలప్రయోగంతో విద్యార్థుల పోరాటాన్ని అణచివేయలేదనీ, ఎన్టీఏకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ తన ఉద్యమాన్ని కొనసాగిస్తుందనీ స్పష్టం చేశారు.



