హవానా : వెనిజులా, ఇరాన్‌పై దాడుల తర్వాత ఇప్పుడు అమెరికా క్యూబాను లక్ష్యంగా చేసుకుందా? అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. క్యూబా తీరంలో అమెరికా సైనిక నిఘా విమానాల కదలికలు బాగా పెరిగాయని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి క్యూబాలోని అతి పెద్ద నగరాలైన హవానా, శాంటియాగో డి క్యూబా సమీపంలో అమెరికా నౌక, వైమానిక దళాలకు చెందిన కనీసం పాతిక విమానాలు, డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. వీటిలో కొన్ని తీరానికి 40 మైళ్ల లోపలికి చొచ్చుకొని వచ్చాయి. వీటిలో చాలా వరకూ నిఘా, గూఢచర్యం కోసం రూపొందించిన పీ-8ఏ పోసిడార్ గస్తీ విమానాలే. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ సేకరణలో పేరు పొందిన ఆర్‌సీ-135వీ రివెట్ జాయింట్ విమానాలు కూడా ఈ కార్యకలాపాలలో భాగస్వాములయ్యాయి. గూఢచర్యం కోసం ఉపయోగించే ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు కూడా క్యూబా తీరంలో చక్కర్లు కొట్టాయి. ఈ డ్రోన్లు చాలా ఎత్తు ఎగురుతాయి. తీరానికి దగ్గరగా సంచరించిన ఈ విమానాలు, డ్రోన్లు ఇంటెలిజెన్స్ సేకరణకు అనువైనవి.
వెనిజులా, ఇరాన్‌పై సైనిక చర్యకు ముందు కూడా… వెనిజులా, ఇరాన్‌పై సైనిక చర్యలకు పాల్పడే ముందు అమెరికా ప్రభుత్వంలోని కీలక నేతలు ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలే చేయడం గమనార్హం. వెనిజులా నేత నికొలస్ మదురో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని, సామూహిక హత్యాకాండకు, హింసాత్మక ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. వెనిజులాపై దాడి చేయడానికి ముందు ఆ దేశ తీరంలో అమెరికా నిఘా విమానాలు సంచరించాయి. కారకాస్‌లోని మదురో నివాస ప్రాంగణంపై దాడి చేసి ఆయనను, ఆయన భార్యను నిర్బంధించి న్యూయార్క్‌కు తరలించే ముందు రోజుల వరకూ అమెరికా నిఘా విమానాలు వెనిజులా తీరం వెంట తిరుగుతూనే ఉన్నాయి. ఇరాన్‌లో కూడా ఇలాంటి ధోరణే కన్పించింది. అమెరికా-ఇజ్రాయిల్ దళాలు టెహ్రాన్‌పై దాడి చేయడానికి ముందు అమెరికాకు చెందిన నిఘా విమానాలు, మానవ రహిత డ్రోన్లు ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించాయి. ఇటీవలి వారాలలో క్యూబా తీరంలో కన్పించిన పీ-8ఏ పోసిడాన్, ఆర్‌సీ-135వీ రివెట్ జాయింట్, ఎంక్యూ-4సీ ట్రైటాన్ వంటి విమానాలు ఇరాన్‌పై జరిపిన యుద్ధంలో క్రియాశీలకంగా పనిచేశాయి.
2025 ప్రారంభంలో ఇలాంటి అమెరికా నిఘా విమానాలే ఉక్రెయిన్ వార్‌జోన్‌లోనూ, కొరియా ద్వీపకల్పంలోని కీలక భౌగోళిక రాజకీయ కేంద్రాల సమీపంలోనూ, రష్యా పశ్చిమ సరిహద్దులోనూ చురుకుగా పనిచేశాయి. అయితే క్యూబా తీర ప్రాంతంలో వీటి ఉనికి కన్పించడం మాత్రం ఇదే మొదటిసారి. క్యూబాకు మెక్సికో నవతాసాయం
క్యూబాలో నిత్యావసరాలు, మందుల కొరత తీవ్రమైన నేపథ్యంలో ఆ దేశానికి ఐదవ విడతగా నౌకలో మానవతాసాయం పంపామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బమ్ తెలిపారు. క్యూబాపై 1962 నుంచి అమెరికా విధిస్తున్న ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనాన్ని ఆమె వ్యతిరేకించారు. ‘మేము మానవతాసాయాన్ని పంపుతూనే ఉంటాం. వాస్తవానికి మానవతాసాయాన్ని తీసుకొని ఓ నౌక సోమవారం క్యూబాకు బయలుదేరింది. ప్రపంచం లోని అన్ని దేశాలకూ…ముఖ్యంగా క్యూబాకు మెక్సికో సంఘీభావాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది’ అని చెప్పారు. క్యూబాకు రష్యా చమురును సరఫరా చేస్తున్నందున తాము దానిని పంపడం లేదని తెలిపారు. ఇతర నిత్యావసరాల సరఫరాపై తాము దృష్టి సారించామని షెయిన్‌బమ్ అన్నారు.
హవానా పై ట్రంప్ అక్కసు
ఈ పరిణామం సంభవించడానికి కొద్ది వారాల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బహిరంగ వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే ముందు ట్రంప్ ‘స్వేచ్ఛా వాయువులు పీల్చే హవానా’లో పర్యటిస్తారంటూ ఫాక్స్ న్యూస్ కంట్రిబ్యూటర్ చేసిన వ్యాఖ్యను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో తిరిగి పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే క్యూబాపై చమురు దిగ్బంధనానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. క్యూబాపై ట్రంప్ ఇప్పటికే అనేక కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా జాతీయ భద్రతకు క్యూబా ముప్పుగా పరిణమించిందని ఆయన ఆరోపించారు కూడా. అయితే దీనిని క్యూబా అధికారులు తోసిపుచ్చారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమెరికా కనుక తమపై దాడి చేస్తే సుదీర్ఘ గెరిల్లా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.



