నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో, సోమవారం (ఆగస్టు 3) రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా యంత్రాంగాలు ఉత్తర్వులు జారీ చేశాయి. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, త్రిసూర్, ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అలప్పుళ జిల్లాలో ప్రస్తుతం సహాయక శిబిరాలుగా కొనసాగుతున్న పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇచ్చారు.
అదేవిధంగా, వరద ప్రభావిత ప్రాంతాలైన చెంగన్నూర్, కుట్టనాడ్ తాలూకాల్లోని పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు (ప్రొఫెషనల్ కాలేజీలు), అంగన్‌వాడీలు, ట్యూషన్ సెంటర్లకు కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలకు సోమవారం ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. దీని ప్రకారం, రాబోయే 24 గంటల్లో కొన్ని చోట్ల 7 నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.



