Saturday, May 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపంటల మ్ముకునేందుకూ పోరాటమే

పంటల మ్ముకునేందుకూ పోరాటమే

- Advertisement -

సకాలంలో కొనక వర్షాలతో తడుస్తున్న మొక్కజొన్న గింజలు
వాటిని ఆరబెట్టుకునేందుకు రైతుల అరిగోస

మార్కెట్లు, ఐకేపీ సెంటర్లలో రైతుల ఎదురుచూపులు

నెలల తరబడి మార్కెట్లలో పడిగాపులు కాస్తున్న రైతుల పిల్లలు, తల్లిదండ్రులు
దిగుబడి రెట్టింపు వస్తుందనే సమాచారమున్నా నిల్వ కేంద్రాల ఏర్పాటులో వైఫల్యం
డబ్బుల సంగతేమోగానీ పంట అమ్ముడుపోతే సాలు అన్న పరిస్థితుల్లో అన్నదాతలు
పంటలు అమ్ముకునేందుకు రైతుల ఖర్చులు రెట్టింపు
నాగర్‌ కర్నూల్‌ మార్కెట్‌ యార్డులో నవతెలంగాణ పరిశీలనలో వెల్లడి

ఈ ముగ్గురు రైతుల‌దే కాదు. నాగ‌ర్ క‌ర్నూల్ మార్కెట్ యార్డులోని ఏ రైతును క‌దిలించినా ఈ రీతిలోనే బాధలను వెళ్లగక్కుతున్నరు. రాష్ట్రంలో ఏ ఐకేపీ సెంట‌ర్‌కెళ్లినా, మార్కెట్ యార్డుకెళ్లినా, గ్రామాల్లో రోడ్ల మీద అడిగినా రైతుల క‌న్నీటి మాట‌లే వినిపిస్తున్నాయి. పంట పండించేదాకా ప్ర‌కృతితో పోరాటం, పంట పండించాక అమ్ముకునేందు ప్ర‌భుత్వంతో పోరాటం అన్నట్టుగా రైతు పరిస్థితి తయారైంది. పాల‌కులు స‌కాలంలో పంట‌లను కొన‌క‌పోవ‌డం వ‌ల్ల అంతిమంగా అన్న‌దాత‌ క్షోభకు గురవుతున్నాడు. నాగ‌ర్ క‌ర్నూల్ మార్కెట్ యార్డును నవతెలంగాణ సందర్శించగా రైతులు ప‌డుతున్న గోస‌లు కండ్లకు కట్టినట్టు క‌నిపించాయి. మొక్క‌జొన్న పంట సేక‌ర‌ణ‌లో ప్ర‌భుత్వ లోపాలను ఎత్తిచూపాయి. రైతులు రెక్క‌ల క‌ష్టం మీద ఆధార‌ప‌డి బ‌తికేటోళ్లు. కాబ‌ట్టి నెల‌ల త‌ర‌బ‌డి ఈడ‌నే ఉంటే పూట‌గ‌డ్వ‌ద‌ని త‌మ త‌ల్లుల‌ను, తండ్రుల‌ను, పిల్ల‌ల‌ను మార్కెట్‌‌లోని పంట‌ల కుప్పల ద‌గ్గ‌ర ఉంచి పోతున్న ప‌రిస్థితి. ‘పొద్దుగాల అయిదారు గంట‌ల‌కు స‌ద్దులు క‌ట్టుకుని, మూడు నాలుగు ప్లాస్టిక్ డ‌బ్బాల్లో నీళ్లు ప‌ట్టుకొచ్చ‌కుని వ‌స్తున్నం. ఎర్ర‌టెండ‌ల అగ‌డి కొడ్తుంటే గీడ రేకుల కింద కూసుకుంటున్నం. రాత్రి కావంగ‌నే నా కొడుకుకొచ్చి తీస్కపోతడు ’ అని ఓ రైతు తండ్రి తాను ప‌డుతున్న బాధ‌ను వెళ్ల‌గ‌క్కుకున్నాడు. ‘మొక్క‌జొన్న కొనుగోళ్ల‌ను సీరియ‌ల్ ప్ర‌కార‌మే న‌డుపుతున్నాం. రైతులు చెబుతున్న‌ట్టు నెల, రెండు నెల‌లు ప‌ట్ట‌ట్లేదు. టోక‌న్ ఇచ్చిన ప‌ది, ప‌దిహేను రోజుల్లో కొంటున్నాం’ అని అధికారులు స‌మ‌ర్థించుకుంటున్నారు. రైతులేమో ‘మేం పంట‌లు తెచ్చి నెల‌, నెల‌న్న‌ర‌, రెండు నెల‌లు అవుతున్న‌దని చెప్పారు. ‘20 నుంచి 35 రోజుల దాకా మా సీరియ‌ల్ వ‌స్త‌లేదు. మ‌ధ్య‌లో వాన‌లు ప‌డితే మ‌ళ్లీ సంచుల్లో నుంచి కింద బోసి ఆర‌బెట్టాల్సి వ‌స్తున్న‌ది’ అని అన్నదాతలు వాపోయారు.

ఇదే విష‌యాన్ని మార్కెట్ అధికారులను, పంటలు కొనుగోలు చేస్తున్న వారి దృష్టికి తీసుకెళ్తే… ‘మేం సంచులు ఇచ్చిన త‌ర్వాత టోకెన్ల‌ను ఇస్తున్నాం. ఆ నెంబ‌ర్ల‌ను మాత్రమే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నం. మొద‌ట్ల లారీలు, బ‌స్తాల కొర‌త వ‌ల్ల అల‌స్య‌మైంది వాస్త‌వ‌మే. గోదాముల్లో స్థ‌లం లేదు. అయినా, కొన్న మక్క‌లు త‌డువొద్ద‌ని ఇక్కడ స్పేస్ లేక‌పోయినా రేకులు తాకే దాకా నెట్ కొట్టిస్తున్నాం. ఇప్పుడు లారీల స‌మ‌స్య లేదు. బైట‌కు పోతే(వేరే నిల్వ కేంద్రాల్లోకి) తొంద‌ర‌గ అయిపోతుండే. వానలొస్తయనే భయంతోనే తొందరతొందర కాంటాలేపిస్తున్నాం. రైతుకు మేం చేయాల్సిందల్లా చేస్తున్నాం. ఈ నెలాఖరుకల్లా మక్కల కొనుగోలును పూర్తిచేస్తాం’ అని వివ‌రించారు. గోదాముల్లో మ‌నిషి త‌ల తాకే వ‌ర‌కు మొక్క జొన్న బ‌స్తాల‌ను వేయిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. అంత‌ పెద్ద మార్కెట్‌లో కేవ‌లం 30 మంది హ‌మాలీలు మాత్ర‌మే క‌నిపించారు. వారు కూడా బీహార్ నుంచి వ‌చ్చిన‌వారే. వారి భాష రైతుల‌కు, రైతుల భాష వారికి అర్థం కావ‌డం లేదు. లారీల్లోకి బ‌స్తాలు ఎత్తే స‌మ‌యంలో కొన్ని బస్తాలు త‌క్కువ అయితే, త‌క్కువ పంట‌ను తీసుకొచ్చిన రైతుల‌వి ఎత్తించే క్రమంలో వెనక వచ్చినవాళ్లవి ఎలా ఎత్తిస్తారనే విషయంపై విభేధాలు నెలకొంటున్నాయి. మార్కెట్‌లో ప‌క్క‌ప‌క్క‌నే మక్క‌లు ఎండ‌బోసి బస్తాల్లోకి ఎత్తించే స‌మ‌యంలో కొంత మంది రైతుల బ‌స్తాల మిస్సవుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

బాల‌స్వామి అనే రైతు మాట్లాడుతూ.. ‘నేను తెచ్చిన బ‌స్తాల నుంచి ఆరు త‌క్కువ అయిన‌యి. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఈ పరిస్థితేంది? ఏడెనిమిది వేలు నష్టపోవాల్సి వస్తున్నది’ అని గోడు వెళ్ల‌బోసుకున్న‌డు. ఆ లెక్క తేలాల‌ని ప‌క్క రైతుల‌తో గొడ‌వ‌లు పెట్టుకుంటున్న ప‌రిస్థితి కనిపించింది. ఈ ఏడాది మొక్క‌జొన్న పంట దిగుబ‌డి రెండు రెట్లు అధికంగా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌భుత్వానికి సమాచారం ఉన్నా ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పడు మార్కెట్ యార్డుల్లోని గోదాములు స‌రిపోని ప‌రిస్థితి. ఇప్ప‌డు హ‌డావిడిగా ప్ర‌యివేటు గోదాముల‌ను వెతుకుతున్న ప‌రిస్థితి క‌నిపించింది. ‘స‌ర్కారు ముందుగానే స్పందిస్తే పంట త‌డిసేది కాదు.. రైతులు నెల‌లు త‌ర‌బ‌డి వేచి చూడాల్సి దుస్థితి వ‌చ్చేది కాదు’ అని రైతు సంఘాల నేతలు సర్కారు విధానపరమైన లోపాలను ఎత్తిచూపుతున్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు మార్కెట్ల‌లో నెల‌ల త‌ర‌బ‌డి వేచి చూడ‌టాన్ని బ‌ట్టే మ‌న వ్య‌వ‌స్థ ఎంత నిర్ల‌క్ష్యంగా ఉందో అర్థ‌మ‌వుతున్న‌ది.

