Friday, July 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబొగ్గు గనిలో భారీ పేలుడు..32 మంది కార్మికులు మృతి

బొగ్గు గనిలో భారీ పేలుడు..32 మంది కార్మికులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి 32 మంది కార్మికులు మరణించగా, పలువురు భూగర్భంలో చిక్కుకుపోయిన ఘటన పాకిస్తాన్ లోని క్వెట్టా సమీపంలో ఉన్న సోరేంజ్‌లో జరిగింది. భూగర్భంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… బలూచిస్తాన్ ప్రావిన్షియల్ రాజధాని క్వెట్టా శివార్లలోని బొగ్గు గనిలో గురువారం పేలుడు చోటుచేసుకుంది. మీథేన్ గ్యాస్ పేరుకుపోవడం వల్ల ఈ పేలుడు సంభవించిందని గవర్నమెంట్ మైన్ ఇన్‌స్పెక్టర్ ఘనీ బలోచ్ తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బొగ్గు గనిలో పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత ఏడుగురి మృతదేహాలను వెలికితీశారని, ఆ తర్వాత అత్యవసర సహాయక బృందాలు మరో 25 మృతదేహాలను కనుగొన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. భూగర్భంలో చిక్కుకుపోయిన మిగిలిన కార్మికులను గుర్తించి వెలికితీయడానికి సహాయక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

గనిలో చిక్కుకుపోయిన కార్మికులందరీ జాడను గుర్తించే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని మైన్ ఇన్‌స్పెక్టర్ ఘనీ బలోచ్ తెలిపారు. పలువురు కార్మికులు లోపల చిక్కుపోయినందు వల్ల ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. మీథేన్ గ్యాస్ పేలుళ్ల తర్వాత గనిలో ఆక్సిజన్ స్థాయిలు సున్నాకి పడిపోవడంతో కార్మికులు సజీవంగా బయటపడే అవకాశాలు తగ్గిపోయాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో… సహాయక బృందాలు కూడా గని లోపల చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ప్రమాద స్థలం నుంచి వెలికితీసిన మృతదేహాలను ఖననం చేయడం కోసం వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని బలోచ్ చెప్పారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి బంధువులు సమాచారం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

ఇక, ప్రమాద స్థలంలో రెస్క్యూ బృందాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నాయని బలూచిస్తాన్ గనులు, ఖనిజాల శాఖ మంత్రి షోయబ్ నోషెర్వానీ అన్నారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటంబాలకు నోషెర్వానీ సంతాపం తెలియజేశారు. ఈ పేలుడులో మరణించిన ప్రతి గని కార్మికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పాకిస్తానీ రూపాయల (సుమారు 1,800 డాలర్లు) పరిహారం చెల్లిస్తుందని ఆయన చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. అలాగే, గనుల భద్రతా చర్యలను సమీక్షించనున్నట్టుగా వెల్లడించారు. అయితే గనిలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పేలుడు జరిగిందని భావిస్తున్నట్లు బొగ్గు గని కార్మికుల సంఘం పాకిస్తాన్ సెంట్రల్ మైన్స్ లేబర్ ఫెడరేషన్ ఆరోపించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, గనుల భద్రతా చట్టాలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్తాన్‌లోని బొగ్గు గనుల పరిశ్రమలో ముఖ్యంగా బలూచిస్తాన్‌లో ప్రాణాంతక ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. అక్కడి అనేక గనులలో తగినంత వెంటిలేషన్ ఉండదు. అంతేకాకుండా, ఇతర ప్రాథమిక భద్రతా చర్యలు తక్కువగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -