అమాంతంగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
కొనేందుకు ఆలోచిస్తున్న సామాన్యులు
నవతెలంగాణ–మల్హర్ రావు
చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. రోజూ కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెప్తుండగా కోడిగుడ్డు ధర చూస్తే వాటిని కూడా కొనుక్కుని తినలేని పరిస్థితులున్నాయని ప్రజలు వాపోతున్నారు. జూన్ లో కిలో కోడి మాంసంను రూ.270 నుంచి రూ.280కు రిటైల్ మార్కెట్లో అమ్మారు. జూలై 1వ తారీఖు నుంచి ఆ ధర రూ.300కు చేరి గత వారం రోజుల నుంచి రూ.320కు పెరిగింది. కాగా మార్కెట్లో రూ.320 ఉన్నా కొందరు రిటైల్ వ్యాపారులు తమ లాభాలు తగ్గించుకుని రూ.300కే కిలో చికెన్ అమ్ముతున్నారు.
గుడ్ల ధరలూ అంతే
ఇటీవల కోడిగుడ్ల ధరలు సైతం బాగా పెరిగిపోయాయి. జూన్ లో రిటైల్ దుకాణాల్లో గుడ్డు ధర రూ.7 ఉండగా ప్రస్తుతం రూ.7.50 నుంచి నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. చికెన్,గుడ్ల ధరలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి తటపటాయిస్తున్నారు.కొన్ని రోజులుగా ధరలు పెరగడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు అడ్డగోలుగా పెరగడంతో చికెన్ అమ్మకాలు తగ్గి తమ లాభాలు తగ్గాయని రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు, లాభాలు తగ్గడంతో దుకాణాల నిర్వహణ కష్టంగా మారిందని పలువురు రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు అదుపు చేయాలి..
చికెన్, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ అధికారులు స్పందించి వాటి ధరలు అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జూలై ఆరంభం నుంచి వాటి ధరలు అడ్డగోలుగా పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. కాగా కోళ్ల పెంపకం చేపట్టే కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి చికెన్, గుడ్ల ధరలు ఇష్టానుసారంగా పెంచారని రిటైల్ చికెన్ వ్యాపారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ధరలు అదుపు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