రెండు నెల‌ల సంది దీనిచుట్టే తిరుగుతున్న‌
పంట మంచిగ‌ ప‌డింది గానీ అమ్ముకునేందుకు వ‌చ్చి గీ బాధ‌లు ప‌డ్తున్నం. 322 బ్యాగుల మక్క‌లు తీసుకొచ్చి రెండు నెల‌లైతాంది. ఫ‌స్టు బ‌స్త‌ల‌ల్ల నింపిన‌ప్ప‌డు వాన‌లు ప‌డ‌లే. బ‌స్తాలల్ల‌ నింపి కుట్లేసినంక వాన‌లు ప‌డ్డ‌యి. మ‌ళ్ల ఆర‌బెట్ట‌మ‌న్న‌రు. ఆరినంక మ‌ళ్ల బ‌స్త‌లల్ల‌కి రెండు సార్లు ఎత్తేటందుకు, కుట్లేసినందుకు 14 వేలు అయిన‌యి. టిప్ప‌ర్ల‌తోని ఈడ్కి తెప్పించినందుకు ప‌దివేలు అయిన‌యి. ఇయ్యాల‌న‌న్న లోడ్ అయితదో? లేదో? రెండు నెల‌ల సంది ఎండ‌ల‌ప‌డి దీనిచుట్టే తిరుగుతున్న‌.
రైతు బాల‌స్వామి, బిజినేప‌ల్లి మండ‌లం మాదంపేట గ్రామం, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా.

ఎంత ఇబ్బంది పడ్తున్నమో మాకు మాత్రమే దెల్సు
పొద్దుగాళ్ల ఆరుగంట‌ల‌కు వ‌చ్చిన‌. నెల‌న్న‌ర నుంచి ఎంత ఇబ్బంది ప‌డ్తున్న‌మో మాకు దెల్సు. ఇయ్యాళ మ‌స్తు ఎండ‌గొడ్తున్న‌ది. గాలిదుమార‌మొస్తున్న‌ది. ఇంతకుమునుపే వానలుపడి మక్క‌లు కొట్టుకుపోయిన‌యి. నాని గుంత‌ల‌ల్ల మొల‌కెత్తిన‌యి. మూడు దినాలు ఆర‌బెట్టి మ‌ళ్లీ బ‌స్తాలల్లకు ఎత్తిపించి కుట్లేపిస్తే మ‌ళ్ల 14 వేలు అయిన‌యి. బ‌స్తాల‌ల్ల నింపి, ద‌బ్డంతోని కుట్లు వేసినోళ్ల‌కు బ‌స్తాకు రూ.21.5, లోడుకు ఎత్తిన హ‌మాలీల‌కు రూ.17 వేలు ఇచ్చిన‌. ఇయ్యాల‌నే లోడు అయింది. నా దాంట్ల‌కెళ్లి ఒక బ‌స్తా ఎవ్వ‌రో ఎత్తుకుపోయిండ్రు. రైతు సొమ్ము ఎత్తుకపోయినోడు ఏం పెద్ద‌గాడు.
రైతు రాములు, వనపట్ల, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా, మండ‌లం

ఈసారి నాకు దండుగ‌నే పంట
మంచి టైమ్‌ల కాల్వ బంద్ అయింది. రెండున్న‌రెక‌రాలేస్తే 70 బ‌స్తాలే అయిన‌వి. మంచిగ పండితే ఎక‌రంలో పండే పంట అది. నా కొడుకు నెల సంది నన్ను ఈ మార్కెట్ల మక్క‌ల కావ‌లే ఉంచుతున్న‌డు. 20 బ‌స్తాల యూరియేసినం. నాలుగు బ‌స్తాలు అడుగుపిండి బోసినం. పూత నిల‌బెట్టుకునేందుకు మూడు సార్లు మొక్కజొన్న మొగిల్ల మందు పిండినం. మొత్తం పెట్టుబ‌డి ఎంతైందో నా కొడుక్కే తెల్సు బిడ్డ‌. ఈసారి దండుగ‌నే పంట‌. గీ పంట‌ను అమ్ముకునేందుకు గీ ఎండ‌ల‌ల్ల గీ బాధ‌లు ప‌డ్తున్నం. ఎప్పుడెత్తుత‌రో ఏమో.
ప‌ద్మ‌మ్మ, సిరిపురం గ్రామం, నాగ‌ర్ క‌ర్నూల్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -