నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ఓ ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. మంగళవారం జత్ తహసీల్‌లోని మోతేవాడి గ్రామంలో ఉన్న మర్గుదేవి ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది. మర్గుబాయి దేవి వార్షిక జాతర సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి.
దీంతో వర్షం నుంచి రక్షణ పొందేందుకు చాలామంది భక్తులు ఆలయ ప్రాంగణంలోని గోడ, రేకుల షెడ్డు కిందకు చేరారు. గాలుల తీవ్రతకు తట్టుకోలేక ఆ గోడ, రేకులు ఒక్కసారిగా వారిపై కూలిపోయాయి. ప్రమాద సమయంలో ఆలయ ప్రాంగణంలో దాదాపు 350 మంది ఉన్నారని సాంగ్లీ ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. మృతుల్లో ముగ్గురు స్థానికులు కాగా, మరో ముగ్గురు కర్ణాటకలోని బీజాపూర్ తాలూకాకు చెందినవారని గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించరు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.



